కామిక్ వకీల్గా మాస్ మహారాజా
on Feb 23, 2021
`నేను లోకల్` ఫేమ్ త్రినాథరావ్ నక్కిన కాంబినేషన్ లో మాస్ మహారాజా రవితేజ.. ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ వీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 21 ఈ సినిమాకి సంబంధించి.. అధికారిక ప్రకటనని విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. రవితేజ కెరీర్ లో 68వ సినిమాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. మాస్ మహారాజా పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో ఆయన కామిక్ వకీల్ గా కనిపిస్తారట. ఓ రకంగా చెప్పాలంటే.. అల్లరి లాయర్ గా ఆయన రోల్ ఉంటుందట. కోర్టులో కంటే కోర్టు బయట సన్నివేశాలే.. ఈ చిత్రంలో ఎక్కువగా ఉంటాయని సమాచారం. అంతేకాదు.. హీరోయిన్ ది కూడా ప్లీడర్ రోలేనని టాక్. త్వరలోనే రవితేజకి పాత్రకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, రవితేజ ప్రస్తుతం `ఖిలాడి` చేస్తున్నారు. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 28న థియేటర్స్ లో సందడి చేయనుంది.