మలయాళం మూవీలో మోహన్‌లాల్ తెలుగు డైలాగ్!
on Apr 15, 2021
మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్ తెలుగు డైలాగ్ చెప్పారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు కదా.. అందులో ఆశ్చరపడాల్సింది ఏముంది.. అనుకుంటున్నారా? ఆగండి. ఆయన ఆ డైలాగ్ చెప్పింది తెలుగు సినిమాలోనో, లేదా ఎవరినైనా తెలుగువారిని కలుసుకున్నప్పుడో కాదు.. ఒక మలయాళం సినిమాలో! అవును. తన లేటెస్ట్ ఫిల్మ్ ఆరట్టు కోసం ఆయన తెలుగులో మాట్లాడారు.
'దృశ్యం 2' లాంటి థ్రిల్లర్ తర్వాత ఆయన నటిస్తోన్న చిత్రం 'ఆరట్టు' టీజర్ రిలీజైంది. ఆ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉంది. అది మోహన్‌లాల్ చెప్పిన తెలుగు డైలాగే! అదేమిటంటే.. "నేను వాడిని చంపేస్తాను" అని. ఒక యాక్షన్ ఎపిసోడ్ సందర్భంగా రౌడీలను చితక్కొడుతూ, వారికి వార్నింగ్ ఇచ్చాడు మోహన్‌లాల్. అంటే.. వాళ్ల బాస్‌ను చంపేస్తానని వాళ్లతో అన్నాడన్న మాట. దాన్ని బట్టి చూస్తుంటే.. ఆ రౌడీలు తెలుగు ప్రాంతానికి చెందినవాళ్లనే అభిప్రాయం కలుగుతోంది.
టీజర్ ఆరంభంలో కారులోంచి దిగి, కాలుదువ్వి మరీ ఫైటింగ్‌కు సిద్ధమైపోయారు మోహన్‌లాల్. ఎప్పట్లా గడ్డం, షర్టు, లుంగీతో ఆకట్టుకున్నారు. వయసు మరింతగా తగ్గినట్లు అనిపించేలా హుషారుగా కనిపిస్తున్నారు. 'ఆరట్టు' అనేది విలేజ్ నేపథ్యంలో నడిచే కథగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. మాస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ మూవీని డైరెక్టర్ ఉన్నికృష్ణన్ బి. రూపొందిస్తున్నాడు. ఉదయ్‌కృష్ణ కథ అందించగా, రాహుల్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో విజయ్ రాఘవన్, సాయికుమార్ (మలయాళం నటుడు), సిద్దిఖ్, జాన్ ఆంటోనీ, నందు, కొట్టాయం రమేశ్, రచన నారాయణ్కుట్టి, శ్వాసిక, మాళవికా మీనన్ ఇతర పాత్రధారులు. విజయ్ ఉళగనాథ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. త్వరలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.