#NBK 107`కి హ్యాట్రిక్ సినిమాటోగ్రాఫర్?
on Jun 14, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తన ప్రీవియస్ మూవీ `క్రాక్`కి పనిచేసిన టీమ్ నే ఈ చిత్రానికి కూడా కొనసాగించనున్నారు గోపీచంద్ మలినేని. యువ సంగీత సంచలనం తమన్ ఈ సినిమాకి బాణీలు అందించనుండగా.. `క్రాక్`లో లేడీ విలన్ గా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులోనూ ఓ పవర్ ఫుల్ రోల్ లో దర్శనమివ్వనుందని టాక్. అంతేకాదు.. `క్రాక్` విజయంలో ముఖ్య భూమిక పోషించిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు కూడా ఈ చిత్రానికి కొనసాగనున్నాడట. త్వరలోనే `#NBK 107`లో జీకే విష్ణు ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా `మెర్సల్` (తెలుగులో `అదిరింది`), `బిగిల్` (తెలుగులో `విజిల్`), `క్రాక్`.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జీకే విష్ణు.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ `ఖిలాడి`కి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.