పదహారేళ్ళ `అతనొక్కడే`
on May 7, 2021
కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుండే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అలా.. కళ్యాణ్ పరిచయం చేసిన దర్శకుల్లో స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి ఒకరు. మెగాఫోన్ పట్టిన మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు సూరి. రొటిన్ రివెంజ్ డ్రామాకి తనదైన ట్రీట్మెంట్ ఇచ్చి.. హీరోగా కళ్యాణ్ రామ్ కి తొలి సక్సెస్ ని అందించారు సురేందర్ రెడ్డి. ఆ చిత్రమే.. `అతనొక్కడే`. చిన్నతనంలోనే కుటుంబ సభ్యులను కోల్పోయి వేరుపడిన బావామరదళ్ళు.. ఒకరికి తెలియకుండా మరొకరు శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, అంజలి హీరోహీరోయిన్లుగా నటించారు.
చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, ఆశిష్ విద్యార్థి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, వేణు మాధవ్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, సుదీప ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. తమిళంలో `ఆది` (విజయ్, త్రిష) - కన్నడంలో `లక్ష్మణ` (అనూప్, మేఘనా రాజ్) పేర్లతో `అతనొక్కడే` రీమేక్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి జానకి రామ్ నిర్మించిన `అతనొక్కడే`.. 2005 మే 7న విడుదలైంది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 16 వసంతాలను పూర్తిచేసుకుంది.