బాలయ్య `మువ్వగోపాలుడు`కి 34 ఏళ్ళు!
on Jun 19, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ - శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - `భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్` సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `మువ్వగోపాలుడు` ఒకటి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అమాయకుడైన పల్లెటూరి యువకుడు మువ్వ గోపాల కృష్ణ ప్రసాద్ (గోపి)గా బాలయ్య నటించగా.. తనని ఆరాధించే యువతి నిర్మలగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అభినయించారు. కథానాయకుడి మేనకోడలి పాత్రలో శోభన కనిపించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో జయచిత్ర, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతిరావు, సత్యవతి, వై.విజయ, కల్పనా రాయ్ దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త కేవీ మహదేవన్ బాణీలకు ప్రముఖ గీతరచయిత సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. పాటల్లో.. ``అందగాడా``, ``వేగు చుక్క``, ``ముత్యాల చెమ్మచెక్కలు``, ``యే గుమ్మా`` విశేషాదరణ పొందాయి. తమిళ చిత్రం `అరువదై నాళ్` (ప్రభు, పల్లవి) ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాకి గణేశ్ పాత్రో అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1987 జూన్ 19న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మువ్వగోపాలుడు`.. నేటితో 34 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read