Home » Movie Reviews » కొండ‌పొలంFacebook Twitter Google


సినిమా పేరు: కొండ‌పొలం
తారాగ‌ణం: పంజా వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, సాయిచంద్‌, ర‌విప్ర‌కాశ్‌, కోట శ్రీ‌నివాస‌రావు, నాజ‌ర్‌, మ‌హేశ్ విట్టా, అన్న‌పూర్ణ‌, హేమ‌, ర‌చ్చ ర‌వి, ఆంటోనీ, అశోక్ వ‌ర్ధ‌న్‌
క‌థ‌-మాట‌లు: స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి
పాట‌లు: సీతారామ‌శాస్త్రి, ఎంఎం కీర‌వాణి, చంద్ర‌బోస్‌
సంగీతం: ఎంఎం కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌.
ఎడిటింగ్: శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: రాజ్‌కుమార్ గిబ్స‌న్‌
ఫైట్స్: వెంక‌ట్‌
నిర్మాత‌లు: వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి
బ్యాన‌ర్: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల తేది: 8 అక్టోబ‌ర్ 2021


ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాయ‌గా, తానా అవార్డ్ పొందిన 'కొండ‌పొలం' న‌వ‌ల‌ను అదే పేరుతో డైరెక్ట‌ర్‌ క్రిష్ సెల్యులాయిడ్‌పైకి తీసుకువ‌స్తున్నాడ‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు, ఆ న‌వ‌ల గురించి తెలిసిన‌వారు ఆశ్చ‌ర్య‌పోయారు.. దాన్ని సినిమాగా తీస్తే ఎలా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని! ఆ న‌వ‌ల గురించి తెలియ‌నివాళ్లు వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్‌ప్రీత్ జంట‌గా సినిమానా! అని ఆశ్చ‌ర్య‌పోయారు. ట్రైల‌ర్ వ‌చ్చాక సినిమాలో ఏదో ఉంద‌నే ఆస‌క్తిని క‌లిగించిన 'కొండ‌పొలం' ఇప్పుడు మ‌న‌ముందుకు వ‌చ్చేసింది.


క‌థ‌:
కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ చ‌దువుకొని, నాలుగేళ్ల‌పాటు ఉద్యోగం కోసం హైద‌రాబాద్‌లో ప్ర‌య‌త్నాలు చేసి, నిరాశ‌గా ఇంటికి వ‌స్తాడు ర‌వి (వైష్ణ‌వ్‌తేజ్‌). ఆ టైమ్‌లో అత‌డి గ్రామంలో క‌రువు తాండ‌వ‌మాడుతుంటుంది. త‌మ జీవ‌నాధార‌మైన గొర్రెల‌ను బ‌తికించుకోడానికి వాటిని తీసుకొని కొండ‌పొలం చేయ‌డానికి న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లోకి వెళ‌తారు కొంత‌మంది. తండ్రి (సాయిచంద్‌), మ‌ర‌ద‌లు వ‌ర‌స‌య్యే ఓబుల‌మ్మ (ర‌కుల్‌ప్రీత్‌)తో ర‌వి కూడా వెళ‌తాడు. స్వ‌త‌హాగా అత‌ను మ‌హా భ‌య‌స్తుడు. పామును చూసి వ‌ణికిపోతాడు. అలాంటి పిరికివాడికి పెద్ద‌పులి ఎదుర‌వుతుంది. దాంతో పైప్రాణాలు పైనే పోతాయి. 42 రోజుల పాటు ఆ అడ‌విలో గొర్రెల‌తో పాటు గ‌డిపిన ర‌వి ఎలా త‌న భ‌యాల‌ను జ‌యించాడు, పెద్ద‌పులిని ఎలా ఎదుర్కొన్నాడు, చివ‌రికి అత‌డి జీవితం ఏమ‌య్యింద‌నేది మిగ‌తా క‌థ‌.ఎనాలసిస్ :

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌లో చేరాల‌ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యుపియ‌స్సీ)లో ఇంట‌ర్వ్యూకి అటెండ్ అయిన క‌టారు ర‌వీంద్ర‌నాథ్ అలియాస్ ర‌వి.. త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేసిన ఆఫీస‌ర్లు అడిగిన మీద‌ట త‌న క‌థ చెప్ప‌డంతో సినిమా ఆరంభ‌మ‌వుతుంది. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన 'కొండ‌పొలం' న‌వ‌ల‌లోని క‌థ‌ను ఏమాత్రం డీవియేట్ చేయ‌కుండా, ఆ క‌థ‌లో ర‌చ‌యిత చెప్పిన పాయింట్‌కు ఏమాత్రం భంగం క‌లిగించ‌కుండా తెర‌కెక్కించ‌డానికి క్రిష్ శ్ర‌మించాడు. నిజానికి క‌థార‌చ‌యిత అయిన వెంక‌ట‌రామిరెడ్డి సంభాష‌ణ‌లు కూడా రాయ‌డం ఈ సినిమాకు స‌జీవ‌త్వాన్ని ఇచ్చింద‌ని చెప్పాలి. ఆస్వాదించే వాళ్ల‌కే న‌టుల నోట ప‌లికిన మాట‌ల్లోని సొగ‌సు ఏమిట‌నేది తెలుస్తుంది.

క‌థ‌గా చూస్తే, మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌ధానంగా గొర్రెల మంద‌ల‌ను కాస్తున్న నాయికా నాయ‌కుల‌ను సినిమా అంతా చూపించ‌డం అనేది క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ అయ్యే విష‌య‌మేనా అనేది న‌వ‌ల‌ను చ‌దివిన వారికి వ‌చ్చే సందేహం. పామును చూసి భ‌య‌ప‌డే ర‌వి.. పెద్ద‌పులిని చూసి కూడా భ‌య‌ప‌డ‌కుండా, దాని బారినుంచి త‌న గొర్రెను కాపాడుకొనే ధైర్య‌వంతుడిగా ఎదిగే క్ర‌మాన్ని క్రిష్ బాగానే చిత్రించాడు. సీజీ వ‌ర్క్ ద్వారా సృష్టించిన పెద్ద‌పులి నిజ‌మైన‌ద‌నే అభిప్రాయం ప్రేక్ష‌కుల‌కు క‌లిగేలా దానికి సంబంధించిన సీన్ల‌ను ఉత్కంఠ‌భ‌రితంగా మ‌లిచాడు.

ఎర్ర‌చంద‌నం దొంగ‌ల‌తో ర‌వి త‌ల‌ప‌డే సీన్లు కూడా ఆక‌ట్టుకుంటాయి. అయితే వారితో ఘ‌ర్ష‌ణ‌కు ఒక ముగింపు ఉండే బావుండేద‌నే అభిప్రాయం సాధార‌ణ ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. రవి, ఓబుల‌మ్మ మ‌ధ్య అనుబంధం బ‌ల‌ప‌డే తీరు స‌హ‌జంగా ఉండి ఆక‌ట్టుకుంటుంది. ఇంజ‌నీరింగ్ చ‌దివిన కొడుకు ఉద్యోగం దొర‌క్క ఊరికి వ‌చ్చి, త‌మ‌తో పాటు గొర్రెల‌ను కాయ‌డానికి, కొండ‌పొలం చేయ‌డానికి రావ‌డంతో ఆ తండ్రి ఎంత‌గా క‌ల‌త చెందుతాడో సాయిచంద్ క్యారెక్ట‌ర్ ద్వారా మ‌న‌కు చూపించాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్‌ను 'సింపుల్ బ‌ట్ ఎమోష‌న‌ల్‌'గా తీశాడు. అయితే 95 శాతం క‌థ‌ అడ‌విలోనే జ‌రుగుతుంది కాబ‌ట్టి, దాన్ని ప‌క‌డ్బందీ స్క్రీన్‌ప్లేతో తియ్య‌డం అంత సునాయాస‌మైన ప‌ని కాదు. ఈ విష‌యంలో స్క్రీన్‌ప్లే రైట‌ర్ కూడా అయిన క్రిష్ పూర్తిగా స‌ఫ‌లం కాలేక‌పోయాడు. అందువ‌ల్ల సినిమా స్లోగా న‌డుస్తోంద‌నే ఫీల్ క‌లుగుతుంది.

ఫ‌స్టాఫ్‌లో అంక‌య్య (ర‌విప్ర‌కాశ్‌) త‌న భార్య‌తో రూపాయి ఫోన్ ద్వారా మాట్లాడే సీన్ ఓ హైలైట్‌. త‌న కోసం రొట్టెలు తీసుకు వ‌స్తుంద‌ని ఆశించి, ఆమె రాక‌పోయేస‌రికి బాధ‌ప‌డుతూ, ఆమెకు ఫోన్ చేసి, ఎందుకు రాలేద‌ని అడిగి, ఆమె పుట్టింట్లోనే ఉంటాన‌ని చెప్పేస‌రికి, ఆమె మీద త‌న ప్రేమ‌ను అత‌ను వ్య‌క్తం చేసే విధానం మ‌న గుండెల్ని పిండేస్తుంది. 

మ‌ధ్య మ‌ధ్య‌లో పాట‌ల ద్వారా క‌థ‌ను చెబుతూ, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో క‌థ‌లో మ‌న‌ల్ని ఇన్‌వాల్వ్ అయ్యేలా ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. అందుకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి త‌న‌కే సాధ్య‌మైన రీతిలో స‌హ‌క‌రించాడు. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ఓ ఇమాజినేష‌న్ డ్యూయెట్ మిన‌హాయిస్తే, మిగ‌తా పాట‌ల‌న్నీ క‌థలో భాగ‌మ‌య్యాయి. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు బిగ్ ప్ల‌స్‌. న‌ల్ల‌మ‌ల అడ‌వుల అందాన్నీ, దాని లోతుల్నీ త‌న కెమెరాతో అత‌ను చ‌క్క‌గా బంధించాడు. వ‌ర్షం వ‌చ్చే స‌న్నివేశంలోని ఎమోష‌న్ అత‌డి కెమెరాకు దొరికింది. ద‌ర్శ‌కుడు త‌న చేతికిచ్చిన సీన్ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు క్రిస్పీగా ఎడిటింగ్ చేసిచ్చాడు శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని. అయిన‌ప్ప‌టికీ అత‌డికి విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు.


న‌టీన‌టుల ప‌నితీరు:
సినిమా అంటే మొద‌ట‌గా ఎవ‌రైనా మాట్లాడుకొనేది హీరో హీరోయిన్ల గురించే. అడ‌వుల్ని ర‌క్షించుకోవ‌డానికి ప‌ట్టుద‌ల‌గా సివిల్స్ చ‌దివి ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా మారిన ఇంజ‌నీర్ ర‌వీంద్ర‌నాథ్‌గా వైష్ణ‌వ్‌తేజ్ చెప్పుకోద‌గ్గ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. రెండో సినిమాకే అత‌డి నుంచి ఈ త‌ర‌హా న‌ట‌న‌ను రాబ‌ట్టిన డైరెక్ట‌ర్ క్రిష్ అభినంద‌నీయుడు. క‌ళ్ల‌తో ఎలా న‌టించాలో ఈ సినిమాతో వైష్ణ‌వ్ నేర్చుకున్నాడు. అనేక‌ క్లోజ‌ప్ షాట్స్‌తో వైష్ణ‌వ్ క‌ళ్ల‌ను చూపించ‌డం అంటే మాట‌లు కాదు క‌దా! ఓబుల‌మ్మ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ కొత్త‌గా క‌నిపించింది. ఆమెకిది ఛాలెంజింగ్ రోల్‌. అల్ట్రా మోడ‌ర‌న్ దుస్తుల్లోనే ఎక్కువ‌గా క‌నిపించే ఆమె 'కొండ‌పొలం'లో సినిమా మొత్తం లంగా-ఓణీల‌తో ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించి, మెప్పించింది. చాలా సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ వైష్ణ‌వ్‌తో ఆమె కెమిస్ట్రీ త‌ప్పుప‌ట్ట‌ని రీతిలో ఉంది.

అందరికంటే న‌టుడిగా ఎక్కువగా మెప్పించింది మాత్రం ర‌వి తండ్రిగా న‌టించిన సాయిచంద్‌. జీవ‌నం కోసం, గొర్రెల‌ను కాచుకోవ‌డం కోసం, వాటిని కాపాడుకోవ‌డం కోసం ఒక గొర్రెల కాప‌రి ఎంత‌గా తాప‌త్ర‌య‌ప‌డ‌తాడో, ఎంత‌టి మాన‌సిక‌ సంఘ‌ర్ష‌ణ‌ను అనుభ‌విస్తాడో త‌న అభిన‌యం ద్వారా ఆయ‌న చూపించాడు. బెస్ట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవార్డుకు ఆయ‌న అన్నివిధాలా అర్హుడు. ర‌విప్ర‌కాశ్ కూడా న‌టుడిగా ఇంప్రెస్ చేశాడు. త‌న‌ న‌ట‌న‌ను ఎలివేట్ చేసే రెండు చ‌క్క‌టి సీన్లు అత‌నికి ప‌డ్డాయి. వాటిన‌త‌ను స‌ద్వినియోగం చేసుకున్నాడు. కోట శ్రీ‌నివాస‌రావు (ర‌వి తాత‌య్య‌), మ‌హేశ్ విట్టా, అన్న‌పూర్ణ‌, హేమ‌, ర‌చ్చ ర‌వి లాంటివాళ్లు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు.తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌ను ప‌క్క‌న‌పెడితే, 'కొండ‌పొలం' నిస్సందేహంగా ఒక మంచి సినిమా. అడ‌వి అంటే ఏమిటో, గొర్రెల‌ను మేప‌డానికి అడ‌వికి వెళ్లిన వాళ్ల‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయో రియ‌లిస్టిగ్గా (పులిని కంప్యూట‌ర్ గ్రాఫిక్స్‌లో చూపించ‌డం త‌ప్ప‌లేదు) చూపించిన చ‌క్క‌ని సినిమా. అడ‌విలో ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల మ‌ధ్య పెన‌వేసుకొనే ప్రేమ‌ను అందంగా, హృద్యంగా చూపించిన సినిమా. ఇలాంటి సినిమాల‌ను ఆద‌రించాల్సిన బాధ్య‌త‌, అవ‌స‌రం మ‌న‌మీదుంది.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.