దాక్కో దాక్కో మేక.. 'పుష్ప' ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే?
on Aug 2, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గతంలో బన్నీ-సుకుమార్-డీఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో పుష్ప ఆడియో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పుష్ప ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ వచ్చింది.
నేడు(ఆగష్టు2) డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప మూవీ ఓ అప్డేట్ ఇచ్చింది. పుష్ప సినిమా నుంచి మొదటి పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ ఈ పాటను పాడనున్నారు. తెలుగులో శివమ్, తమిళంలో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్, కన్నడలో విజయ్ ప్రకాశ్, హిందీలో విశాల్ దద్లాని ఈ పాటను ఆలపించనున్నారు. తెలుగులో ఈ పాట "దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక" అంటూ సాగనుంది.
'అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా 'పుష్ప'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read