ఆకట్టుకుంటున్న 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్!
on Oct 7, 2022
'మత్తు వదలరా' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ సింహా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భాగ్ సాలే'. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రణీత్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇదొక విలువైన ఉంగరం చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది.
టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. "ఈతరం ప్రేక్షకులని అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది." అన్నారు.
ఈ చిత్రంలో నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ విజయ్, నందిని రాయ్ నెగటివ్ పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా రమేష్ కుషేందర్, ఎడిటర్ గా కార్తీక ఆర్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధమవుతోంది.