Home » Movie Reviews » సుల్తాన్‌



Facebook Twitter Google


సినిమా పేరు: సుల్తాన్‌
తారాగ‌ణం: కార్తీ, ర‌ష్మికా మంద‌న్న‌, లాల్‌, నెపోలియ‌న్‌, రామ‌చంద్ర‌రాజు, న‌వాబ్ షా, యోగిబాబు, హ‌రీష్ పేర‌డి, అర్జ‌య్‌, స‌తీశ్‌
డైలాగ్స్‌: రాకేందు మౌళి
సాహిత్యం: రాకేందు మౌళి, చంద్ర‌బోస్‌, కృష్ణ‌కాంత్‌, శ్రీ‌మ‌ణి
మ్యూజిక్‌: వివేక్-మెర్విన్‌
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: యువ‌న్ శంక‌ర్ రాజా
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌
ఎడిటింగ్‌: రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
స్టంట్స్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌
నిర్మాత‌లు: య‌స్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్ర‌భు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్‌
బ్యాన‌ర్‌:  డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
విడుద‌ల తేదీ: 2 ఏప్రిల్ 2021‌

తమిళ ఇండ‌స్ట్రీతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ మంచి మార్కెట్ తెచ్చుకున్న కార్తీ న‌టించిన లేటెస్ట్ ఫిల్మ్ 'సుల్తాన్' ఈరోజు రెండు భాష‌ల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వ‌చ్చింది. సెన్సేష‌న‌ల్ స్టార్ ర‌ష్మికా మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఫ‌స్ట్ త‌మిళ్ ఫిల్మ్‌గా ప‌బ్లిసిటీ పొందిన 'సుల్తాన్' తెలుగు వెర్ష‌న్ ఎట్లా ఉందో చూద్దామా...

క‌థ‌
సుల్తాన్ అస‌లు పేరు విక్ర‌మ్‌. వాళ్ల నాన్న విశాఖ‌ప‌ట్నంలో ఒక గాడ్‌ఫాద‌ర్‌. ఆయ‌న్ని, ఆయ‌న ఇంటిని న‌మ్ముకొని వంద‌మంది పైగా రౌడీలు ఆశ్ర‌యం పొందుతుంటారు. సుల్తాన్‌ను క‌ని వాళ్ల‌మ్మ చ‌చ్చిపోతుం‌ది. గాడ్‌ఫాద‌ర్ మ‌నుషులే సుల్తాన్‌ను పెంచి పెద్ద చేస్తారు. సుల్తాన్ కేమో గ్యాంగ్ వార్ అంటే అస్స‌లు గిట్ట‌దు. ఈ విష‌యం మీద తండ్రీకొడుకుల‌కు వాదం జ‌రుగుతుంది. మ‌న‌ల్ని న‌మ్ముకున్న‌వాళ్ల‌కు ఏదైనా ఆప‌ద వ‌స్తే కాపాడ‌మ‌ని చెప్పి తండ్రి చ‌నిపోతాడు. రౌడీల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తున్న‌ పోలీసుల నుంచి త‌న తండ్రి గ్యాంగ్‌ను కాపాడ్డానికి, వాళ్ల‌ను అమ‌రావ‌తి ద‌గ్గ‌రున్న ఓ ఊరికి తీసుకుపోతా‌డు సుల్తాన్‌. ఆ ఊరిని వ‌ల్ల‌కాడు చేస్తున్న జ‌యేంద్ర అనే ఇంకో గ్యాంగ్‌స్ట‌ర్‌తో త‌ల‌ప‌డి, అత‌డిని త‌రిమేస్తాడు. త‌న గ్యాంగ్‌తో క‌త్తి బ‌దులు, నాగ‌లి ప‌ట్టించాల‌ని ట్రై చేస్తాడు. సుల్తాన్ ఆశ‌యం నెర‌వేరిందా? అత‌డి ఆశ‌యానికి ఎట్టాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర‌య్యాయ‌నేది మిగ‌తా క‌థ‌‌.



ఎనాలసిస్ :

నాకైతే సెకండాఫ్ కంటే ఫ‌స్టాఫే బాగా ఉంద‌ని అనిపించింది. సుల్తాన్ బాగా చ‌దువుకొని, వారం రోజులు గ‌డుపుదామ‌ని ముంబై నుంచి వైజాగ్ వ‌చ్చాక‌ గ్యాంగ్‌తో అత‌ను గ‌డిపే సీన్లు జోష్ తెచ్చాయ్‌‌‌. గ్యాంగ్ మెంబ‌ర్ కింగ్ కాంగ్‌గా యోగిబాబు ఎప్ప‌ట్లా న‌వ్వించాడు. ముఖ్యంగా ర‌ష్మిక‌తో పెళ్లిచూపుల సీను, దానికి కంటిన్యుటిగా వ‌చ్చే సీన్లు మంచి రిలీఫ్‌గా అనిపించాయ్‌. సుల్తాన్ త‌న‌తో గొడ‌వ ప‌డ్డాక‌ తండ్రి చ‌నిపోయిన సీన్ కొంచెం ఎమోష‌న‌ల్‌గా ఉంది. త‌ను పుట్ట‌గానే సుల్తాన్ అని పిలిచిన ఫాద‌ర్ రైట్ హ్యాండ్‌ మ‌న్సూర్‌తో సుల్తాన్ రిలేష‌న్‌షిప్‌ను బాగా రాసుకున్నాడు డైరెక్ట‌ర్ బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్. సినిమా మొత్త‌మ్మీద రెండు యాక్ష‌న్ సీన్లు చ‌క్క‌గా వ‌చ్చాయ్‌‌. ఒక‌టి క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ అయితే, ఇంకోటి ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్‌. 

ఈ ఇంట‌ర్వెల్ ఫైట్‌ను సుల్తాన్ ఎవ‌రితో చేస్తాడో తెలుసా?  బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'కేజీఎఫ్‌'లో మెయిన్ విల‌న్ గ‌రుడ‌గా యాక్ట్‌చేసి అద‌ర‌గొట్టిన రామ‌చంద్ర‌రాజు.. 'సుల్తాన్' మూవీలో జ‌యేంద్ర అనే విల‌న్‌గా యాక్ట్ చేశాడు. అమ‌రావ‌తిలోని ఊరిని దోచుకొవ‌డానికి వ‌చ్చిన అత‌డ్ని సుల్తాన్ ఎదుర్కొనే సీన్‌ను మ‌స్తుగా తీశాడు డైరెక్ట‌ర్‌. ఓ ముస‌లాయ‌న్ని స్తంభానికి క‌ట్టేసి కొర‌డాతో జ‌యేంద్ర నెత్తురు కారేట్లు కొడుతుంటే, సుల్తాన్ ఒంట్లోని నెత్తురు ఎప్పుడు మండుతుం‌దా, కొట్లాట‌లు వొద్ద‌నుకొనే అత‌డు ఎప్పుడు జ‌యేంద్ర‌ను ఉతుకుతాడా అని మ‌నం ఎదురుచూస్తాం. అట్లా మ‌న నెత్తురు కూడా ఉడికాక‌ అప్పుడు జ‌యేంద్ర‌ను సుల్తాన్ అదే కొర‌డాతో ఉతుకుతుంటే మ‌న ప్రాణానికి హాయి అనిపిస్తుంది. ఆ సీన్‌ను అట్లా బాగా తీశాడు డైరెక్ట‌ర్‌. అదే మాదిరి క్లైమాక్స్ ఫైట్‌ను కూడా బాగా డిజైన్ చేశాడు. అప్పుడు కూడా మ‌న ఒంట్లోని నెత్తురు ఉడుకుతుంటుంది. 

ఇట్లా యాక్ష‌న్ సీన్ల‌ను మ‌స్తుగా తీసిన డైరెక్ట‌ర్ అస‌లు క‌థ‌ని స్పీడ్‌గా ప‌రుగులు పెట్టించ‌డంలో కొంత ఫెయిలయ్యాడ‌నేది నా ఫీలింగ్‌. రుక్మిణిగా న‌టించిన ర‌ష్మిక‌, సుల్తాన్‌గా న‌టించిన‌ కార్తీల మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే అనిపించినా, సుల్తాన్‌ని కావాల్న‌ని రుక్మిణి తేలిగ్గా చూడ్డం, అత‌డ్ని పూచిక పుల్ల మాదిరిగా తీసేయ‌డం నాకైతే న‌చ్చ‌లేదు. ఒక‌ట్రెండు సార్ల‌యితే ఓకే కానీ, మాటిమాటికీ అదే సీన్ రిపీట‌వుతుంటే మ‌న‌కు చిరాకు వ‌చ్చేయ‌దా! అదే జ‌రిగింది‌!! సెకండాఫ్‌లో కొన్ని సీన్లు చూస్తావుంటే డైరెక్ట‌ర్ అన‌వ‌స‌రంగా క‌థ‌ను లాగుతున్న‌డేంద‌‌బ్బా అనిపించింది. పైగా నెక్ట్స్ ఏం సీన్ వ‌స్తుందో ఈజీగా మ‌నం ఊహించేసేట‌ట్లు నెరేష‌న్ ఉంది. దీంతో ఆడియెన్స్‌కు ఇంట‌రెస్ట్ పోతుంద‌ని డైరెక్ట‌ర్ గ్ర‌హించ‌లేదు. అట్లాగే.. సుల్తాన్ అంటే ప్రాణ‌మిచ్చే వంద‌మంది కౌర‌వుల్లాంటి అత‌డి గ్యాంగ్ ఓ సీన్‌లో అత‌డికి యాంటీ అయిపోవ‌డం క‌న్విన్సింగ్‌గా లేదు. అయితే ఒక్క‌టి మాత్రం మెచ్చుకోవాలి. క్లైమాక్స్ సీన్ అయ్యాక‌‌, టైటిల్ కార్డ్ ప‌డుతుంటే కూడా థియేట‌ర్లో చాలా మంది జ‌నం క‌ద‌ల‌కుండా చివ‌రి దాకా చూస్తున్నారు. అది మంచి విష‌యం.

సినిమాకి మ్యూజిక్ ప్ల‌స్ అని చెప్పాలి. పాట‌ల‌కు వివేక్‌-మెర్విన్ మ్యూజిక్ ఇస్తే, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం యువ‌న్ శంక‌ర్ రాజా మ‌స్తుగ కొట్టాడు. స‌త్య‌న్ సూర్య‌న్ సూప‌ర్బ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి ఇంకో ఎస్సెట్‌. మూవీ క‌ల‌ర్ టోన్ మంచిగా అనిపించింది. రూబెన్ ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉన్న‌ట్ల‌యితే 'సుల్తాన్' ఇంకా బాగా ఉండేది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నా‌యి.

న‌టీన‌టుల అభిన‌యం
టైటిల్ రోల్‌లో కార్తీ ప‌క్కాగా సూట‌య్యాడు. రెండు షేడ్‌లు ఉండే ఆ క్యారెక్ట‌ర్‌లో అత‌ను జీవించాడు. అత‌ని ఫేషియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ భ‌లే ముచ్చ‌ట‌గా అనిపిస్తాయ్‌‌. విలేజ్ గాళ్ రుక్మిణి క్యారెక్ట‌ర్‌లో ర‌ష్మిక బాగుంది. 'గీత గోవిందం' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ముఖం చిట్లిచ్చుకుంటా ఎట్లా క‌నిపించిందో, ఈ మూవీలో కూడా కార్తీని చూసిన‌ప్పుడ‌ల్లా అట్టా ముఖం మాడ్చుకుంటా క‌నిపిస్తుంద‌న్న‌ మాట‌. ఆమె క్యారెక్ట‌ర్‌ని డైరెక్ట‌ర్ ఇంకా బాగా డిజైన్ చేసుండాల‌నిపిస్తుంది. సుల్తాన్ "మావ‌య్యా" అని పిలిచే మ‌న్సూర్ క్యారెక్ట‌ర్‌లో మ‌ల‌యాళం యాక్ట‌ర్ లాల్.. సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జ‌యేంద్ర పాత్ర‌లో రామ‌చంద్ర‌రాజు, ఇంకో విల‌న్ పాత్ర‌లో న‌వాబ్ షా, పోలీసాఫీస‌ర్‌గా హ‌రీష్ పేర‌డి పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు యాక్ట్ చేశారు. యోగిబాబు ఎప్ప‌ట్లా బాగా న‌వ్వించాడు. సుల్తాన్ తండ్రిగా నెపోలియ‌న్ ప‌ర్‌ఫెక్ట్‌. త‌ల్లిగా గెస్ట్ రోల్‌లో నిన్న‌టి హీరోయిన్ అభిరామి క‌నిపించింది. మిగ‌తా యాక్ట‌ర్లు కూడా బాగానే చేశారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

మొత్తంగా చూస్తే.. ర‌క్త‌పాతం వ‌ద్ద‌నుకుంటానే, క‌త్తిప‌ట్ట‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితిలో ప‌డ్డ 'సుల్తాన్' స్టోరీలో‌ యాక్ష‌న్ ఎపిసోడ్లు, కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు బాగా ఉన్నాయ్ అనిపిస్తుంది. మ‌నం ఊహించిన‌ట్లే సీన్లు రావ‌డం, సెకండాఫ్‌లో క్లైమాక్స్ వ‌చ్చేదాకా నెరేష‌న్ స్పీడ్‌గా లేక‌పోవ‌డం డిజ‌ప్పాయింట్‌మెంట్‌ క‌లిగిస్తుంది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.