సమంత సరసన 'దుష్యంతుడు' ఈ అందగాడే!
on Mar 6, 2021
గుణశేఖర్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన 'శాకుంతలం'లో శకుంతల పాత్రధారిగా సమంత అక్కినేని ఇదివరకే ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా దుష్యంతుని పాత్రకు ఒక మలయాళీ నటుడిని ఎంపికచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు గుణశేఖర్. ఆ పాత్రను ఎవరు చేస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ దేవ్ మోహన్ అనే నటుడ్ని ఎంపికచేశారు. గమనించదగ్గ విషయమేమంటే అతను సీనియర్ యాక్టర్ కాదు. మోడల్‌గా పేరు తెచ్చుకున్న దేవ్ మోహన్ గత ఏడాదే 'సూఫియుమ్ సూజాతయుమ్' అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అది కూడా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఆ మూవీలో టైటిల్లోని సూఫి అనే హీరో క్యారెక్టర్‌ను అతను పోషించాడు.
మహాభారతం ఆదిపర్వంలో వచ్చే శకుంతల దుష్యంతుల ప్రేమగాథ ఎంతో ప్రసిద్ధమైంది. ముని కన్యక అయిన శకుంతలను అడవిలో వేటకు వచ్చిన దుష్యంత మహారాజు చూసి, మోహిస్తాడు. ఆమెకూడా ఆయనకు మనసిస్తుంది. గాంధర్వ పద్ధతిన వివాహం చేసుకుని, కాపురం చేశాక, ఆమెను వదిలి తన రాజ్యానికి వెళ్లిపోతాడు దుష్యంతుడు. ఆయనను వెతుక్కుంటూ వస్తుంది శకుంతల.
ఇలాంటి కథలో దుష్యంతునిగా ఏ పేరుపొందిన నటుడినో గుణశేఖర్ తీసుకుంటారనుకుంటే ఆయన ఎవరూ ఊహించని రీతిలో దేవ్ మోహన్‌ను తీసుకోవడం ఆశ్చర్యకరం. ఆడిషన్ చేసి, ఆ పాత్రకు అతను సరిగ్గా సరిపోతాడని నమ్మి ఎంపిక చేశారు గుణశేఖర్. నిజానికి దేవ్ మోహన్ మంచి అందగాడు. తెరపై శకుంతల దుష్యంతులుగా సమంత, దేవ్ మోహన్ ఎలా ఉంటారో చూడాల్సిందే.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అతడిని పరిచయం చేశారు సమంత. ఓ మోషన్ పోస్టర్ ద్వారా అతడి పేరును పరిచయం చేసి, "Here’s introducing our Prince Charming ... DUSHYANT Prince @ActorDevMohan" అని ట్వీట్ చేశారు.
మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న 'శాకుంతలం' చిత్రానికి నీతా లుల్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం భారీ స్థాయిలో ఓ సెట్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read