ఈ దీపావళికి `అణ్ణాత్త`గా సందడి చేయబోతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా.. తెలుగులో `పెద్దన్న` పేరుతో అనువాదం కానుంది. ఈ చిత్రంలో రజినీకి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శనమివ్వనుండగా.. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సూరి, లివింగ్ స్టన్, పాండ్యరాజన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. `అణ్ణాత్త` చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రం నిడివి దాదాపు 163 నిమిషాలు (2 గంటల 43 నిమిషాలు) ఉందని సమాచారం. కాస్త లెన్త్ ఎక్కువైనా రజినీ నుంచి ఆశించే అన్ని అంశాలను దర్శకుడు శివ ఈ చిత్రంలో పొందుపరిచారని కోలీవుడ్ బజ్. మరి.. ఈ రన్ టైమ్ `అణ్ణాత్త`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే నవంబర్ 4 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, `అణ్ణాత్త`కి డి. ఇమాన్ సంగీతమందించారు. ఈ సినిమా కోసమే గాన గంధుర్వుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం చివరి సారిగా కథానాయకుడి పరిచయ గీతాన్ని ఆలపించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేసింది.