సూపర్ హీరో `క్రిష్`కి 15 ఏళ్ళు!
on Jun 23, 2021
భారతీయ తెరపై పరిమిత సంఖ్యలోనే సూపర్ హీరోల కథలు సందడి చేశాయి. వాటిలో `క్రిష్` ఫ్రాంచైజీది ప్రత్యేక స్థానం. తండ్రీతనయులు (అగ్ర దర్శకుడు) రాకేశ్ రోషన్ - (టాప్ స్టార్) హృతికో రోషన్ కలిసి చేసిన మ్యాజిక్ నే.. `క్రిష్` సిరీస్. `కోయి మిల్ గయా`(2003)కి కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రంలో `క్రిష్`గా టైటిల్ రోల్ లో హృతిక్ నటించగా.. అతనికి జంటగా ప్రియాంక చోప్రా దర్శనమిచ్చింది. `క్రిష్`కి నాయనమ్మ పాత్రలో రేఖ కనిపించిన ఈ సినిమాలో.. నజీరుద్దీన్ షా, శరత్ సక్సేనా, అర్చనా పూరన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో సందడి చేశారు. `కోయి మిల్ గయా`లో ప్రధాన పాత్రలైన రోహిత్ మెహ్రా (హృతిక్), నిషా (ప్రీతి జింటా), సంజయ్ మెహ్రా (రాకేశ్ రోషన్).. ఇందులోనూ కనిపిస్తాయి. క్రిష్ తండ్రి రోహిత్ ది ముఖ్య పాత్రనే అయినప్పటికీ.. తల్లి నిషా, తాత సంజయ్ పాత్రలు కాసేపే ఉంటాయి. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమైన `క్రిష్`.. అన్ని చోట్లా ఆదరణ పొందింది.
రాజేష్ రోషన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``ప్యార్ కి ఏక్ కహానీ`` (తెలుగు వెర్షన్ లో ``కథ వింటావా``) చార్ట్ బస్టర్ గా నిలవగా - ``చోరీ చోరీ చుప్కే చుప్కే`` (తెలుగులో ``ఆ పైరగాలి``), ``దిల్ న దియా`` (తెలుగులో `గుండె ఆడినా``) కూడా సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్` విభాగంలో `నేషనల్ అవార్డ్` అందుకున్న `క్రిష్`.. మూడు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను కూడా దక్కించుకుంది. 2006 హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన `క్రిష్ 3`(2013) కూడా సంచలన విజయం సాధించింది. అంతేకాదు.. త్వరలోనే `క్రిష్ 4` కూడా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.
రాకేశ్ రోషన్ స్వీయ నిర్మాణంలో రూపొంది 2006 జూన్ 23న విడుదలైన `క్రిష్`.. నేటితో 15 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read