వెంకీ `ఒంటరి పోరాటం`కి 32 ఏళ్ళు!
on May 18, 2021
కథానాయకుడిగా విక్టరీ వెంకటేశ్ ప్రయాణం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన `కలియుగ పాండవులు` (1986)తో విజయవంతంగా మొదలైంది. ఆపై వీరిద్దరి కాంబినేషన్ లో మరో ఏడు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో సింహభాగం వసూళ్ళ వర్షం కురిపించాయి. అలా.. సక్సెస్ అయిన సినిమాల్లో `ఒంటరి పోరాటం` ఒకటి. సూర్యదేవర రామ్మోహనరావు కథను అందించిన ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చారు. వెంకీకి జోడీగా నూతన కథానాయికలు శ్వేత, రూపిణి నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో `సహజనటి` జయసుధ ముఖ్య భూమిక పోషించగా.. సత్యనారాయణ, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్ రాజ్, అన్నపూర్ణ, శుభ, డబ్బింగ్ జానకి ఇతర కీలక పాత్రల్లో దర్శనమిచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిథి పాత్రలో మెరిశారు.
ఈ చిత్రానికి దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు సమకూర్చగా.. వేటూరి, జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. ``పెదవి మీద ముద్దు``, ``నువ్వు రెడీ నేను రెడీ``, ``పడాలి ప్రేమలోన``.. వంటి గీతాలు ప్రాచుర్యం పొందాయి. డీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మించిన `ఒంటరిపోరాటం`.. 1989 మే 18న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 32 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read