'పొన్నియిన్ సెల్వన్'పై వివాదం.. అప్పట్లో హిందూత్వం లేదని కమల్ సంచలనం!
on Oct 6, 2022
కల్కి కృష్ణమూర్తి ఫేమస్ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా దిగ్దర్శకుడు మణిరత్నం అదే పేరుతో రూపొందిస్తోన్న రెండు భాగాల సినిమాలో 'పొన్నియిన్ సెల్వన్ 1' ఇటీవల విడుదలైంది. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, జయం రవి, శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, మిగతా భాషల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోయింది. పాత్రలు మరీ ఎక్కువవడం, ఆ పాత్రల పేర్లు తమిళులకు తప్ప మిగతావారికి నోరు తిరిగేట్లు లేకపోవడంతో వారు సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు.
మరోవైపు రాజమౌళి 'బాహుబలి'తో 'పొన్నియిన్ సెల్వన్'ను పోలుస్తూ, మణిరత్నం డైరెక్షన్‌ను, స్క్రీన్ప్లేనూ విమర్శిస్తున్నారు. ఇది తమిళనాట వివాదాన్ని సృష్టించింది. చోళుల్ని చూపించిన విధానంపై కొంతమంది మణిరత్నంను విమర్శించగా, రాజరాజచోళుడు హిందువు కాదని డైరెక్టర్ వెట్రిమారన్ వ్యాఖ్యానించడం వివాదం రాజుకుంది. లేటెస్ట్గా వెట్రిమారన్‌ను కమల్ హాసన్ సమర్ధించారు. 'పొన్నియిన్ సెల్వన్' మూవీని ఈరోజు స్పెషల్ షో ద్వారా తిలకించిన ఆయన, ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "సినిమా నచ్చితే ఏ భాషవారైనా ఆదరిస్తారు. మనం శంకరాభరణంను ఆదరిస్తే, వారు మన మరో చరిత్రను ఆదరించారు. 'పొన్నియిన్ సెల్వన్' అనేది తమిళ చరిత్రకు సంబంధించిన కథ. దాన్ని ఇతర భాషలవాళ్లు ఆదరించాలనే రూల్ లేదు. దానికోసం వాళ్లను తిట్టడం సరైన పనికాదు" అని చెప్పారు. అదే సందర్భంగా రాజరాజచోళుడి కాలంలో హిందూత్వం అనేది లేదన్నారు. అప్పట్లో శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయనీ, హిందూమతం అనేది లేదని చెప్పారు. బ్రిటిషర్లు మనల్ని ఎలా పిలవాలో తెలీక హిందువులంటూ మనల్ని సంబోధించారని ఆయన అన్నారు.