Home » Movie Reviews » తిమ్మరుసు



Facebook Twitter Google


నటీనటులు: సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, అంకిత్, అజయ్, రవిబాబు, '30 వెడ్స్ 21' చైతన్య, 'వైవా' హర్ష తదితరులు
కథ: ఎంజి శ్రీనివాస్  ( కన్నడ సినిమా బీర్బల్ రీమేక్ )   
మాటలు: వేదవ్యాస్
ఎడిటర్: బక్కిన తమ్మిరాజు 
సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్  
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
కథనం-మాటలు-దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు: సృజన్ యరబోలు, మహేష్ ఎస్. కోనేరు
విడుదల తేదీ: 30 జూలై 2021

కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి తెలుగు సినిమా 'తిమ్మరుసు' ('ఇష్క్' కూడా దీంతో పాటు విడుదలైంది). సెకండ్ వేవ్‌కి ముందు థియేటర్లలో విడుదలైన చివరి సినిమా 'వకీల్ సాబ్'. అందులో 'కోర్టులో వాదించడమూ తెలుసు, కోటు తీసి కొట్టడమూ తెలుసు' అంటూ 'వకీల్ సాబ్'గా పవన్ కళ్యాణ్ నటించారు. యాదృశ్చికమో... విధి విచిత్రమో... 'తిమ్మరుసు'లో సత్యదేవ్ సైతం న్యాయవాదిగా కనిపించారు. చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఖైదీ తరపున పోరాడే వకీల్‌గా సత్యదేవ్ కనిపించారు. ఆయన ఎలా నటించారు? థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 

కథ: రామ్ అలియాస్ రామచంద్ర (సత్యదేవ్) ఓ లాయర్. కొడుకు తరపున వాదించమని ఓ కేసు అప్పగిస్తే, తండ్రి తరపున న్యాయం ఉందని తండ్రిని గెలిపిస్తాడు. కొడుకు ఇచ్చిన మూడు లక్షలు తన కంపెనీకి తిరిగి ఇవ్వడానికి కారు అమ్మేస్తాడు. అదేంటంటే, తనకు న్యాయం గెలవడమే ముఖ్యమని చెప్తాడు. ఆ తర్వాత రావూస్ అసోసియేట్స్ అనే పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తే అక్కడ జాయిన్ అవుతాడు. ఓ క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో, హత్య చేయనప్పటికీ ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వాసు (అంకిత్) కేసు రీ-ఓపెన్ చేయిస్తాడు. వాసు అమాయకుడు అయితే హత్య చేసింది ఎవరు? నేరస్థులను రామ్ ఎలా పట్టుకున్నాడు? కేసు ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా.



ఎనాలసిస్ :

సత్యదేవ్ లాయర్ అయినప్పటికీ, కోర్టు రూమ్‌లో జరిగే సన్నివేశాలు తక్కువ. కోర్టు బయట హీరో తన తెలివితేటలతో నేరస్థులు ఎవరో పట్టుకోవడానికి చేసే ప్రయత్నం ఎక్కువ. దీనిని ఇన్వెస్టిగేషన్ డ్రామా అనుకోవచ్చు. కన్నడ సినిమా రీమేక్ అనేది పక్కన పెడితే... సినిమా మొత్తం చూశాక, ఇలాంటి కథలు తెలుగులో చాలా వచ్చాయని అనిపించడం ఖాయం. అయితే, సినిమాను నడిపించిన విధానం బాగుంది. 'నాంది'లో కూడా అల్లరి నరేష్ చేయని నేరానికి జైలుకు వెళతాడు. అదే విధంగా ఈ సినిమాలో కూడా అంకిత్ ను ఇరికిస్తారు. అయితే, అతడు నిర్దోషి అని నిరోపించడం కోసం హీరో చేసే ప్రయత్నమే మెయిన్ పాయింట్ కావడంతో ఆ సినిమాతో పోలిస్తే వైవిధ్యంగా ఉంటుంది. హీరో చేసే ప్రయత్నాలు, అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే, సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ వీక్. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు మెయిన్ కాబట్టి, దానిని రివీల్ చేయలేము. అయితే, ఆ సన్నివేశాలే సినిమాను నిలబెట్టాయి. లేదంటే మరీ సినిమా ఫ్లాట్‌గా ఉండేది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం సినిమాను కొంచెం ఉత్కంఠగా మార్చింది. అప్పు కెమెరా వర్క్ కూడా బావుంది. లిమిటెడ్ బడ్జెట్ లో మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. ప్రొడక్షన్ వేల్యూస్ పర్లేదు. 

నటీనటుల పనితీరు: సత్యదేవ్ మంచి నటుడు. అందులో సందేహం లేదు. హీరోగా నటించిన, కీలక పాత్రలు పోషించిన సినిమాలతో తానొక మంచి నటుడు అనే విషయాన్ని నిరూపించుకున్నారు. ఈ సినిమాతో మరోసారి నిరూపించుకుంటారు. పాత్ర పరిధి మించి ఎక్కడా నటించలేదు. ఆల్రెడీ రిలీజ్ చేసిన లిఫ్ట్ ఫైట్ కూడా కథలో భాగంగా ఉంటుంది. ఫోర్స్డ్ హీరోయిజమ్ లేకుండా నటించడం మంచి విషయం. మధ్యలో కొన్ని పంచ్ డైలాగ్స్ పడ్డాయి. వాటికి థియేటర్లలో విజిల్స్ కూడా! ప్రియాంకా జవాల్కర్ పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా చేశారు. హీరోతో పాటు ట్రావెల్ చేసే అసిస్టెంట్ పాత్రలో బ్రహ్మాజీ అనుభవాన్ని చూపించారు. ఆయనపై రాసిన కొన్ని కామెడీ డైలాగ్స్ పేలాయి. ప్రేక్షకులను ఆయన అక్కట్టుకుంటారు. అజయ్, రవిబాబు, ఝాన్సీ, జయశ్రీ రాచకొండ, హర్ష, ప్రవీణ్ పాత్రలకు తగ్గట్టు నటించారు. హత్య కేసులో అనవసరంగా ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన పాత్రలో యువ నటుడు అంకిత్ అద్భుతంగా నటించాడు. 'జోహార్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అతడు, మరోసారి మంచి మార్కులు వేయించుకుంటాడు.   



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఓ న్యాయవాది చేసిన ఇన్వెస్టిగేషన్ డ్రామా 'తిమ్మరుసు'. టైటిల్‌కు, సినిమాకు పెట్టిన లింక్ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ, సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఫస్టాఫ్ ను కొంచెం క్షమిస్తే... సెకండాఫ్ కొంచెం ఉత్కంఠ కలిగిస్తుంది. నటీనటులు అందరూ పాత్రలకు న్యాయం చేయడంతో 'పర్లేదు. ఒక మంచి ప్రయత్నం చేశారు' అనిపిస్తుంది.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.