టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. 'బింబిసార', 'సీతా రామం' వచ్చాయి!
on Aug 5, 2022
రెండు నెలలుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ నిరీక్షణకు ఈరోజుతో బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఈరోజు విడుదలైన రెండు సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ కి వచ్చేలా చేస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాల ఆదరణ అంతంత మాత్రంగా ఈ సమయంలో ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకుల మెప్పుపొందడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే.
ఈరోజు 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఊహించినట్లుగానే విడుదల తర్వాత కూడా ఈ చిత్రాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. బుక్ మై షోలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల నుంచి 97 శాతం రేటింగ్ తెచ్చుకోవడం విశేషం.
'బింబిసార'పై కళ్యాణ్ రామ్ ఎంతో నమ్మకం పెట్టుకొని భారీ స్థాయిలో ప్రమోట్ చేశాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. ఇక ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బుకింగ్స్ మరింత పెరుగుతున్నాయి. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'సీతా రామం'ను క్లాసిక్ ఫిల్మ్ అంటూ విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ హను రాఘవపూడి హృదయాన్ని తాకే ఓ అందమైన పెయింటింగ్ లాంటి సినిమాని తెరకెక్కించాడని.. రామ్, సీత పాత్రలకు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రాణం పోశారని అంటున్నారు. లవ్ స్టోరీ అయినప్పటికీ ఈ సినిమాకి కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.