Home » Movie Reviews » 'సేనాప‌తిFacebook Twitter Google


సినిమా పేరు: సేనాప‌తి
తారాగ‌ణం: రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేశ్ అగ‌స్త్య‌, జ్ఞానేశ్వ‌రి కాండ్రేగుల‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, స‌త్య‌ప్ర‌కాశ్‌, రాకౌందు మౌళి, జోష్ ర‌వి, పావ‌ని రెడ్డి, జీవ‌న్ కుమార్‌, పావ‌ని రెడ్డి, రాకీ
క‌థ: శ్రీ గ‌ణేశ్‌
డైలాగ్స్: రాకేందు మౌళి
మ్యూజిక్: శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: వివేక్ కాలెపు
ఎడిటింగ్: గౌత‌మ్ నెరుసు
స్టంట్స్: పృథ్వీ శేఖ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: నార్ని శ్రీ‌నివాస్‌
నిర్మాత‌లు: సుస్మిత కొణిదెల‌, విష్ణుప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: ప‌వ‌న్ సాదినేని
బ్యాన‌ర్: గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేదీ: 31 డిసెంబ‌ర్ 2021 (ఆహా ఓటీటీ)

చిరంజీవి కుమార్తె, అల్లుడు సుస్మిత కొణిదెల‌, విష్ణుప్ర‌సాద్ నిర్మించిన సినిమా డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వ‌స్తోంద‌నే వార్త సినీ గోయ‌ర్స్‌లో ఒకింత కుతూహ‌లం రేకెత్తించింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర చేయ‌గా, 'సేనాప‌తి' టైటిల్‌తో నిర్మాణ‌మైన ఆ మూవీని 'ప్రేమ ఇష్క్ కాద‌ల్' ఫేమ్ ప‌వ‌న్ సాదినేని డైరెక్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం వ‌చ్చిన‌ ట్రైల‌ర్ ఉత్కంఠ‌భ‌రితంగా సాగి సినిమాపై ఆస‌క్తిని పెంచింద‌నేది నిజం. ఆహా ఓటీటీలో నేడు రిలీజైన 'సేతుప‌తి' ఎలా ఉందంటే...

క‌థ‌:- చేయ‌ని హ‌త్య‌కు 11 ఏళ్ల వ‌య‌సులో శిక్ష‌ప‌డి, జువెనైల్ హోమ్‌లో గ‌డిపి బ‌య‌ట‌కు వ‌చ్చిన కృష్ణ (న‌రేశ్ అగ‌స్త్య‌).. వార్డెన్ తోడ్పాటుతో బాగా చ‌దువుకొని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో య‌స్సైగా చేర‌తాడు. ఒక క్రిమిన‌ల్‌ను ప‌ట్టుకొనే సంద‌ర్భంలో అత‌డి గ‌న్ మిస్స‌వుతుంది. త‌న గ‌న్ కోసం కృష్ణ అన్వేష‌ణ ప్రారంభిస్తాడు. ట్ర‌స్ట్ బ్యాంక్‌లో జ‌రిగిన రాబ‌రీ ఘ‌ట‌న‌లో గ‌న్ బుల్లెట్ త‌గిలి ఐదేళ్ల పాప చ‌నిపోతుంది. ఆ పాప చావుకు కార‌ణ‌మైన బుల్లెట్, కృష్ణ మిస్ చేసుకున్న గ‌న్ నుంచి వ‌చ్చిందేన‌ని తేలుతుంది. దీంతో హంత‌కుడి కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ ప‌రంజ్యోతి (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్) అనే పోలీసాఫీస‌ర్‌ ఆధ్వ‌ర్యంలో ఓ స్పెష‌ల్ టీమ్‌ను ఏర్పాటుచేస్తుంది. కృష్ణ స‌స్పెన్ష‌న్‌కు గుర‌వుతాడు. అయిన‌ప్ప‌టికీ త‌న గ‌న్‌ను చేజిక్కించుకొని దానితో హ‌త్య చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకోవాల‌ని త‌ను కూడా ట్రై చేస్తుంటాడు. ఆ త‌ర్వాత అదే గ‌న్‌తో మ‌రికొన్ని హ‌త్య‌లు కూడా జ‌రుగుతాయి. ఆ హ‌త్య‌లు చేసింది కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) అనే వ్య‌క్తి (ఇది సస్పెన్స్ పాయింట్ కాదు). అత‌నెందుకు ఆ హ‌త్య‌లు చేశాడు, అత‌డిని పోలీసులు ప‌ట్టుకోగ‌లిగారా? అనేది మిగ‌తా క‌థ‌.ఎనాలసిస్ :

'సేనాప‌తి' మూవీలో ఇద్ద‌రి క‌థ‌లు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. ఒక‌టి య‌స్సై కృష్ణ క‌థ కాగా, ఇంకొక‌టి కృష్ణ‌మూర్తి క‌థ‌. చేయ‌ని హ‌త్య‌కు శిక్ష అనుభ‌వించినా, మంచివాడుగానే ఉండి ఐపీఎస్ ఆఫీస‌ర్ కావాల‌ని క‌ల‌లుక‌నే య‌స్సై కృష్ణ క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ బాగానే డిజైన్ చేశాడు. అత‌డి ఎమోష‌న్స్‌తో మ‌నం క‌నెక్ట‌వుతాం. టీవీ జ‌ర్న‌లిస్ట్ స‌త్య (జ్ఞానేశ్వ‌రి)తో అత‌డి ప‌రిచ‌యం స‌న్నిహిత‌మ‌వ‌డం, ఆమెను త‌న మ‌నిషిగా అత‌ను ఫీల‌వ‌డం, వీటికి సంబంధించిన స‌న్నివేశాలు బాగానే ఉన్న‌ట్ల‌నిపిస్తాయి. గ‌న్ పోగొట్టుకున్నాక అత‌డు ప‌డే బాధ మ‌న బాధ అవుతుంది కూడా. అత‌డి పాత్ర‌ను అలా ఆడియెన్స్‌కు క‌నెక్ట‌య్యేలా చెయ్య‌గ‌లిగిన డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌, మ‌రో ప్ర‌ధాన పాత్ర కృష్ణ‌మూర్తి విష‌యంలో త‌ప్పులో కాలేశాడు. 

నిజం చెప్పాలంటే 'సేనాప‌తి' సినిమా ఫేట్‌ను నిర్ధారించేది కృష్ణ‌మూర్తి పాత్రే. ఒక మంచి వ్య‌క్తి, ఒక చెడ్డ‌ప‌నికి సిద్ధ‌ప‌డ్డాడంటే దానికి బ‌ల‌మైన కార‌ణం ఉండాలి. ఆప్పుడే ఆ క్యారెక్ట‌ర్‌తో మ‌నం క‌నెక్ట‌వుతాం. ఆ క్యారెక్ట‌ర్ పెయిన్ మ‌న పెయిన్ అవుతుంది. కానీ కృష్ణ‌మూర్తి బ్యాంక్ రాబ‌రీ ఎందుకు చేశాడో చెప్పిన కార‌ణం ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయంగా లేదు. దాని వ‌ల్ల అత‌డి చేతుల్లో గ‌న్ పేలి అన్యాయంగా ఒక ప‌సిపాప ప్రాణాలు కోల్పోవ‌డం అత్యంత దారుణ‌మైన విష‌యం. దానికి కృష్ణ‌మూర్తిలో ప‌శ్చాత్తాప‌మేమీ క‌నిపించ‌క‌పోవ‌డం, పొర‌పాటున ఒక త‌ప్పు జ‌రిగింద‌న్న‌ట్లు మాత్ర‌మే బాధ‌ప‌డ‌టం ఆ పాత్ర‌పై మ‌న‌కు ఏవ‌గింపును క‌లిగిస్తుందే కానీ, సానుభూతిని క‌లిగించ‌దు. బ్యాంకులో ప్ర‌జ‌లు దాచుకున్న డ‌బ్బులో కోటి రూపాయ‌ల‌ను దోపిడీ చేయ‌డం కూడా ఏ ర‌కంగానూ న్యాయంగా క‌నిపించ‌లేదు. చెస్ బోర్డులోని శ‌క‌టాన్ని చూపిస్తూ, "ఇదేంటో తెలుసా?  సేనాప‌తి. దీంతో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి" అని ఓ సంద‌ర్భంలో కృష్ణ‌మూర్తి చెబుతాడు. సేనాప‌తి నాలుగు మూల‌ల్లో ఏ మూల‌కైనా వెళ్లిపోగ‌ల‌డ‌నీ, తాను కూడా అలా వెళ్లిపోగ‌ల‌వాడిన‌నీ అత‌ను చెప్తున్నాడ‌న్న మాట‌. కానీ ఆ వెళ్లే క్ర‌మంలో క్ష‌మించ‌రాని త‌ప్పులు చేశాడు కృష్ణ‌మూర్తి. అదే సేనాప‌తి విజ‌యానికి అడ్డుక‌ట్ట వేసింది. అయితే ఆ క్యారెక్ట‌ర్‌పై తీసిన కొన్ని సీన్లు సూప‌ర్బ్ అనిపించేలా వ‌చ్చాయి.

సినిమాలో శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలావ‌ర‌కు ఇంప్రెసివ్‌గా అనిపించింది. ప‌లు సీన్లు ఎలివేట్ కావ‌డానికి ఆ మ్యూజిక్ దోహ‌దం చేసింది. వివేక్ కాలెపు కెమెరా ప‌నిత‌నాన్ని అభినందించాల్సిందే. బ‌స్తీల్లో జ‌రిగే చేజింగ్ సీన్స్‌లో కెమెరా యాంగిల్స్ ఆక‌ట్టుకున్నాయి. గౌత‌మ్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

న‌టీన‌టుల ప‌నితీరు:- ఏ సినిమాలోనైనా ప్ర‌ధాన పాత్ర ల‌భిస్తే ఎలా ప‌ర్ఫార్మెన్స్ చూపించ‌గ‌ల‌డో మ‌రోసారి నిరూపించారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. సినిమాలో అంద‌రికంటే పేరున్న న‌టుడు ఆయ‌నే. మిగ‌తా వాళ్లంతా ఆయ‌న‌కు జూనియ‌ర్లే కాకుండా, ఆయ‌న‌కంటే త‌క్కువ పేరున్న న‌టులు. దాంతో మిగ‌తా న‌టుల‌నంద‌ర్నీ ఆయ‌న మింగేశాడు. ఆర్పీ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌ల‌లో ఈ మూవీలోని కృష్ణ‌మూర్తి క్యారెక్ట‌ర్ ఒక‌టి. సెటిల్డ్‌గా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ఎక్స్‌ప్రెష‌న్స్ కానీ, డైలాగ్స్ కానీ వ‌హ్వా అనిపిస్తాయి. హోట‌ల్‌లో కృష్ణ‌తో క‌లిసి టీ తాగే సీన్‌లో త‌న క‌థ చెప్పే క్ర‌మంలో కృష్ణ‌మూర్తిగా ఆర్పీ ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం టాప్ క్లాస్‌. మూవీలోని బెస్ట్ సీన్ అదే. 

కృష్ణ పాత్ర‌లో మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ న‌రేశ్ అగ‌స్త్య చ‌క్క‌గా ఇమిడిపోయాడు. ఆ పాత్ర‌లోని డిగ్నిటీని, పెయిన్‌ను చాలా బాగా ప్ర‌ద‌ర్శించాడు. అవ‌కాశాలు ల‌భిస్తే అత‌ను మ‌రింత‌గా త‌నేమిటో ప్రూవ్ చేసుకోగ‌ల‌డ‌నిపించింది. టీవీ జ‌ర్న‌లిస్ట్ స‌త్య‌గా జ్ఞానేశ్వ‌రి బాగానే చేసింది కానీ, ఆమె హీరోయిన్ మెటీరియ‌ల్ కాదు. ఏమాత్రం గ్లామ‌ర‌స్‌గా లేదు. పోలీసాఫీస‌ర్ ప‌రంజ్యోతిగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, ఇన్‌స్పెక్ట‌ర్‌గా స‌త్య‌ప్ర‌కాశ్‌, బ‌బ్లూ యాద‌వ్ పాత్ర‌లో జీవ‌న్ కుమార్‌, అత‌ని భార్య‌గా పావ‌ని రెడ్డి, కృష్ణ‌మూర్తి చేసిన బ్యాంక్ రాబ‌రీకి సాయ‌ప‌డే హుస్సేన్‌, రాజు పాత్ర‌ల్లో రాకేందు మౌళి, జోష్ ర‌వి రాణించారు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

న‌టునిగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌లోని మ‌రో కోణాన్ని చూపించే సినిమా 'సేనాప‌తి'. ఆయ‌న న‌ట విన్యాసాల‌ కోసం దీన్ని చూడొచ్చు. అది త‌ప్పితే ఈ క్రైమ్ డ్రామాలో చెప్పుకోద‌గ్గ‌దేం లేదు.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.