హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ.. స్టార్స్ ని దాటుకొని వచ్చిన బిగ్ ప్రాజెక్ట్!
on Oct 17, 2025

'ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది' అంటారు. అలాగే, ప్రతి కథ ఏ నటుడి దగ్గరకు వెళ్ళాలనేది ముందే రాసి ఉంటుంది అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ కథ ఎందరో హీరోలను దాటుకొని దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది. ఈ కథతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. (Devi Sri Prasad)
కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 'బలగం' విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది.. ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాని హీరోగా 'ఎల్లమ్మ' అనే సినిమాని ప్రకటించాడు వేణు. అయితే నాని ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ లోకి నితిన్ వచ్చాడు. ఆ తర్వాత నితిన్ నుంచి శర్వానంద్ కి, అటు నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ ప్రాజెక్ట్ వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. (Yellamma)
ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో సంగీతం దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ, ఎందుకనో అది జరగలేదు. అలాంటిది ఇప్పుడు ఎందరో హీరోలను దాటుకొని వచ్చిన 'ఎల్లమ్మ' కథతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తుంది. అదే నిజమైతే హీరోగా దేవిశ్రీ ప్రసాద్ కి సాలిడ్ ఎంట్రీ దొరికినట్లే.
'ఎల్లమ్మ' సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్ విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. సాయిపల్లవి, కీర్తి సురేష్ వంటి పేర్లు వినిపించాయి. మరి ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళ్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



