Home » Movie Reviews » మాలిక్



Facebook Twitter Google


సినిమా పేరు: మాలిక్‌
తారాగ‌ణం: ఫ‌హ‌ద్ ఫాజిల్‌, నిమిషా స‌జ‌య‌న్‌, విన‌య్ ఫోర్ట్‌, దిలీష్ పోత‌న్‌, ఇంద్ర‌న్స్‌, జోజు జార్జ్‌, స‌లీమ్ కుమార్‌, జ‌ల‌జ‌, దినేశ్ ప్ర‌భాక‌ర్‌
మ్యూజిక్‌: సుషిన్ శ్యామ్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ఎడిటింగ్‌: మ‌హేశ్ నారాయ‌ణ‌న్‌
నిర్మాత‌: ఆంటో జోసెఫ్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: మ‌హేశ్ నారాయ‌ణ‌న్‌
బ్యాన‌ర్‌: ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ
విడుద‌ల తేదీ: 15 జూలై 2021
ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ)

దేశంలోని అత్యుత్త‌మ న‌టుల్లో ఒక‌డిగా ఇప్ప‌టికే పేరు సంపాదించుకున్న ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌ట విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించిన మ‌రో సినిమా 'మాలిక్‌'. మ‌హ‌మ్మారి కార‌ణంగా అత‌ని సినిమాలు వ‌రుస‌బెట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ అవుతూ వ‌స్తున్నాయి. ఆ కోవ‌లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ‌య్యింది ఈ సినిమా. టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకున్న మ‌హేశ్ నారాయ‌ణ‌న్ డైరెక్ట్ చేసిన గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ 'మాలిక్' ఎలా ఉందంటే...

క‌థ‌: హ‌జ్ యాత్ర‌కు వెళ్లాల‌ని అహ్మ‌ద్ అలీ సులేమాన్ అలియాస్ అలీ ఇక్కా ప్లాన్ చేస్తుంటాడు. అయితే గతంలో అత‌ను చేసిన ప‌నుల వ‌ల్ల ఎయిర్‌పోర్టులో పోలీసులు ప‌ట్టుకుంటారు. భ‌యంక‌ర‌మైన అత‌ని గ‌తం, ప్ర‌జ‌ల్లో అత‌నికున్న ప‌లుకుబ‌డి కార‌ణంగా 14 రోజుల రిమాండ్‌లోనే అత‌నిని మ‌ట్టుబెట్టాల‌ని, లేక‌పోతే త‌మ‌కు అత‌డి వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నీ పోలీస్ అధికారులు డిసైడ్ చేస్తారు. ఈ రిమాండ్ పీరియ‌డ్‌లో అలీ ఇక్కా ప్రాణాల‌ను కాపాడుకుంటాడా?  లేక అత‌ని జీవితం ముగిసిపోతుందా? అనేది ప్ర‌ధానాంశం.



ఎనాలసిస్ :

ఓపెనింగ్ ఎపిసోడ్‌తోటే క‌థ‌లో మ‌నం లీన‌మైపోతాం. 11 నిమిషాల నిడివి ఉన్న ఆ బ్రిలియంట్ ఎపిసోడ్‌లో క‌నీసం ఓ వంద‌మంది ఆర్టిస్టులు ఆగ‌కుండా మూవ్ అవుతూ ఉంటే, ఆ షాట్ ఎండింగ్‌లో 'మాలిక్' అనే టైటిల్ రావ‌డం.. వావ్ అనిపించ‌క మాన‌దు. ఫ‌స్టాఫ్ మొత్తానికీ బెస్ట్ షాట్ అదే. 'మాలిక్‌' కథ మ‌న‌కు కొత్త‌దేమీ కాదు. మ‌ణిర‌త్నం-క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ మూవీ 'నాయ‌క‌న్' నుంచి ఈ త‌ర‌హాలోనే ప‌లు సినిమాలు ఇప్ప‌టికే వ‌చ్చాయి. 'ద గాడ్‌ఫాద‌ర్' స్ఫూర్తితోటే 'మాలిక్' కూడా వ‌చ్చింద‌నుకోవాలి. 

క‌థ ప్ర‌కారం.. అలీ అనే ఓ యువ‌కుడు స్మ‌గ్లింగ్ చేయ‌డం ప్రారంభించి, దాని ద్వారా సంపాదించిన డ‌బ్బును త‌న‌జాతి వాళ్ల‌కు సాయం చేయ‌డానికి ఉప‌యోగిస్తాడు. జ‌నాల్లో అత‌ని పాపులారిటీ, ఇన్‌ఫ్లుయెన్స్ పెరుగుతుండ‌టంతో.. అత‌ని క్రిస్టియ‌న్ ఫ్రెండ్స్‌, అత‌డిని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తారు. దాంతో ఘ‌ర్ష‌ణ ప్రారంభ‌మ‌వుతుంది. ఫ‌లితం.. అలీ మ‌రింత శ‌క్తిమంతుడిగా, మ‌రింత ప్ర‌భావ‌వంతుడిగా, సుప్రీమ్‌గా మార‌తాడు. త‌న పాపాలు క‌డిగేసుకోవ‌డానికి హ‌జ్ యాత్ర‌కు వెళ్లాల‌ని అలీ నిర్ణ‌యించుకుంటాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో అత‌డిని ప‌ట్టుకొని, జైల్లో పెడ‌తాడు పోలీసులు. అత‌ను ఎంతటి శ‌క్తిమంతుడో తెలుసుకాబ‌ట్టి, రిమాండ్‌లో ఉండ‌గానే అత‌డిని హ‌త్య‌చేయ‌డానికి ప‌థ‌కం వేస్తారు. దానికోసం చిన్న‌వాడైన అత‌డి మేన‌ల్లుడిని ప్ర‌యోగిస్తారు. చివ‌ర‌లో ఓ ట్విస్ట్ వ‌స్తుంది.

సినిమా క‌థ చాలా సింపుల్ అనిపించిన‌ప్ప‌టికీ, ఈ క‌థ‌కు ప్రాణం పోసింది న‌టీన‌టులు. ఫ‌హ‌ద్ ఫాజిల్‌, నిమిష స‌జ‌య‌న్ త‌మ ప‌ర్ఫార్మెన్స్‌తో సినిమాని వేరే లెవ‌ల్‌కు తీసుకుపోయారు. వారికి మిగ‌తా న‌టులు కూడా బాగా స‌హ‌క‌రించారు. అక్క‌డ‌క్క‌డా నెరేష‌న్ నెమ్మ‌దిగా న‌డుస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. కనీసం ఒక 20 నిమిషాల నిడివిని త‌గ్గించిన‌ట్ల‌యితే 'మాలిక్' మ‌రింత గ్రిప్పింగ్‌గా, ఊపిరి బిగ‌ప‌ట్టి చూసేంత థ్రిల్లింగ్‌గా వ‌చ్చి ఉండేది. అలా చేసిన‌ట్ల‌యితే, సినిమా ఇంకా ఉంటే బాగుండేద‌నే ఫీలింగ్ ప్రేక్ష‌కుడిలో క‌లిగేది. అది జ‌ర‌గ‌లేదు. సెల్‌లో అలీని పోలీసులు చంప‌కుండా, అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని చెప్ప‌డం ఎందుకు?  దానివ‌ల్ల ముగింపులో ఏమైనా తేడా వ‌స్తుందా? అనేది అర్థం కాదు.

సినిమాలో ఇంకో క‌న్ఫ్యూజ‌న్ కూడా ఉంది. పోలీసులు ఇన్‌వాల్వ్ అనే ఒక అల్ల‌ర్ల ఎపిసోడ్ అది. ఆ అల్ల‌ర్ల‌ను రెండు పాత్ర‌ల దృక్కోణం నుంచి మ‌న‌కు చూపించాడు ద‌ర్శ‌కుడు మ‌హేశ్ నారాయ‌ణన్‌. అయితే ఈ రెండు దృక్కోణాల మ‌ధ్య టైమ్ గ్యాప్ క‌నిపిస్తుంది. రెండోసారి ఈ అల్ల‌ర్ల‌ను చూపించిన‌ప్పుడు అవెప్పుడు జ‌రిగాయ‌నేది తెలుప‌లేదు. దాంతో ఆ అల్ల‌ర్లు రెండుసార్లు జ‌రిగాయా? అనే క‌న్‌ఫ్యూజ‌న్ వ‌స్తుంది.

టెక్నిక‌ల్ విష‌యాల‌కు వ‌స్తే.. సుషిన్ శ్యామ్‌ మ్యూజిక్‌, స‌ను జాన్ వ‌ర్ఘీస్‌ సినిమాటోగ్ర‌ఫీ టాప్ స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. యాక్ట‌ర్ల ప‌ర్ఫార్మెన్స్ త‌ర్వాత సినిమాకి సంబంధించి ప్ర‌ధానంగా చెప్పుకోద‌గ్గ‌వి.. డైరెక్ష‌న్‌, మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ.

న‌టీన‌టుల అభిన‌యం..
ఈ సినిమా.. తార‌ల అభిన‌యంపై ఆధార‌ప‌డి రూపొందించింద‌ని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ముప్పై సంవ‌త్స‌రాల కాలంలో త‌న ప్రాంతంలో అధికారాన్ని చ‌లాయిస్తూ, అక్క‌డి ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావాన్ని చూపే ఒక శ‌క్తిమంత‌మైన క్యారెక్ట‌ర్‌ను ఫ‌హ‌ద్ ఫాజిల్ పోషించిన విధానాన్ని సూప‌ర్బ్ అని చెప్ప‌డం త‌క్కువ మాట‌. ఐకానిక్‌గా ఆ క్యారెక్ట‌ర్‌ను చేశాడ‌ని చెప్ప‌డం స‌రైన మాట‌. సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌ను, ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర‌ను నిమిషా స‌జ‌య‌న్ సైతం చాలా బాగా చేసింది. 

ఫ‌హ‌ద్‌, నిమిష త‌ర్వాత స్క్రీన్‌పై ఎక్కువ‌సేపు క‌నిపించేది విన‌య్ ఫోర్ట్‌, దిలీష్ పోత‌న్‌. అలీని ఢీకొట్టే విల‌న్ రోల్స్‌ను ఆ ఇద్ద‌రూ చాలా బాగా చేశారు. అలీ వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కొని, అత‌డిని అంతం చేయాల‌ని ప్ర‌య‌త్నించే రాజ‌కీయ‌నాయ‌కుడిగా దిలీష్‌, అలీ కుడిభుజంగా వ్య‌వ‌హ‌రిస్తూ, అత‌ను ప్ర‌జ‌ల్లో సంపాదించుకున్న పాపులారిటీని చూసి అసూయ‌తో ర‌గిలిపోయే డేవిడ్ క్యారెక్ట‌ర్‌లో విన‌య్ ఒదిగిపోయారు. అవినీతిప‌రుడైన పోలీసాఫీస‌ర్‌గా ఇంద్ర‌న్స్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. జోజు జార్జ్ ఎప్ప‌ట్లా త‌న పాత్ర‌ను సునాయాసంగా చేశాడు. అయితే అత‌డికి మ‌రీ చిన్న రోల్ ఇవ్వ‌డం అన్యాయం.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు కొద‌వ‌లేదు. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ అయితే ఎవ‌రూ ఊహించ‌నిది. మొత్తానికి ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ మ‌రింత ఎంగేజింగ్‌గా, బ్రిలియంట్ స్క్రీన్‌ప్లేతో న‌డుస్తూ మ‌న‌కు ఒక సూప‌ర్బ్ గ్యాంగ్‌స్ట‌ర్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్‌నిస్తుంది 'మాలిక్‌'. క‌చ్చితంగా ప్రేక్ష‌కులు వాట్ ఎ ఫిల్మ్ అనుకోకుండా ఉండ‌లేరు. థియేట‌ర్‌లో చూడాల్సిన సినిమా.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

 

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.