బోరింగ్ వీకెండ్... దీనంగా థియేటర్లు!
on Jan 5, 2019
తెలుగు సినిమాకు శుక్ర, శని, ఆదివారాలు పండగ రోజులు. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి వీకెండ్ ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అయితే... న్యూ ఇయర్లో ఫస్ట్ వీకెండ్ మాత్రం పరమ బోరింగ్‌గా మారింది. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అందుకని, సంక్రాంతికి వారం ముందు ఓ మాదిరి సినిమాలను విడుదల చేసే ధైర్యం నిర్మాతలు ఎవరూ చేయలేదు. దాంతో ‘అజయ్ పాసయ్యాడు’, ‘కొత్త కుర్రాడు’, ‘రణ రంగం’, ‘నటన’ వంటి లో బడ్జెట్ స్ట్రయిట్ సినిమాలతో పాటు నయనతాయ ఐదారేళ్ళ క్రితం నటించిన మలయాళ డబ్బింగ్ సినిమా ‘లేడీ టైగర్’ థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత సరుకు ఒక్క సినిమాలోనూ లేదు. పోనీ... డిసెంబర్ చివరి వారాల్లో విడుదలైన సినిమాలు ఏవైనా బావున్నాయా? అంటే అదీ లేదు. దాంతో థియేటర్లు ప్రేక్షకుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నాయి. 21న విడుదలైన ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’ వంటి అంచనాలున్న సినిమాలు ఆకట్టుకోలేదు. కన్నడ డబ్బింగ్ ‘కేజీయప్’ కాస్త పర్వాలేదు. డిసెంబర్ 28న వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ కూడా అంతంత మ్రాతంగా ఉండటంతో ఈ వీకెండ్ సినిమాకు వెళ్దామనుకునే ప్రేక్షకులకు సరైన సినిమా కనిపించడం లేదు. సంక్రాంతికి వచ్చే ‘యన్.టి.ఆర్’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్2’, ‘పేట’ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పందెంలో ఏ సినిమా విజయం సాధిస్తుందో? ఏ హీరో ప్రేక్షకులను మెప్పిస్తాడో??