దేవికకు సాయం చేయండంటూ ట్వీట్.. రాజమౌళిపై ట్రోల్స్!
on Jan 29, 2022
'బాహుబలి' సినిమాకి పనిచేసిన దేవిక అనే మహిళా క్యాన్సర్ తో పోరాడుతున్నారని, ఆమెకి సాయం చేయాలని కోరుతూ దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. "బాహుబలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కోఆర్డినేటర్ గా దేవిక పనిచేశారు. పనిపట్ల ఎంతో అంకితభావంతో ఉండే ఆమె.. దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దయచేసి ఆమెకి ఆర్ధిక సాయం చేయడానికి ముందు రండి" అంటూ ట్వీట్ చేసిన రాజమౌళి క్రౌడ్ ఫండింగ్ కు సంబంధించిన లింక్ ను షేర్ చేశారు.
దేవిక వైద్యానికి ఆర్ధిక సాయం చేయండి అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తమకు తోచిన సాయం చేయడానికి పలువురు ముందుకు వస్తున్నారు. అయితే కొందరు మాత్రం రాజమౌళిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలితో వందల కోట్లు సంపాదించారు.. సినిమా కోసం పనిచేసిన ఆమె వైద్యానికి అయ్యే మూడు కోట్లు ఖర్చు పెట్టలేరా అని ఫైర్ అవుతున్నారు. మూడు కోట్లకు గాను ఇప్పటికే కోటిన్నరకు పైగా ఫండ్ రైజ్ అయింది, ఆ మిగిలిన అమౌంట్ ఇవ్వడం మీకు పెద్ద విషయమా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటివి వాళ్ళు ఎన్నో చూస్తుంటారు, ఎంతో సాయం చేస్తుంటారు.. వాళ్ళు చేయాల్సిన సాయం చేసి, మిగతా సాయం కోసం మనల్ని అడుగుతున్నారు.. నచ్చితే చేయండి లేదా సైలెంట్ గా ఉండండి అంటూ రాజమౌళికి మద్దతుగా మాట్లాడుతున్నారు.
కాగా, దేవిక ఓ మధ్య తరగతి మహిళ అని తెలుస్తోంది. ఆమె భర్త కిడ్నీ సమస్యతో మరణించారట. మరోవైపు ఆమె పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడట. కుటుంబ బాధ్యత మొత్తం ఆమెపైనే పడింది. ఇలాంటి సమయంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె వైద్యానికి మూడు కోట్లు దాకా ఖర్చు అవుతుంది.