'పుష్పక విమానం'లో ఆనంద్ దేవరకొండ విహారం!
on Mar 1, 2021
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా 'దొరసాని' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. రెండో సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో నటుడిగా తనకంటూ సొంత అస్తిత్వాన్ని సాధించాడు. థియేటర్లలో కాకుండా స్ట్రెయిట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన ఆ సినిమాలో గుంటూరులో హోటల్ పెట్టి పేరు తెచ్చుకోవాలనుకొనే యువకుడిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆనంద్.
ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ మూవీ పేరు 'పుష్పక విమానం'. ఈ సినిమాతో దర్శకునిగా దామోదర పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ సమర్పిస్తోన్న ఈ మూవీని కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు.
న్యూస్‌లో చూసిన ఓ ఘటనకు ఇన్స్పైర్ అయ్యి, నిజ జీవిత క్యారెక్టర్లను జోడించి ఈ కథను తయారుచేసుకున్నట్లు డైరెక్టర్ దామోదర చెప్పాడు. మొదట అతను ఈ కథను విజయ్, ఆనంద్‌ల తండ్రి గోవర్ధన్ రావుకు చెప్పాడు. ఆయనకు బాగా నచ్చడంతో తనే నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశారు.
'పుష్పక విమానం'లో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. అతని సరసన నాయికలుగా శాన్వి మేఘన, గీత్ సాయిని నటిస్తున్నారు. సునీల్, నరేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ కథ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ, పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని మ్యూజిక్ సమకూరుస్తుండగా, హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
Also Read