Home » Movie Reviews » మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్



Facebook Twitter Google


తారాగ‌ణం: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ఆమ‌ని, ప్ర‌గ‌తి, అమిత్‌, వెన్నెల కిశోర్‌, ఈషా రెబ్బ‌, ఫ‌రియా అబ్దుల్లా, అజ‌య్‌, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేశ్‌రెడ్డి, స‌త్య‌కృష్ణ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముఖ్తార్ ఖాన్‌
మ్యూజిక్: గోపి సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌దీశ్ ఎం వ‌ర్మ‌
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంక‌టేశ్‌
ఆర్ట్: అవినాశ్ కొల్లా
స‌మ‌ర్ప‌ణ: అల్లు అర‌వింద్‌
నిర్మాత‌లు: బ‌న్ని వాస్‌, వాసువ‌ర్మ‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ 

 

ఇంత‌వ‌ర‌కూ విజయం రుచి ఎరుగ‌ని అఖిల్ అక్కినేని, ప్రారంభంలో వ‌చ్చిన స‌క్సెస్‌ను కొన‌సాగించ‌లేక వ‌రుస ఫ్లాపులు చూసిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో గీతా ఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ సినిమా తీస్తున్న‌ద‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చాక చాలా మంది దృష్టి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మీద నిలిచింది. అఖిల్ జోడీ గోల్డెన్ గాళ్ పూజా హెగ్డే కావ‌డంతో ఈ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. "లెహ‌రాయీ" పాట, ట్రైల‌ర్ సినిమాపై హైప్‌ను పెంచాయి. ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా మ‌న ముందుకు వ‌చ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ఎలా ఉన్నాడంటే...

 

క‌థ‌:
ఎన్నారై అయిన హ‌ర్ష (అఖిల్ అక్కినేని) ఇండియాలో 20 పెళ్లి సంబంధాల‌ను ఎంచుకొని, వాటిలో ఓ సంబంధాన్ని సెల‌క్ట్ చేసుకోవ‌డానికి హైద‌రాబాద్ వ‌స్తాడు. ఆ సంబంధాల్లో విభ (పూజా హెగ్డే) సంబంధం కూడా ఒక‌టి. అయితే జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని చూడ‌క‌ముందే ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేస్తారు హ‌ర్ష త‌ల్లిదండ్రులు. అయితే ఒక ఇన్సిడెంట్ కార‌ణంగా విభ‌ను క‌లుస్తాడు హ‌ర్ష‌. స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అయిన విభ‌.. మ్యారీడ్ లైఫ్ మీద త‌న ఒపీనియ‌న్ అడిగిన‌ప్పుడు హ‌ర్ష‌ ఎవేవో ఆన్స‌ర్లు చెబుతాడు కానీ.. అవేవీ కరెక్ట్ కాదంటుంది విభ‌. దాంతో మ్యారీడ్ లైఫ్‌ విష‌యంలో త‌న‌కు క్లారిటీ లేద‌నీ, క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నాన‌నీ గ్ర‌హిస్తాడు హ‌ర్ష‌. దాంతో పాటు విభ తండ్రి (ముర‌ళీశ‌ర్మ‌)తో గొడ‌వ కార‌ణంగా పెళ్లి సంబంధాలు పూర్తిగా చూడ‌కుండానే అమెరికా వెళ్లిపోవాల్సి వ‌స్తుంది. ఆ త‌ర్వాత పెళ్లంటే ఏమిటో హర్ష తెలుసుకున్నాడా, విభ మ‌న‌సును గెలుచుకున్నాడా? అనేది మిగ‌తా క‌థ‌.



ఎనాలసిస్ :

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' చూశాక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈజ్ బ్యాక్ అనిపించింది. వైవాహిక జీవితం అంటే భార్య‌భ‌ర్త‌లు స‌ర్దుకుపోవ‌డం కాద‌నీ, ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఉండాల్సింది కేవ‌లం ప్రేమ మాత్ర‌మే కాదనీ, దాన్ని ప్ర‌ద‌ర్శించే రొమాన్స్ ఉండాల‌నీ ఈ సినిమా ద్వారా చెప్పాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు.   చాలామంది మొగుడూపెళ్లాలు స‌ర్దుకుపోవ‌డం ద్వారా త‌మ కాపురాల్ని నిలుపుకుంటున్నార‌నీ, దాంతో ఆ కాపురాలు నిస్సారంగా ఉంటున్నాయ‌నీ తెలియ‌జేయాల‌నుకున్నాడు. ఆ విష‌యాన్ని క‌న్విన్సింగ్‌గా చెప్ప‌డంలో స‌క్సీడ్ అయ్యాడు కూడా.

 

అంద‌మైన ఇల్లు, ఆ ఇంటిలో అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఏర్పాటుచేసుకొని, పెళ్లిచేసుకుంటే జీవితం హ్యాపీగా గ‌డిచిపోతుంద‌నే అభిప్రాయంతో ఉండే ఎన్నారై యువ‌కుడు, రొమాన్స్ అనే పునాది మీద వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంద‌నే స్ప‌ష్ట‌మైన ఒపీనియ‌న్‌తో ఉండే స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మ‌ధ్య డ్రామాను అనేక ఆహ్లాద‌క‌ర‌మైన స‌న్నివేశాల‌కు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ రంగ‌రించి ఫీల్ గుడ్ మూవీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'ను తీర్చిదిద్దాడు డైరెక్ట‌ర్ భాస్క‌ర్‌.

 

క‌థ‌కు కీల‌క‌మైన హ‌ర్ష‌, విభ క్యారెక్ట‌ర్స్‌ను డిజైన్ చేసిన విధానం న‌చ్చింది. ఫ‌స్టాఫ్‌లో క‌థ పెద్ద‌గా న‌డ‌వ‌దు. పెళ్లి చూపుల తతంగం సీన్లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అవి ఆహ్లాదాన్నిస్తాయి. విభ‌తో ప‌రిచ‌య‌మ‌య్యాక మ్యారీడ్ లైఫ్ విష‌యంలో హ‌ర్ష క‌న్‌ఫ్యూజ‌న్‌కు గుర‌య్యే సీన్లు కూడా క‌న్విన్సింగ్‌గా ఉన్నాయి. విభ త‌న‌కు సంధించే ప్ర‌శ్న‌ల‌ను ఆ త‌ర్వాత త‌ను వెళ్లే పెళ్లిచూపుల్లో అమ్మాయిల‌కు హ‌ర్ష వేయ‌డం, వాళ్లు క‌న్‌ఫ్యూజ్ అవ‌డం, కంగారుప‌డ్డం ఆక‌ట్టుకుంటుంది. నిజానికి ఆ ప్ర‌శ్న‌లు ప్రేక్ష‌కుల్లోనూ ఎక్కువ‌మందిని ఆలోచింప‌జేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఎవ‌రి కాపురాన్ని వాళ్లు త‌ర‌చి చూసుకుంటారు. లైఫ్ పార్ట‌న‌ర్ విష‌యంలో తామెలా ఉంటున్నారో చెక్ చేసుకుంటారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' స్టోరీ పాయింట్ ప‌ర్ప‌స్ అదే.

 

సెకండాఫ్‌లో విభ‌, హ‌ర్ష మ‌ధ్య దాగుడుమూత‌లాట‌ను డైరెక్ట‌ర్ చ‌క్క‌గా చిత్రించాడు. ఫ‌స్టాఫ్‌లో హ‌ర్ష‌పై విభ పైచేయి సాధిస్తే, సెకండాఫ్‌లో విభపై హ‌ర్ష పైచేయి సాధిస్తాడు. ఆ ర‌కంగా ఆ రెండు పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేశాడు. క్లైమాక్స్‌లో ఇద్ద‌రికీ స‌మ ప్రాధాన్యం ఇచ్చి, ఆ పాత్ర‌ల‌కు న్యాయం చేశాడు. యాక్ష‌న్ సీన్లు లేకుండా కేవ‌లం డైలాగ్స్‌తో క్లైమాక్స్‌ను న‌డిపి ఆక‌ట్టుకున్నాడు భాస్క‌ర్‌. ఫ‌స్టాఫ్‌లో ఒక‌ట్రెండు చోట్ల మిన‌హాయిస్తే టేకింగ్‌తో తొలినాటి భాస్క‌ర్‌ను అత‌ను గుర్తుచేశాడు.

 

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' స్టోరీని న‌డిపించేది ఎక్కువ‌గా డైలాగులే. సంద‌ర్భానుసారం సాగే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి, అల‌రిస్తాయి. మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్‌. పాట‌లకు గోపి సుంద‌ర్ కూర్చిన స్వ‌రాలు ఎంత‌గా ర‌జింప‌జేశాయో, స‌న్నివేశాల‌కు ఇచ్చిన‌ బ్యాగ్రౌండ్ స్కోర్ అంత‌గానూ మెప్పించింది. ఫీల్ గుడ్ ఫిల్మ్‌గా ఈ సినిమా మ‌న ముందుకు రావ‌డంలో ప్ర‌దీశ్ శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ కీల‌క పాత్ర పోషించింది. డైరెక్ట‌ర్ మ‌న‌సులోని భావాల్ని అర్థం చేసుకున్న అత‌ను, స‌న్నివేశాల‌కు త‌గ్గ క‌ల‌ర్స్‌తో సినిమాను అందంగా మ‌న ముందుకు తెచ్చాడు. మార్తాండ్ వెంక‌టేశ్ త‌న అనుభ‌వాన్ని రంగ‌రించి, చ‌క్క‌ని ఎడిటింగ్‌తో సినిమా బోర్ కొట్ట‌కుండా చేశాడు. అవినాశ్ కొల్లా ఆర్ట్ వ‌ర్క్ కూడా చెప్పుకోద‌గ్గ రీతిలో ఉంది. నిర్మాణ విలువ‌లు టాప్ క్లాస్‌లో ఉన్నాయి.

 

న‌టీన‌టుల ప‌నితీరు:
టైటిల్ రోల్‌లో అఖిల్ ఆక‌ట్టుకున్నాడు. న‌టుడిగా అత‌ను ఎదిగాడ‌ని ఈ సినిమా నిరూపించింది. ఫేసియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్‌లో ఎంత ప‌రిణ‌తి చూపించాడో, డైలాగ్ డిక్ష‌న్‌లోనూ అదే ప‌రిణ‌తి చూపించాడు. క్లైమాక్స్‌లో సుదీర్ఘ‌మైన డైలాగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అత‌ని ప‌ర్ఫార్మెన్స్ చూశాక అఖిల్ స్టార్ మెటీరియ‌ల్ అని ఎవ‌రైనా అంగీక‌రిస్తారు. ఇక విభ పాత్ర‌లో పూజా గురించి ఎంతైనా చెప్పుకోవ‌చ్చు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌, ఆమె ప‌ర్ఫార్మెన్స్‌.. ఈ సినిమాకి ప్రాణం పోశాయ‌ని చెప్పాలి. స్టాండ‌ప్ కామెడీ సీన్‌తో ఎంట్రీ ఇచ్చి అంద‌ర్నీ న‌వ్వించిన ఆమె, క్లైమాక్స్‌లో అదే స్టాండ‌ప్ కామెడీ సీన్‌తో న‌వ్వించ‌కుండా భావోద్వేగానికి గురిచేస్తుంది. అఖిల్‌, పూజా ప‌ర్‌ఫెక్ట్ పెయిర్ అనిపించేలా ఉన్నారు.

 

స‌హాయ పాత్ర‌ల్లో క‌నిపించిన‌వాళ్లంతా త‌మ బాధ్య‌త‌ల్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించారు. విభ తండ్రిగా ముర‌ళీశ‌ర్మ ఎప్ప‌ట్లా త‌న‌దైన ముద్ర‌వేస్తే, హ‌ర్ష తండ్రిగా జ‌య‌ప్ర‌కాశ్ రాణించారు. సిసింద్రీలో అఖిల్ త‌ల్లిగా న‌టించిన ఆమ‌ని, ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమాలో అఖిల్ త‌ల్లిగా క‌నిపించ‌డం బాగుంది. సుడిగాలి సుధీర్, గెట‌ప్ శ్రీ‌ను త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్‌కు న‌వ్వించ‌డానికి పెద్ద ఆస్కారం ఉన్న పాత్ర ల‌భించ‌లేదు. హ‌ర్ష చూసే పెళ్లి సంబంధాల్లో క‌నిపించే అమ్మాయిల్లో ఈషా రెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా (జాతిర‌త్నాలు హీరోయిన్‌) కూడా క‌నిపించారు. అజ‌య్‌కు న‌టించ‌డానికి అవ‌కాశం ద‌క్క‌లేదు. అమిత్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ప్ర‌గ‌తి, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌మేశ్‌రెడ్డి లాంటివాళ్లు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

మ్యారీడ్ లైఫ్ గురించి చ‌క్క‌ని అర్థం చెప్పిన చ‌క్క‌ని చూడ‌ద‌గ్గ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌ల‌ర్‌'. అఖిల్‌, పూజా హెగ్డే క్యారెక్ట‌రేజేష‌న్స్ కోసం, వారి ప‌ర్ఫార్మెన్స్ చూడ్డం కోసం కూడా ఈ సినిమాని చూడొచ్చు.

                                                                              - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.