నాగ శౌర్య చాలా పెద్ద హీరో అవుతాడు: అల్లు అర్జున్
on Oct 28, 2021
నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా.. శుక్రవారం(అక్టోబర్ 29) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంది.
ఈ టైంలో ఇంతమంది ఆడియన్స్ ని చూడటం చాలా ఆనందంగా ఉందన్న అల్లు అర్జున్.. 'తగ్గేదేలే' అంటూ పుష్ప మూవీ డైలాగ్ చెప్పి ఆడియన్స్ లో జోష్ నింపారు. అంతేకాదు 'దిగు దిగు దిగు నాగ' అంటూ రెండు లైన్లు పాట కూడా పాడి వినిపించారు బన్నీ. ఈ దిగు దిగు నాగ సాంగ్ తన కూతురు వల్ల తెలిసిందని, ఈ సాంగ్ తమ ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుందని చెప్పారు. హీరో నాగ శౌర్య పేరు, ప్రొడ్యూసర్ నాగవంశీ పేరు కలిసేలా 'దిగు దిగు నాగ' సాంగ్ భలే పెట్టారంటూ బన్నీ సరదాగా నవ్వించారు.
తాను నాగశౌర్య నటించిన దాదాపు అన్ని సినిమాలు చూశానని బన్నీ చెప్పారు. చాలా అందగాడు, ఆయనలో ఒక స్వీట్ నెస్, ఇన్నోసెన్స్ ఉంటుందని.. అది తనకు చాలా ఇష్టమని అన్నారు. నాగశౌర్య చాలా పెద్ద హీరో అవుతాడని, అవ్వాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. తనకు సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే ఇష్టమని చెప్పిన బన్నీ.. ఏ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని శౌర్యను బన్నీ ప్రశంసించారు.
రీతువర్మ అంటే తనకి ఇష్టమని, ఫస్ట్ మూవీతోనే ఇంప్రెస్ చేసిందని బన్నీ అన్నారు. రీతువర్మ మొదటి సినిమా చూసాక ఆమె తెలుగమ్మాయి అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాయని, తెలుగు అమ్మాయిలంటే తనకు సాఫ్ట్ కార్నర్ ఉంటుందని అన్నారు. తనకు అమ్మాయిలలో డిగ్నిటీ అంటే చాలా ఇష్టమని, అది రీతువర్మలో చాలా ఉందని బన్నీ అన్నారు.
ఈ సినిమాకు ఫిమేల్ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉందని బన్నీ అన్నారు. ఇలాగే సినీ పరిశ్రమలో అన్ని విభాగాల్లో అమ్మాయిలు రాణించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
'హారిక అండ్ హాసిని' తనకు హోం బ్యానర్ లాంటిదని బన్నీ చెప్పారు. పేరుకి అల్లు అరవింద్ గారు, చినబాబు గారు 'అల వైకుంఠపురములో' సినిమా తీసినా మొత్తం చూసుకుంది వంశీనే అని బన్నీ అన్నారు. వంశీ తీసిన ఈ సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. అలాగే, 'జెర్సీ' సినిమాకు నేషనల్ అవార్డు గెలిచినందుకు వంశీకి బన్నీ కంగ్రాట్స్ చెప్పారు.
ఈ సినిమాతో పాటు 'రొమాంటిక్', రజినీకాంత్ 'అన్నాత్తే' సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు బన్నీ. అన్ని భాషలకు చెందిన సినీ పరిశ్రమలు బాగుండాలని కోరుకున్నారు.
డిసెంబర్ 17 న 'పుష్ప' సినిమాతో మీ ముందుకు రాబోతున్నానని.. మీకు నచ్చుతుందని బన్నీ అన్నారు.
Also Read