Home » Movie Reviews » ఇష్క్‌



Facebook Twitter Google


సినిమా పేరు: ఇష్క్‌
తారాగ‌ణం: తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, 
మాట‌లు, మార్పులు: య‌స్‌.య‌స్‌. రాజు
పాట‌లు: శ్రీ‌మ‌ణి
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
ద‌ర్శ‌క‌త్వం: య‌స్‌.య‌స్‌. రాజు
బ్యాన‌ర్‌: మెగా సూప‌ర్‌గుడ్ ఫిలిమ్స్‌
విడుద‌ల తేదీ: 30 జూలై 2021

రెండేళ్ల క్రితం మ‌ల‌యాళంలో వ‌చ్చి స‌క్సెస‌యిన సినిమా 'ఇష్క్‌'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. నిజానికి ఏప్రిల్ 23న విడుద‌ల చేయాల‌నుకున్న ఈ సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో, అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత నేడే థియేట‌ర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ సంద‌ర్భంగా రిలీజైన రెండు సినిమాల్లో 'ఇష్క్' ఒక‌టి. 'జాంబీరెడ్డి'తో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా, క‌న్నుగొట్టి దేశాన్నంతా త‌న‌వైపు తిప్పుకున్న ప్రియా వారియ‌ర్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం...

క‌థ‌: సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అయిన సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (తేజ స‌జ్జా), ఆంధ్రా యూనివ‌ర్సిటీ స్టూడెంట్ అన‌సూయ అలియాస్ అను (ప్రియా వారియ‌ర్‌) ల‌వ‌ర్స్‌. అను బ‌ర్త్‌డేకి ట్రీట్ ఇవ్వాల‌నుకున్న సిద్ధు త‌న ఫ్రెండ్ కారులో ఆమెను వైజాగ్ సిటీ నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. ఆమెను ఒక‌ ముద్ద‌డుగుతాడు. "న‌డిరోడ్డు మీద‌నా?" అని ఆమె ప్ర‌శ్నిస్తే ఒక హాస్పిట‌ల్ పార్కింగ్ ప్లేస్‌లో కారును పార్క్ చేస్తాడు. ఇద్ద‌రూ ముద్దు పెట్టుకుంటున్న స‌మ‌యంలో ఫ్లాష్ లైట్ వెలుగుతుంది. ఒక‌త‌ను సెల్‌ఫోన్‌లో వారిని వీడియో తీస్తాడు. త‌న‌ను పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేసుకొని, పోలీస్ స్టేష‌న్‌కు ప‌ద‌మంటాడు. త‌మ‌ను వ‌దిలెయ్య‌మ‌ని బ‌తిమలాడుతాడు సిద్ధు. ఈలోపు జ‌నార్ద‌న్ అనే ఇంకొక‌త‌ను అక్క‌డికి వ‌స్తాడు. ఇద్ద‌రూ క‌లిసి సిద్ధు, అనుల‌ను బెదిరిస్తారు. ఇన్‌స్పెక్ట‌ర్ అను ప‌ట్ల అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తాడు. అదిచూసి స‌హించ‌లేక‌పోతాడు సిద్ధు. కానీ ఏమీ చెయ్య‌లేని నిస్స‌హాయ స్థితి. చివ‌ర‌కు ప‌దివేలు తీసుకొని ఆ ఇద్ద‌ర్నీ విడిచిపెడ‌తాడు ఇన్‌స్పెక్ట‌ర్‌. అనును హాస్ట‌ల్ ద‌గ్గ‌ర డ్రాప్‌చేసి, కారులో ఇన్‌స్పెక్ట‌ర్ ఏం చేశాడో చెప్ప‌మంటాడు సిద్ధు. "నేను ఎలా ఉన్నానో క‌నీసం అడ‌గ‌కుండా ఆ ఇన్‌స్పెక్ట‌ర్ ఏం చేశాడ‌ని అడుతున్నావా?  ఈ మ‌గ‌త‌నం అక్క‌డే చూపించ‌లేక‌పోయావా?" అంటుంది అను. కోపంతో వెళ్లిపోతాడు సిద్ధు. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే అదే హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి షాక‌వుతాడు సిద్ధు. రాత్రి త‌మను ఇన్‌స్పెక్ట‌ర్ అంటూ టార్చ‌ర్ పెట్టిన వాడు అంబులెన్స్ డ్రైవ‌ర్ మాధ‌వ్ (ర‌వీంద్ర విజ‌య్‌)గా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. సిద్ధును గ‌మ‌నించి, అక్క‌డ్నుంచి వెళ్లిపొమ్మంటాడు మాధ‌వ్‌. అక్క‌డే జ‌నార్ద‌న్ అనేవాడు టైల‌ర్‌గా షాపులో క‌నిపిస్తాడు. త‌మ‌ను మోస‌గించి, న‌ర‌కం చూపించిన మాధ‌వ్‌పై సిద్ధు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు?  సిద్ధు, అను ప్రేమ‌క‌థ చివ‌ర‌కు ఏమైంద‌నేది సెకండాఫ్‌లో చూస్తాం.



ఎనాలసిస్ :

'ఇష్క్' టైటిల్ కింద 'ఇట్స్ నాట్ ఎ ల‌వ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. సినిమా క‌థ న‌డుస్తున్న కొద్దీ ఆ ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టారో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. మోర‌ల్ పోలీసింగ్ వ‌ల్ల ప్రేమికులు కానీ, ఏకాంతం కోరుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన జంట‌లు కానీ ఎంత‌గా టార్చ‌ర్ ప‌డుతున్నార‌నే విష‌యాన్ని ఈ సినిమా ద్వారా చెప్ప‌ద‌ల‌చుకున్నారు. సినిమా అయ్యాక ఎండ్ కార్డులో ఈ దేశంలో ఎంత‌మంది అలా మోర‌ల్ పోలీసింగ్‌కు బ‌ల‌వుతున్నారో కూడా చూపించారు. కానీ ఇక్కడ 'ఇష్క్‌'లో స‌మ‌స్య మోర‌ల్ పోలీసింగ్ కాదు. పోలీసున‌ని అబ‌ద్ధం చెప్పి, నిస్స‌హాయ స్థితిలో ఉన్న ఇద్ద‌రు ప్రేమికుల్ని త‌ప్పుదోవ‌ప‌ట్టించి, వాళ్ల‌తో అస‌భ్యంగా, అమ‌ర్యాద‌క‌రంగా ప్ర‌వ‌ర్తించి, వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు గుంజే, ఒక ఫ్రాడ్ క‌థ ఇది. దీన్ని మోర‌ల్ పోలీసింగ్ స‌మ‌స్య‌పై తీసిన సినిమా అని చెప్పుకోడానికి ఆస్కార‌మే లేదు. క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్ల మ‌ధ్య సీన్ కూడా ఇదే చెబుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం స‌రైన‌దే. 

క‌థ కంటే క‌థ‌నం మీద ఆధారప‌డిన సినిమా 'ఇష్క్‌'. ఈ సినిమా క‌థ మొత్తం రెండు రోజుల్లో జ‌రుగుతుంది. అందులో ప్ర‌ధాన‌మైనవి రెండే ఘ‌ట్టాలు. ఫ‌స్టాఫ్‌లో ఒక‌రోజు రాత్రి సిద్ధు, అనుల‌ను మాధ‌వ్ టార్చ‌ర్ పెట్ట‌డం, రెండోది సెకండాఫ్‌లో ఆ మ‌రుస‌టి రోజు మాధ‌వ్‌పై బ‌దులు తీర్చుకోవ‌డానికి అత‌ని ఇంటికి వెళ్లి సిద్ధు చేసే ప‌నులు. ఈ రెండింటిలో ఫ‌స్టాఫ్‌లో మాధ‌వ్ చేతుల్లో సిద్ధు, అను ప‌డే టార్చ‌ర్‌ను ఇంప్రెసివ్‌గా తీయ‌గ‌లిగాడు డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజు. కానీ మాధ‌వ్ ఇంట్లో సిద్ధు చేసే ప‌నులు అంత ఇంప్రెసివ్‌గా అనిపించ‌లేదు. టిట్ ఫ‌ర్ టాట్ అన్న‌ట్లు మాధ‌వ్ లేని స‌మ‌యంలో అత‌డింటికి వెళ్లిన సిద్ధు అత‌డి భార్య‌తో పిచ్చిపిచ్చిగా వ్య‌వ‌హ‌రిస్తూ, మాధ‌వ్ వ‌చ్చాక వాళ్ల పాప భ‌య‌ప‌డుతున్నా ఆ పాప క‌ళ్ల‌ముందే సిద్ధు చేసే చేష్ట‌లు ఆ పాత్ర‌పై మ‌న‌కు సానుభూతి కానీ, స‌హానుభూతి కానీ క‌లిగించ‌వు. 

మాధ‌వ్‌పై సిద్ధు ఈ సినిమాలో చూపించిన‌ట్లే ప్ర‌తీకారం తీర్చుకోన‌క్క‌ర్లేదు. మ‌రోర‌కంగానూ తీర్చుకోవ‌చ్చు. సిద్ధు ప్ర‌తీకారానికి ఈ సినిమా ఇచ్చిన ట్రీట్‌మెంట్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకోదు. ఫ‌స్టాఫ్‌లో మాధ‌వ్ పాత్ర‌తో చెప్పించిన డైలాగ్స్ కానీ, అత‌డి పాత్ర చిత్ర‌ణ కానీ ఆక‌ట్టుకున్నాయి. సిద్ధు క్యారెక్ట‌రైజేష‌న్ సెకండాఫ్‌లో దారి త‌ప్పింది. అను క్యారెక్ట‌రైజేష‌న్‌, అను వ్య‌క్తిత్వం స‌రిగానే ఉన్నాయి. ఇద్ద‌రు ప్రేమికులు తొలిసారి ముద్దు పెట్టుకొనే సంద‌ర్భంలో కెమెరా ప‌నిచేసిన తీరులో మ్యూజిక్ ప‌నిచేయ‌లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఆ సీన్ల‌ను మ‌రింత బాగా ఎలివేట్ చేయ‌వ‌చ్చు. ఈ విష‌యంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు. పాట‌ల‌కు ఇచ్చిన మ్యూజిక్ ఓకే. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ వ‌ర్క్‌ ఫ‌ర్వాలేదు.

న‌టీన‌టుల అభిన‌యం: క‌థ‌న త‌ర్వాత 'ఇష్క్' ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది న‌టీన‌టుల అభిన‌యాల మీద‌నే. సిద్ధు, అను పాత్ర‌ల్లో తేజ‌, ప్రియా వారియ‌ర్ మెప్పించారు. తెర‌పై వారి జంట ముచ్చ‌ట‌గా ఉంది. వారి హావ‌భావాలు ఆక‌ట్టుకున్నాయి. ఒక ఇబ్బందిక‌ర స్థితిలో పోలీసుల‌కు దొరికిపోయిన‌ప్పుడు ఒక అమ్మాయి ఎలా త‌ల్ల‌డిల్లుతుందో, అలాగే బిహేవ్ చేసింది ప్రియ‌. నకిలీ పోలీసు చేతుల్లో చిక్కుకొని, అత‌డు మాట‌ల‌తో, చేత‌ల‌తో వేధిస్తుంటే ఒక‌వైపు కోపంతో ర‌గిలిపోతూ, ఇంకోవైపు ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిని అనుభ‌వించే సిద్ధుగా తేజ ఎక్స్‌ప్రెష‌న్స్ అల‌రించాయి. కెమెరా కూడా క్లోజ‌ప్స్‌తో ఈ ఇద్ద‌రి న‌ట‌న‌ను ఎలివేట్ చేసింది. ఇక న‌కిలీ పోలీసు మాధ‌వ్‌గా ర‌వీంద్ర విజ‌య్ అంద‌రికంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడ‌ని చెప్పాలి. ఇటీవ‌లే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో త‌మిళ‌నాడుకు చెందిన ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్‌గా చ‌క్క‌ని ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చిన అత‌ను, త‌న‌కు ల‌భించిన మాధ‌వ్ క్యారెక్ట‌ర్‌లో సూప‌ర్బ్‌గా రాణించాడు. అత‌డి భార్య జ్యోతి పాత్ర‌ను చేసిన న‌టి కూడా ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాలోని పాత్ర‌లు చాలా త‌క్కువ‌. మిగ‌తా పాత్ర‌ధారులు కూడా ప‌రిధుల మేర‌కు న‌టించారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఫ‌స్టాఫ్‌ త‌ర‌హాలోనే సెకండాఫ్ కూడా ఎంగేజింగ్‌గా ఉన్న‌ట్ల‌యితే, సెకండాఫ్ ట్రీట్‌మెంట్ మ‌రో ర‌కంగా ఉన్న‌ట్ల‌యితే 'ఇష్క్' బాగా వ‌చ్చి ఉండేది. ఎంతో క‌ష్ట‌ప‌డి స‌మ‌స్య‌ను సాల్వ్ చేశాక ఫ‌లితం ద‌క్క‌క‌పోతే ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాలో మెయిన్ క్యారెక్ట‌ర్‌ ప‌రిస్థితి అదే. క్లైమాక్స్ అయిపోయాక ప్రేక్ష‌కుల్లో ఓ నిట్టూర్పు వ‌చ్చిందంటే కార‌ణం.. ఆ క్యారెక్ట‌ర్‌ను మ‌లిచిన విధాన‌మే.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.