'లక్కీ స్టార్'గా వస్తున్న 'కేజీఎఫ్' స్టార్ యశ్
on May 24, 2022
'కేజీఎఫ్-1', 'కేజీఎఫ్-2' చిత్రాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ముఖ్యంగా 'కేజీఎఫ్-2'తో సంచలనం సృష్టించిన యశ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టి టాలీవుడ్ స్టార్ల సినిమాలకు ధీటుగా నిలిచాడు. 'కేజీఎఫ్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యశ్ త్వరలో మరో సినిమాతో పలకరించబోతున్నాడు.
యశ్ నటించగా కన్నడలో ఘన విజయం సాధించిన 'లక్కీ' అనే చిత్రం తెలుగులో 'లక్కీ స్టార్'గా రానుంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు 'లక్కీ స్టార్' చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యశ్ సరసన రమ్య హీరోయిన్ గా నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఈసందర్భంగా తాజాగా 'లక్కీ స్టార్' ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి... కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిరాజ్, ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చిన గురు చరణ్, సంభాషణల రచయిత సూర్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేశవ్ గౌడ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పాల్గొన్నారు.
చిత్ర నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ.. "తెలుగులోనూ స్ట్రెయిట్ గా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకే ఈ చిత్రానికి చాలా ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా.. మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులోనూ ఈ సినిమా చాలా బాగా ఆడి, మాకు మంచి శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. యశ్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, 'రాబర్ట్' ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు" అన్నారు.