డైరెక్టర్ క్రిష్ కి ఏమైంది..?
on Sep 5, 2025

టాలీవుడ్ లో ప్రతిభగల దర్శకులలో క్రిష్ ఒకరు. వైవిధ్యమైన కథలకు, బలమైన భావోద్వేగాలకు ఆయన పెట్టింది పేరు. అలాంటి క్రిష్.. సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అసలు క్రిష్ కి ఏమైంది? అంటూ సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. (Krish Jagarlamudi)
2008లో విడుదలైన 'గమ్యం'తో దర్శకుడిగా పరిచయమైన క్రిష్.. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి వైవిద్యభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
2017లో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత క్రిష్ సక్సెస్ చూడలేదు. ఓ రకంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. బాలకృష్ణతో చేసిన ఎన్టీఆర్ బయోపిక్ కి ప్రశంసలు దక్కాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర కాసులు కురవలేదు. హిందీలో 'మణికర్ణిక' చేయగా.. ఏదో వివాదమై కంగనా రనౌత్ డైరెక్టర్ గా తన పేరు కూడా వేసుకుంది. ఇక 2021 లో 'కొండపొలం' విడుదల కాగా, అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' అనే భారీ సినిమాను మొదలుపెట్టి, బాగా ఆలస్యమవ్వడంతో మధ్యలోనే బయటకు వచ్చేశారు. అదీ పరాజయం పాలైంది. అనుష్కతో చేసిన 'ఘాటి'తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నారు క్రిష్. కానీ, తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో క్రిష్ ఖాతాలో మరో ఫ్లాప్ పడేలా ఉంది.
ఫ్లాప్ పడినంత మాత్రాన క్రిష్ ని ఎవరూ తక్కువంచనా వేయరు. ఆయన ప్రతిభ ఏంటో అందరికీ తెలుసు. సరైన కంటెంట్ దొరికితే వండర్స్ క్రియేట్ చేయగలరు. క్రిష్ తన తదుపరి సినిమాని బాలకృష్ణతో చేసే అవకాశముంది. ఇది 'ఆదిత్య 369'కి సీక్వెల్ అనే ప్రచారం ఉంది. తన నెక్స్ట్ ఫిల్మ్ తోనైనా క్రిష్ కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



