విజయేంద్రప్రసాద్ స్క్రిప్టుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ 'సీత'
on Feb 27, 2021
బాహుబలి, బజ్రంగీ భాయిజాన్, మణికర్ణిక సినిమాల స్క్రిప్టులతో విజయేంద్రప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆయన స్వయానా యస్.యస్. రాజమౌళి కన్నతండ్రి. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మూవీకి స్క్రిప్ట్ రైటర్ ఆయనే. అలాగే కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తోన్న 'తలైవి'కి స్క్రిప్ట్ చేకూర్చింది విజయేంద్రప్రసాదే. ఇప్పుడాయన మరో ప్యాన్ ఇండియా మూవీకి, అందునా ఒక మైథలాజికల్ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఆ సినిమా పేరు 'సీత.. ది ఇన్కార్నేషన్'.
మల్టీలింగ్యువల్‌గా ఇది రూపొందనుంది. ప్రధానంగా కన్నడంలో తీసే ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. హ్యూమన్ బీయింగ్ స్టూడియో బ్యానర్‌పై నిర్మాణమయ్యే ఈ మూవీకి అలౌకిక్ దేశాయ్ దర్శకుడు. కథ, స్క్రీన్‌ప్లేలను విజయేంద్రప్రసాద్, అలౌకిక్ కలిసి తయారుచేస్తున్నారు.
మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్లో "యాన్ అన్‌టోల్డ్ స్టోరీ" అనే క్యాప్షన్ కనిపించడం గమనార్హం. శ్రీరామచంద్రుని ఇల్లాలిగా, మహాసాధ్విగా భారతీయులు కొలిచే సీత గురించి తెలియనిదెవరికి? మరి ఈ క్యాప్షన్‌కు అర్థమేమిటి? అనేది ఆసక్తికరం. టైటిల్ డిజైన్‌లో డేగ కూడా కనిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ ప్రధానంగా భారతదేశపు మైథలాజికల్ మాగ్నమ్ ఓపస్‌గా ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ అద్భుత అనుభవాన్నిస్తుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో ఎవరు టైటిల్ రోల్ చేస్తున్నారు, ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.