'బ్రహ్మోత్సవం' బాలనటి హీరోయిన్గా డిస్నీ మూవీ 'స్పిన్'!
on Jul 27, 2021
మహేశ్‌బాబు కజిన్ రోల్లో 'బ్రహ్మోత్సవం'లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు గుర్తుందా? ఇంకా గుర్తుకురాకపోతే.. 'ప్రేమమ్'లో ఓ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన అమ్మాయి, 'రారండోయ్ వేడుక చూద్దాం'లో చిన్నారి భ్రమరాంబ (రకుల్‌ప్రీత్ చిన్నప్పటి) క్యారెక్టర్లో కనిపించిన అమ్మాయి, 'అజ్ఞాతవాసి'లో సంపత్‌రాజ్ కూతురుగా నటించిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయి ఇప్పుడు డిస్నీ మూవీ 'స్పిన్'లో మెయిన్ రోల్లో నటించింది. యు.ఎస్.లో ఆగస్ట్ 13న విడుదలవుతున్న ఆ మూవీ, ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
డీజే మిక్సెస్‌ను క్రియేట్ చేయాలనే ప్యాషన్‌తో ఉండే రియా కుమార్ అనే ఇండియన్ అమెరికన్ టీనేజర్ కథ 'స్పిన్'. ఆ పాత్రలో అవంతిక నటించగా, ఆమె తండ్రి అరవింద్ కుమార్‌గా బాలీవుడ్ యాక్టర్ అభయ్ డియోల్ కనిపించనున్నాడు. ఈ మూవీని మంజరి మకింజనీ డైరెక్ట్ చేశారు.
గత నెలలో 'స్పిన్' ట్రైలర్ రిలీజైనప్పుడు, "ప్రేక్షకులు నన్ను ఉత్కంఠభరితమైన, కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోబెట్టే సినిమాల్లో, నటనకు సవాలు విసిరే పాత్రల్లో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. స్పిన్ నా హృదయానికి దగ్గరైన సినిమా. యువ ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమా. ఈ సినిమా చూశాక మీ పెదాలపై చిరునవ్వు వెలుస్తుంది. హాయిగా ఫీలవుతారు." అని తన సోషల్ మీడియా హ్యాండిల్లో రాసుకొచ్చాడు అభయ్ డియోల్.