'విజయ్ మక్కల్ ఇయక్కం' పార్టీ రద్దు!!
on Sep 28, 2021
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఎట్టకేలకు ఊరట లభించింది. విజయ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రద్దు చేశారు. 'విజయ్ మక్కల్ ఇయక్కం' పార్టీని రద్దు చేసినట్టు ఎస్ఏ చంద్రశేఖర్ తాజాగా చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను ఏర్పాటు చేశారు. అయితే తన తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పేరుతో వారు కార్యకలాపాలను సాగిస్తూ ఉండటంతో.. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ విజయ్ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టారు. తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని చెన్నై హక్కుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను రద్దు చేశామని తెలుపుతూ కోర్టులో విజయ్ తండ్రి సమాధాన పిటిషన్ దాఖలు చేశారు.