Home » Movie Reviews » విరాట పర్వం



Facebook Twitter Google


సినిమా పేరు: విరాట‌ప‌ర్వం
తారాగ‌ణం: సాయిప‌ల్ల‌వి, రానా ద‌గ్గుబాటి, ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర‌, నందితా దాస్‌, సాయిచంద్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, బెన‌ర్జీ, నివేదా పేతురాజ్ (గెస్ట్‌), జీవ‌న్ కుమార్‌
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌
ఎడిటింగ్: ఎ. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
ఆర్ట్: శ్రీనాగేంద్ర‌
స్టంట్స్: పీట‌ర్ హెయిన్‌, స్టీఫ‌న్ రిచెర్‌
స‌మ‌ర్ప‌ణ: డి. సురేశ్‌బాబు
నిర్మాత‌లు: సుధాక‌ర్ చెరుకూరి, రానా ద‌గ్గుబాటి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌
బ్యాన‌ర్స్: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌
విడుద‌ల తేదీ: 17 జూన్ 2022


క‌థ‌:- న‌క్స‌లైట్ ర‌వ‌న్న అలియాస్ అర‌ణ్య (రానా) ర‌చ‌న‌ల‌కు, అత‌డి అక్ష‌రాల‌కు ప్ర‌భావితురాలైన వెన్నెల (సాయిప‌ల్ల‌వి) అనే అమ్మాయి అత‌డి మీద విప‌రీత‌మైన ప్రేమ‌ను పెంచుకొని, అత‌డ్ని క‌లుసుకొని, అత‌డితోనే జీవితాంతం క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. ఇంట్లో వాళ్లు మేన‌బావ (రాహుల్ రామ‌కృష్ణ‌)తో పెళ్లి నిశ్చ‌యం చేస్తే, అతడ్ని పెళ్లి చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అత‌డికే చెప్పేస్తుంది. ఒక‌రోజు అమ్మానాన్న‌ల‌కు చెప్ప‌కుండా, ఉత్త‌రం రాసిపెట్టి తాను ప్రేమించిన అర‌ణ్య కోసం అన్వేష‌ణ మొద‌లుపెడుతుంది. అత‌డిని క‌లుసుకొనే క్ర‌మంలో పోలీసుల‌కు చిక్కుతుంది. ఆమెను ర‌వ‌న్న స్వ‌యంగా ర‌క్షించి, తీసుకువెళ్తాడు. ఆ త‌ర్వాత వెన్నెల జీవితం ఏమైంది? ర‌వ‌న్న ఆమె ప్రేమ‌ను అంగీక‌రించాడా? వెన్నెల క‌న్న క‌లలు నిజ‌మ‌య్యాయా? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తుంది.



ఎనాలసిస్ :

1990ల కాలంలో కోవ‌ర్టు పేరుతో స‌ర‌ళ అనే అమ్మాయిని న‌క్స‌లైట్లు చంపిన ఉదంతం ప్రేర‌ణ‌తో విరాట‌ప‌ర్వం క‌థ‌ను అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌. స‌ర‌ళ‌ను ఈ సినిమాలో వెన్నెల‌గా మార్చాడు. న‌క్స‌లైట్లు, పోలీసుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర కాల్పులు జ‌రుగుతున్న చోట వెన్నెల‌ను ఆమె త‌ల్లి (ఈశ్వ‌రీరావు) క‌న్న‌ట్లు చూపించ‌డంతో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ఆ త‌ల్లికి పురుడుపోసి, పాప‌కు వెన్నెల అని నామ‌క‌ర‌ణం చేసేది డాక్ట‌ర్ అయిన ఓ లేడీ న‌క్స‌లైట్ (నివేదా పేతురాజ్‌). ఆ వెంట‌నే ఆమె త‌ల‌కు పోలీసు తుపాకీ తూటా త‌గిలి మ‌ర‌ణిస్తుంది. అలా ఒక యుద్ధంలో ప్రాణం పోసుకున్న వెన్నెల ప‌ట్టుద‌ల‌కు మారుపేరుగా పెరుగుతుంది. ఒక జాత‌ర‌లో తండ్రి (సాయిచంద్‌)ను పోలీసులు కొడితే, వాళ్ల‌పై భ‌యం లేకుండా తిర‌గ‌బ‌డుతుంది. ఆ సంద‌ర్భంలోనే ఆమెకు ర‌వ‌న్న అలియాస్ అర‌ణ్య‌ తార‌స‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అర‌ణ్య రాసిన మేఘ గ‌ర్జ‌న అనే పుస్త‌కంతో పాటు మ‌రికొన్ని పుస్త‌కాలు చ‌దివి, అత‌డంటే విప‌రీత‌మైన ప్రేమ‌ను ఆమె పెంచుకున్న‌ట్లుగా వెన్నెల‌ను చూపించాడు ద‌ర్శ‌కుడు. 

తెలంగాణ‌లోని ఓ మూరుమూల పల్లెలో ఒగ్గు క‌థ‌లు చెప్పుకొనే వ్య‌క్తి కూతురిగా పుట్టిన ఓ యువ‌తి తాను ప్రేమించిన వ్య‌క్తి కోసం ఒంట‌రిగా ఎంత దూరం ప్ర‌యాణించింది, తాను ప్రేమించిన వ్య‌క్తి తార‌స‌ప‌డి, త‌న‌పై ప్రేమ‌ను ప్ర‌జ‌ల‌కు సాయం చేయ‌డంపై పెట్ట‌మ‌ని అంటే ఎలా రియాక్ట్ అయ్యింది, త‌ను మిగ‌తా అమ్మాయిల్లాంటి దాన్ని కాద‌ని తెలియ‌జేయ‌డానికి ఎలా తాప‌త్ర‌య‌ప‌డిందీ.. అనే క్యారెక్ట‌రైజేష‌న్‌తో వెన్నెల పాత్రను చాలా బ‌లంగా తీర్చిదిద్దాడు వేణు. న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో గ‌తంలో కొన్ని సినిమాలు వ‌చ్చాయి. కానీ వాటి ల‌క్ష్యం వేరు. వాటన్నింటి కంటే చాలా భిన్నమైన‌ది 'విరాట‌ప‌ర్వం'. ఇది ఒక అమ్మాయి జీవితం నుంచి చెప్పిన క‌థ‌. పాండ‌వులు అజ్ఞాత‌వాసంలో ఉన్న కాలాన్ని వ్యాసుడు విరాట‌ప‌ర్వంగా చెప్పాడు. అదే త‌ర‌హాలో న‌క్స‌లైట్లు అడ‌వుల్లో అజ్ఞాత‌వాసం చేస్తుంటార‌ని ఈ సినిమాకు 'విరాట‌ప‌ర్వం' అనే టైటిల్‌ను ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. 

ఆ కాలంలో న‌క్స‌లైట్ల ఆనుపానులు తెల‌ప‌మ‌ని అమాయ‌కుల‌పై పోలీసులు జ‌రిపిన ద‌మ‌న‌కాండ ఎలా ఉండేదో చిత్రించాడు. అలాగే న‌క్స‌లైట్ల మ‌ధ్య భేదాభిప్రాయాలు ఎలా వ‌స్తాయో, కోవ‌ర్టులు ఎలా వారిని వెన్నుపోటు పొడుస్తారో చూపించాడు. బెన‌ర్జీ పోషించిన ఎస్పీ సూర్య‌ప్ర‌తాప్ పాత్ర‌తో ద‌ళ‌స‌భ్యులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్లు ఉంటే, ద‌ళ నాయ‌కులు మాత్రం అగ్ర‌వ‌ర్ణాల వాళ్లే ఉంటార‌ని చెప్పించాడు. అర‌ణ్య కోసం ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వెన్నెల చేసే ప్ర‌యాణంతో మ‌నం క‌నెక్ట్ అయ్యేలా ఆ పాత్ర‌తో పాటు, ఆ పాత్ర ఎదుర్కొనే వివిధ ఘ‌ట‌న‌ల‌ను కూడా ఎఫెక్టివ్‌గా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు వేణు స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఆమె ఆనందాలు, ఆమె క‌ష్టాలు, ఆమె దుఃఖాలు, ఆమె ప్రేమ‌లు అన్నీ మ‌న హృద‌యాన్ని అడుగడుగునా తాకుతూనే ఉంటాయి. ఆమె ప్రేమ ర‌వ‌న్న హృద‌యాన్ని చివ‌రిదాకా క‌దిలించ‌క‌పోవ‌డం మ‌న‌కు బాధ క‌లిగిస్తుంది. చివ‌ర‌లోనైనా అత‌డు ఆమె ప్రేమ‌ను గ్ర‌హిస్తాడా? ఆఖ‌ర్న మ‌న‌ల్ని ద‌ర్శ‌కుడు షాక్‌కు గురిచేస్తాడు. అదేమిట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది వెన్నెల క‌థ అని ముందుగానే చెప్పేశారు. అందుకు త‌గ్గ‌ట్లే తెర మొత్తాన్ని వెన్నెల ఆక్ర‌మించేసింది. ఆ త‌ర్వాత ర‌వ‌న్న పాత్ర బ‌లంగా క‌నిపిస్తుంది. 

వేణు ఊహించిన వెన్నెల క‌థ తెర‌మీద ఉన్న‌తంగా రావ‌డానికి డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీ, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్‌, శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, శ్రీ‌నాగేంద్ర ఆర్ట్ వ‌ర్క్ గొప్ప‌గా ఊత‌మిచ్చాయి. ఇంత‌దాకా చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన సురేశ్ బొబ్బిలి అంది వ‌చ్చిన ఓ పెద్ద సినిమా అవ‌కాశాన్ని రెండు చేతులా అందుకొని, సూప‌ర్బ్‌గా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మూవీ ఆద్యంతం ఓ ఎమోష‌న్ మ‌న హృద‌యాల్ని ప‌ట్టుకొని తీసుకుపోయిందంటే, దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు తీసిన స‌న్నివేశాల్ని నేర్పుగా ఎడిట్ చేసిన‌ నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ప‌నిత‌నం.

న‌టీన‌టుల ప‌నితీరు:- 'విరాట‌ప‌ర్వం' వెన్నెల క‌థ‌. 'విరాట‌ప‌ర్వం' సాయిప‌ల్ల‌వి చిత్రం. నిజ‌మే.. వెన్నెల పాత్ర‌లో సాయిప‌ల్ల‌విని కాకుండా ఇంకెవ‌ర్ని ఊహించుకుందామ‌న్నా మ‌న‌సు అంగీక‌రించ‌దు. వెన్నెల పాత్ర సాయిప‌ల్ల‌వి కోస‌మే పుట్టింది. వెన్నెల‌గా ఆమె జీవించింది. ఆమె ముందు ఆజానుబాహుడైన రానా సైతం ర‌వ‌న్న పాత్ర‌లో తేలిపోయాడ‌నేది నిజం. అలా అని అత‌డ్ని త‌క్కువ చెయ్య‌ట్లేదు. ర‌వ‌న్న‌గా అతడి రూపం, అత‌డి అభిన‌యం ఆ పాత్ర‌కు ఓ హుందాత‌నాన్నిచ్చాయి. కానీ వెన్నెల క్యారెక్ట‌ర్ వేరే లెవ‌ల్‌, సాయిప‌ల్ల‌వి ప‌ర్ఫార్మెన్స్ వేరే లెవ‌ల్‌. పౌర‌హ‌క్కుల సంఘం నాయ‌కురాలు శ‌కుంత‌ల‌గా నందితా దాస్ కూడా ఎంత హుందాగా, అందంగా ఆ పాత్ర‌లో ఇమిడిపోయారు! వెన్న‌ల అమ్మానాన్న‌లుగా ఈశ్వ‌రీరావు, సాయిచంద్‌, ర‌వ‌న్న త‌ల్లిగా జ‌రీనా వ‌హాబ్‌, ర‌వ‌న్న ద‌ళంలోని భార‌త‌క్క‌, ర‌ఘన్న పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర‌, వెన్నెల బావ‌గా రాహుల్ రామ‌కృష్ణ‌, ఎస్పీ సూర్య‌ప్ర‌తాప్‌గా బెన‌ర్జీ  త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఆరంభంలో వెన్నెల‌కు ఆ పేరు పెట్టిన పాత్ర‌లో నివేదా పేతురాజ్ అలా మెరిసి మాయ‌మైంది.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'విరాట‌ప‌ర్వం'ను క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌ల‌తో తూచ‌లేం. ర‌వ‌న్న అనే న‌క్స‌లైట్ నాయ‌కుడ్ని అమితంగా ఆరాధించి, మ‌న‌సారా ప్రేమించి, అత‌డితో జీవితం పంచుకోవాల‌ని క‌ల‌లుకన్న వెన్నెల అనే ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమికురాలు సాగించిన ప్ర‌యాణం మ‌న‌ల్ని క‌దిలిస్తుంది, కుదిపేస్తుంది. వెన్నెల‌ను మ‌నం అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేం. 

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.