Telusu Kada Review: తెలుసు కదా మూవీ రివ్యూ
on Oct 17, 2025

తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష చెముడు, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: తమన్
డీఓపీ: జ్ఞానశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
రచన, దర్శకత్వం: నీరజ కోన
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: అక్టోబర్ 17, 2025
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్ కి చేరువైన సిద్ధు జొన్నలగడ్డ.. గత చిత్రం 'జాక్'తో నిరాశపరిచాడు. ఇప్పుడు 'తెలుసు కదా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా మారడం విశేషం. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్రచార చిత్రాలతో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కంటెంట్ తో సర్ ప్రైజ్ చేసిందా? దర్శకురాలిగా నీరజ కోన తొలి ప్రయత్నం ఫలించిందా? సిద్ధు కమ్ బ్యాక్ ఇచ్చాడా? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం. (Telusu Kada Review)
కథ:
వరుణ్(సిద్ధు జొన్నలగడ్డ) అనాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అయినప్పటికీ తన కాళ్ళ మీద తాను నిలబడి.. సొంతంగా రెస్టారెంట్ పెట్టి, ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవుతాడు. భార్య, పిల్లలతో తనకంటూ ఓ మంచి కుటుంబం ఉండాలని కలలు కంటాడు. కాలేజ్ టైంలోనే రాగ(శ్రీనిధి శెట్టి)ని ప్రేమించి, ఆమెతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటాడు. కానీ, ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. దాంతో అప్పటినుంచి అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ప్రేమ జోలికి వెళ్ళడు. ప్రాణ మిత్రుడు అభి(హర్ష చెముడు) సూచనతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు.. తనకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అంజలి(రాశి ఖన్నా)లో కనిపిస్తాయి. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. జీవితం హ్యాపీగా సాగిపోతుంటుంది. అలాంటి సమయంలో అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. ఆ బాధలో వరుణ్ ఉండగా.. తన జీవితంలోకి మళ్ళీ రాగ(శ్రీనిధి శెట్టి) వస్తుంది. సరోగసీ ద్వారా వరుణ్-అంజలిల బిడ్డను మోయడానికి సిద్ధపడుతుంది. దానికి వరుణ్ కూడా ఒప్పుకుంటాడు. అసలు రాగ, వరుణ్ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? ఆమె రాకతో వరుణ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? రాగ తన భర్త మాజీ ప్రేయసి అని తెలిశాక అంజలి ఏం చేసింది? వరుణ్ దీని నుండి ఎలా బయటపడ్డాడు? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పెళ్లయిన మగాడి జీవితంలోకి మాజీ ప్రేయసి మళ్ళీ వస్తే, అది కూడా సరోగసికి ఒప్పుకుంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కథలు హాలీవుడ్ లో, బాలీవుడ్ లో కనిపిస్తుంటాయి కానీ, తెలుగు ప్రేక్షకులకు కొత్తే. పైగా, ఈ కథను తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? అనేది కూడా అనుమానమే. అయినప్పటికీ 'తెలుసుకదా' మూవీ టీమ్ ధైర్యం చేసిందని చెప్పవచ్చు. ధైర్యమైతే చేసింది కానీ, ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో మాత్రం తడబడిందనే చెప్పాలి.
కథ చిన్నది అయినా ఇంట్రెస్టింగ్ పాయింట్. కానీ, ఆ పాయింట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో.. అప్పటి నుంచి ఆ స్థాయిలో ఆడియన్స్ ని ఎక్సైట్ చేసే ఎలిమెంట్స్ సినిమాలో లేవు. కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ కథ ప్రధానంగా హీరో, ఇద్దరు హీరోయిన్లు, హీరో ఫ్రెండ్ ఈ నలుగురు మధ్యే జరుగుతుంది. దాంతో పలు సీన్స్, డైలాగ్స్ రిపీట్ అయ్యి.. చూసిందే చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
సరోగసి పాయింట్ ఓపెన్ అయిన తర్వాత.. కథని నడిపించడం కంటే కూడా హీరో క్యారెక్టరైజేషన్ ని హైలైట్ చేయడానికే ఎక్కువ ప్రయత్నించారు. నిజానికి ఈ పాయింట్ లో ఎమోషన్స్ కి మంచి స్కోప్ ఉంది. ఓ వైపు భార్య, మరోవైపు మాజీ ప్రేయసి.. ఆ ఇద్దరి మధ్య భావోద్వేగాల పద్మవ్యూహంలో హీరో చిక్కుకొని, దాని నుండి ఎలా బయటపడ్డాడు అనేది చూపించాలి. అప్పుడు ఆ కథకి, హీరో పాత్రకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. కానీ ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం జరగలేదు. హీరోకి అన్ని కన్వీనెంట్ గా జరిగిపోతుంటాయి. చాలా తేలికగా ఈ సమస్య నుండి బయటపడతాడు. పైగా లాస్ట్ లో డైలాగ్ కూడా చెప్పిస్తారు.. హీరో సింపుల్ గా బయటపడ్డాడని.
రాగ-వరుణ్ లవ్ స్టోరీ, బ్రేకప్, అంజలి-వరుణ్ పెళ్లి, సరోగసి, హర్ష కామెడీతో ఫస్ట్ హాఫ్ బాగానే నడిచింది. అయితే కీలకమైన సెకండాఫ్ మాత్రం కథని ముందుకి తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతుంటుంది. అన్నపూర్ణమ్మ ట్రాక్ యూత్ ని బాగానే నవ్విస్తుంది కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేలా ఉంది. ఓ రకంగా నిడివి కోసమే అన్నట్టుగా ఆ ట్రాక్ ఉంది. క్లైమాక్స్ తో దానిని ముడిపెట్టినప్పటికీ.. ఆ ఎమోషన్ సరిపోలేదు. ఇంకా బలమైన భావోద్వేగాలతో పతాక సన్నివేశాలను నడిపించి ఉండాల్సింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇందులో వరుణ్ అనే ఓ టిపికల్ పాత్రలో సిద్దు జొన్నలగడ్డ కనిపించాడు. తనదైన స్క్రీన్ ప్రజెన్స్, నటనతో సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. అంజలిగా రాశి ఖన్నా, రాగగా శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ముగ్గురి నటన ఆకట్టుకుంది. సినిమాలో బిగ్ రిలీఫ్ హర్ష కామెడీ అని చెప్పవచ్చు. హీరో ఫ్రెండ్ అభి పాత్రలో తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాడు. ఈ నలుగురికి తప్ప సినిమాలో మిగతా పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అన్నపూర్ణమ్మ మాత్రమే అంతో ఇంతో నవ్వించారు.
డైరెక్టర్ గా నీరజ కోన మొదటి సినిమాకే ఒక టిపికల్ పాయింట్ ని తీసుకున్నారు. కానీ, దానిని హ్యాండిల్ చేయడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. హీరో పాత్ర మీద కంటే.. కథాకథనాల మీద, భావోద్వేగాల మీద ఎక్కువ దృష్టి పెడితే మెరుగైన అవుట్ పుట్ వచ్చేది. తమన్ పాటలు వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం రొమాంటిక్ డ్రామా జానర్ కి తగ్గట్టుగా లేదు. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ లు:
ప్రధాన తారాగణం నటన
కామెడీ
మైనస్ లు:
కథ అక్కడక్కడే తిరగడం
భావోద్వేగాలు లోపించడం
ఫైనల్ గా...
టైటిల్ 'తెలుసు కదా' అని పెట్టారు కానీ.. ఓ చిన్న కథని తీసుకొని, దానిని నలుగురు మధ్య అక్కడక్కడే తిప్పితే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని తెలుసుకోలేకపోయారు. సిద్ధుతో పాటు ప్రధాన తారాగణం నటన, కామెడీ ఈ సినిమాని అంతో ఇంతో నిలబెట్టాయి.
రేటింగ్: 2.25/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



