అగ్ర కథానాయిక సమంత అక్కినేని.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించిన విషయం విదితమే. 2019లో స్ట్రీమ్ అయిన `ద ఫ్యామిలీ మ్యాన్` సిరీస్ కి కొనసాగింపుగా.. `ద ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2` పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరిలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`కి స్ట్రీమింగ్ డేట్ లాక్ అయిందని తెలిసింది. జూన్ 11న ఈ మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కాబోతోందని.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
తొలి సీజన్ లో ముఖ్య పాత్రల్లో నటించిన మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణితో సహా పలువురు ఇందులోనూ కొనసాగనున్నారు. ఇక సమంత విషయానికి వస్తే రాజీ అనే టెర్రరిస్ట్ రోల్ లో నెగటివ్ షేడ్స్ తో ఎంటర్ టైన్ చేయనుంది. మరి.. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ తో సామ్ నటిగా ఎలాంటి గుర్తింపు దక్కించుకుంటుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న మైథలాజికల్ మూవీ `శాకుంతలం` కాగా.. మరొకటి విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటిస్తున్న తమిళ చిత్రం `కాత్తు వాక్కుల రెండు కాదల్`.