నాగశౌర్య హీరోగా నటించిన 'వరుడు కావలెను' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు రానా చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. సినిమాలో ఓ రోల్ చేసిన కమెడియన్ సప్తగిరి మాట్లాడుతున్నప్పుడు అతనికి రెండు చేతులెత్తీ దండం పెట్టాడు రానా. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.
"మీరు ఈ మధ్య నా కెమెడీ మిస్సయ్యారు కదా.. 'వరుడు కావలెను'లో చూడండి. చీల్చి చెండాండాం. అలా వచ్చింది క్యారెక్టర్. తప్పకుండా సెకండాఫ్‌లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాను. నాగశౌర్య ఈ సినిమాలో చాలా చాలా అందంగా ఉన్నారు. సిక్స్‌ప్యాక్‌ను ఈ సినిమాలో కవర్ చేసినట్లున్నారు. అందుకే బాగా అందంగా కనిపించారు" అని అతడిని మెచ్చుకున్నాడు సప్తగిరి.
ఆ తర్వాత "మా రానా అన్నగారికి.." అని రానాను ఉద్దేశించి అనగానే, రానా రెండు చేతులెత్తి దండంపెట్టి ఏదో అన్నాడు. "అన్నా.. లవ్ యు అన్నా.." అన్నాడు సప్తగిరి. "రానాను చూస్తే ఏమనాలంటే.. ఏది మాట్లాడినా ల్యాగ్ లేకుండా మాట్లాడాలి. అందుకే ఇప్పుడు ల్యాగ్ లేకుండా మాట్లాడి వెళ్లిపోతాను. ఈ ల్యాగ్ అనే మాట మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రేపు థియేటర్లో నేనెక్కడ కనిపించినా ల్యాగ్ లేకుండా వచ్చి వెళ్లిపోయావన్నా అంటారు. అంత బాగా వర్కవుట్ అయింది." అని చెప్పుకొచ్చాడు.