నేను నాన్ లోకల్ ఎలా అవుతాను: ప్రకాష్ రాజ్
on Jun 25, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మా అధ్యక్ష బరిలో నిలబడుతున్నట్టు ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. ప్రకాష్ రాజ్ అయితే ఓ అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే తన ప్యానల్ ని కూడా ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ వ్యక్తి అని, ఆయనను మా అధ్యక్షుడిగా ఒప్పుకునేది లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 'మా' ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ సమస్య ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.
మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్లు.. తాను ఏడాది నుంచి ప్యానల్ ఏర్పాటుపై ఆలోచన చేసినట్లు తెలిపారు. తనను నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని.. గత ఎన్నికల్లో రాని లోకల్- నాన్ లోకల్ ఇష్యూ.. ఇప్పుడే ఎందుకు? వస్తుందని ఆయన నిలదీశారు. కళాకారులు యూనివర్సల్ అని.. అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానని ప్రశ్నించారు. అవార్డులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనే ప్రస్తావన రాలేదు.. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ అని అనలేదు.. మరి ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అంటున్నారు? అని ప్రశ్నించారు.
కేవలం తనకు పరిచయం ఉందన్న కారణంతో తాను ఓట్లు అడగడం లేదని.. 'మా' అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని, అందరూ ఆశ్చర్యపడేలా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. తాను పదవి కోసం రాలేదని, పనిచేయడానికి వచ్చానని తెలిపారు. తన ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు ఉన్నారని.. తాను తప్పు చేసినా బయటికి పంపిస్తారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
Also Read