Home » Movie Reviews » రంగ్ దే



Facebook Twitter Google


సినిమా పేరు: రంగ్ దే
తారాగ‌ణం: నితిన్, కీర్తి సురేశ్‌, నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్‌, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్
అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీశ్‌ చంద్ర పాశం
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫీ: పి.సి. శ్రీరామ్
కూర్పు: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్లా
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుద‌ల తేదీ: 26 మార్చి 2021‌

ఫ్లాపుల్లో ఉన్న ముగ్గురు క‌లిసి చేసిన సినిమా 'రంగ్ దే'. ఎట్లంటారా.. 'చెక్' మూవీతోని నితిన్‌, 'పెంగ్విన్'‌, 'మిస్ ఇండియా' సినిమాల‌తో కీర్తి సురేశ్‌, 'మిస్ట‌ర్ మ‌జ్ను'తో వెంకీ అట్లూరి ఫ్లాపుల్లో ఉన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే క‌దా! 'రంగ్ దే' మూవీ ట్రైల‌ర్‌ని చూశాక బాగా న‌వ్వుకున్నాం. ఆ ట్రైల‌ర్ మాదిరిగానే సినిమా ఉంటే హిట్ గ్యారంటీ అనుకున్నాం. మ‌రి సినిమా ఎట్లా ఉందంటే...

క‌థ
ప‌క్క ప‌క్క ఇళ్ల‌ల్లో ఉంటూ చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగే అర్జున్ అనే అబ్బాయి, అనుప‌మ అలియాస్ అను అనే అమ్మాయి క‌థ 'రంగ్ దే'. అర్జున్‌కేమో చ‌దువంటే ప‌డ‌దు. లైఫ్‌ని స‌ర‌దాగా ఎంజాయ్ చేసే టైపు. అను మంచిగా చ‌దువుతుంది, ప‌ద్ధ‌తిగా ఉంటుంది. అందుకే ప్ర‌తి విష‌యంలో అనుని చూసి నేర్చుకొన‌మ‌ని అర్జున్‌ని వాళ్ల నాన్న‌ కేక‌లేస్తుంటాడు. దీంతో అర్జున్ ఇరిటేట్ అయిపోతుంటాడు. అను అంటే రోజురోజుకీ జెల‌సీ పెంచుకుంటాడు. అనుకేమో అర్జున్ అంటే బాగా ఇష్టం. ఆపోజిల్ పోల్స్ లాంటి ఆ ఇద్ద‌రికీ పెళ్ల‌యితే, ఏమ‌వుతుంది? అను అంటేనే గిట్ట‌ని అర్జున్ ఏం చేస్తా‌డు? ఆళ్ల కాపురం బాగ‌వుతుందా? అనేదే ఈ క‌థ‌.



ఎనాలసిస్ :

ట్రైల‌ర్‌ని చూశాక నేనైతే 'రంగ్ దే' గురించి బాగా ఎక్స్‌పెక్ట్ చేశాను. సినిమా చూశాక ఒకింత డిజ‌ప్పాయింట్ అయ్యా. హీరో హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్స్‌, వాళ్ల మ‌ధ్య సీన్స్‌ని రైట‌ర్ కూడా అయిన డైరెక్ట‌ర్ ఎఫెక్టివ్‌గా రాయ‌లేక‌పోయాడు. అనుని చూసి జెల‌సీ ఫీల‌వుతుండే అర్జున్‌కి సొంత వ్య‌క్తిత్వం ఉందా అనే డౌట్ వ‌చ్చేసింది. మ‌న‌సులో మాట గ‌ట్టిగా చెప్ప‌లేని వీక్ ప‌ర్స‌న్‌గా అర్జున్‌ని ప్రొజెక్ట్ చేశాడు డైరెక్ట‌ర్‌. దాంతో అర్జున్ క్యారెక్ట‌ర్‌తో యూత్ క‌నెక్ట‌వ‌డం క‌ష్టమ‌నేది నా ఫీలింగ్.

అనుని పోకిరోళ్లు ఈవ్ టీజింగ్ చేసిన‌ప్పుడు ఆమె అర్జున్‌ని పిలుస్తుంది. అర్జున్ వ‌చ్చి ఆ టీజ్ చేసినోళ్ల‌ని ఉతికి ఆరేస్తాడు. అయినా మ‌నం ఆ సీన్‌కి కూడా క‌నెక్ట్ కాలేక‌పోయా‌మంటే.. డైరెక్ట‌ర్ ఫెయిలైన‌ట్టే క‌దా! అయితే ఫ‌స్టాఫ్‌లో ఫ్యామిలీల మ‌ధ్య వ‌చ్చే సీన్లు వినోదాన్ని అందిస్తాయి.

ఇంట‌ర్వెల్ పాయింట్ మాత్రం ఇంట‌రెస్టింగ్‌గ అనిపించింది. అను మీద జెలసీ త‌ప్ప ఇంకే ఫీలింగ్ లేన‌ట్లు క‌నిపించే అర్జున్ ద‌గ్గ‌రుండి ఆమెకి వేరే అత‌నికిచ్చి పెళ్లిచేస్తుంటాడు. త‌ల‌మీద జీల‌క‌ర్ర‌, బెల్లం పెట్టే టైముకి అను ద‌బ్బున పెళ్లి పీట‌ల మీంచి లేచి, అర్జున్ ద‌గ్గ‌ర‌కు ఉరికి, అత‌న్ని వాటేసుకొని లిప్ లాక్ చేసేస్తుంది. దాంతో అర్జునేంది, ఆ ఇద్ద‌రి ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా షాక‌వుతా‌రు. ఇది ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌.

దాని త‌ర్వాత సినిమా ఎంత ఇంట‌రెస్టింగ్‌గా ఉంటుం‌దో అని ఆశ‌ప‌డితే, డైరెక్ట‌ర్ వెంకీ డిజ‌ప్పాయింట్ చేశాడు. అర్జున్‌, అనుకి పెళ్ల‌యినాక‌ ఆ ఇద్ద‌రూ చ‌దువుకోవ‌డానికి దుబాయ్‌కి పోతారు. అప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్లు కూడా ఏమంత న‌చ్చ‌లేదు. అప్పుడు కూడా అనుని ఎట్లా వ‌దిలించుకోవాలని చూస్తుంటా‌డు అర్జున్‌. దాంతో ఈ మ‌నిషేంది ఇట్లా చేస్తున్నా‌డ‌ని అత‌ని మీద అయిష్టం పెంచుకుంటాం. క్లైమాక్స్‌లో మెలోడ్రామా సీన్ల‌తోటి, ఎమోష‌న్స్ తోటి క‌వ‌ర్ చెయ్యాల‌ని డైరెక్ట‌ర్ ట్రై చేశాడు కానీ, అప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైపోయింద‌నే విష‌యాన్ని ఆయ‌న గ్ర‌హించ‌లేదు. హీరో హీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్ లేక‌పోతే సినిమా చ‌ప్ప‌గ అవుతుంద‌‌ని రంగ్ దే చూశాక‌ మ‌రోసారి రుజువైంది.

నాకైతే అర్జున్ క్యారెక్ట‌ర్‌తో కంపేర్ చేస్తే, అను క్యారెక్ట‌ర్ బెట‌ర్ అనిపిచ్చింది. ఆమెకి కాస్త‌యినా వ్య‌క్తిత్వ‌ముం‌ది. అర్జున్ మ‌న‌సులో త‌ను లేన‌ని, త‌న‌ని వ‌దిలించుకోవాల‌ని అత‌ను చూస్తున్నా‌డ‌ని తెలిశాక ఆమె ప‌డే బాధతో అమ్మాయిలు క‌నెక్ట‌వుతారు. కానీ సినిమా హిట్ట‌వ‌డానికి అది స‌రిపోదు. నిజం చెప్పాలంటే మెయిన్ లీడ్స్ కంటే స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లే కొంత బెట‌ర‌నిపిచ్చింది. ఫ‌రెగ్జాంపుల్‌.. అర్జున్ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్‌, అను మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్‌. ఇక‌ వెన్నెల కిశోర్‌ని పెట్టుకొని అత‌నితో ఒక‌ట్రెండు త‌ప్ప‌ మంచి కామెడీ సీన్లు రాయ‌లేదు.

పాట‌ల్లో కంటే సీన్ల‌కే బాగా మ్యూజిక్ బాగా కొట్టాడు దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. సాంగ్స్‌ జ‌స్ట్ ఓకే అనిపిస్తాయి. సినిమాకి ఎస్సెట్‌ పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ. ఏ ఫ్రేమ్ కా ఫ్రేమ్ న‌చ్చుతుంది. సీన్లే ఎఫెక్టివ్‌గా లేక‌పోయాక‌‌ 'జెర్సీ' మూవీతో లేటెస్ట్‌గా నేష‌న‌ల్ అవార్డ్ కొట్టిన ఎడిట‌ర్ న‌వీన్ నూలి మాత్రం ఏం చేస్తాడు!

న‌టీన‌ట‌ల అభిన‌యం
అర్జున్ క్యారెక్ట‌ర్‌కి సాధ్య‌మైనంత జ‌స్టిస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు నితిన్‌. అయితే 'భీష్మ' మూవీలో న‌చ్చిన నితిన్ 'రంగ్ దే' మూవీలో నాకు న‌చ్చ‌లేదు. ప‌ర్ఫార్మెన్స్ విష‌యంలో నేన‌త‌న్ని త‌ప్పు ప‌ట్ట‌ట్లేదు. అత‌ను చేసిన‌ అర్జున్ క్యారెక్ట‌ర్ అట్టా ఉంది మ‌రి‌! అనుప‌మ క్యారెక్ట‌ర్‌ని బాగా చేసింది కీర్తి. అర్జున్‌ను మన‌సారా‌ ప్రేమించి, అత‌డు త‌న‌ని ద్వేషిస్తున్నాడ‌ని తెలిశాక‌ ఆవేద‌న చెందే పాత్ర‌లో మెచ్యూర్డ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. 

ఈ సినిమాలో సూప‌ర్‌గా యాక్ట్ చేసిన యాక్ట‌ర్ ఇంకొక‌రున్నారు. ఆయ‌న‌.. సీనియ‌ర్ న‌రేశ్‌. హీరో నితిన్ ఫాద‌ర్‌గా డెప్త్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌రేష్ అద‌ర‌గొట్టేశాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుహాస్‌, అభిన‌వ్ గోమ‌ట స‌రిగ్గా స‌రిపోయారు. జీమాట్ కోచింగ్ సెంట‌ర్ ఓన‌ర్‌గా బ్ర‌హ్మాజీ ఆక‌ట్టుకున్నాడు. ఆయ‌న ఫేషియ‌ల్‌ ఎక్స్‌ప్రెష‌న్స్ చూడాల్సిందే. వెన్నెల కిశోర్ సామ‌ర్థ్యానికి త‌గ్గ పాత్ర ల‌భించ‌లేదు. హీరోయిన్ మ‌ద‌ర్‌గా రోహిణి, హీరో అక్కా బావ‌లుగా గాయ‌త్రీ ర‌ఘురామ్‌, 'ప్రేమ‌దేశం' వినీత్ పాత్ర‌లకు త‌గ్గ‌ట్లు న‌టించారు. నితిన్‌తో త‌న్నులు తినే ఒక ఫైటింగ్ సీన్‌లో స‌త్యం రాజేశ్ క‌నిపించాడు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఓవ‌రాల్‌గా చూస్తే.. యూత్‌ని ఎట్రాక్ట్ చేసే పాయింట్లు కానీ, సీన్లు కానీ 'రంగ్ దే'లో లేవ‌నేది నా ఫీలింగ్‌. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించే మెలోడ్రామా, ఎమోష‌న్స్ ఉన్నాయి. ఏమైనా.. వీక్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో రంగులు వెలిసిన పెయింటింగ్‌లా అనిపించింది 'రంగ్ దే' పిక్చ‌ర్‌.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.