'మాచర్ల' వచ్చింది.. 'బింబిసార'కు కలిసొచ్చింది!
on Aug 12, 2022
ఆగస్టు 5న విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' రెండు సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకొని, వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని లాభాల బాట పట్టాయి. వరల్డ్ వైడ్ గా రూ.15.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బింబిసార.. వారం రోజుల్లోనే రూ.25.57 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే బయ్యర్లకు 9 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇక సీతా రామం కూడా రూ.16.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా ఇప్పటికే 19.18 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా దిశగా పయనిస్తోంది. తాజాగా ఈ రెండు సినిమాలకు మరో అంశం కలిసొచ్చింది.
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' నేడు(ఆగస్టు 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు పక్కా కమర్షియల్ సినిమా కావడంతో.. మాస్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారని.. దాంతో 'బింబిసార', 'సీతా రామం' చిత్రాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఈరోజు విడుదలైన మాచర్ల నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ కథనాల్లో బలం లేదని, అసలు మెయిన్ స్టోరీ లైన్ లోనే లాజిక్ లేదని అంటున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ స్టోరీతో ఎలా దర్శకుడిగా మారాడని, ఈ కథలో అసలు ఏముందని నితిన్ సొంత బ్యానర్ లో నిర్మించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాచర్ల నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో 'బింబిసార', 'సీతా రామం' చిత్రాలకు కలిసి రానుంది. ముఖ్యంగా 'బింబిసార' సినిమాకు బాగా ప్లస్ కానుంది. 'సీతా రామం'తో పోల్చితే మాస్ ఆడియన్స్ 'బింబిసార'కు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మాచర్ల పాజిటివ్ తాను తెచ్చుకుంటే 'బింబిసార' కలెక్షన్లకు గండి పడుండేది. కానీ ఇప్పుడు మాచర్లకు ప్లాప్ టాక్ రావడం 'బింబిసార'కు కలిసొచ్చిందనే చెప్పాలి.