Home » Movie Reviews » చోర్ బ‌జార్



Facebook Twitter Google


సినిమా పేరు: చోర్ బ‌జార్‌
తారాగ‌ణం: ఆకాశ్ పూరి, గెహ‌నా సిప్పీ, అర్చ‌న‌, సునీల్‌, సుబ్బ‌రాజు, సంపూర్ణేశ్ బాబు, ప్ర‌వీణ్‌, ర‌చ్చ ర‌వి, ఇమ్మాన్యుయేల్‌, న‌ల్ల వేణు
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
బ్యాగ్రౌండ్ స్కోర్: ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీశ్ చీక‌టి
ఎడిటింగ్: అన్వ‌ర్ అలీ
ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఫైట్స్: పృథ్వీ శేఖ‌ర్‌
నిర్మాత: వి.య‌స్‌. రాజు
ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: బి. జీవ‌న్ రెడ్డి
బ్యాన‌ర్: ఐ.వి. ప్రొడక్ష‌న్స్‌
విడుద‌ల తేదీ: 24 జూన్ 2022

హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తోన్న ఆకాశ్ పూరి.. ఇప్పుడు 'జార్జ్ రెడ్డి' ఫేమ్ జీవ‌న్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'చోర్ బ‌జార్' మూవీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. పాట‌లతో పాటు, ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఈ సినిమాలో విష‌యం ఉందనే సంకేతాన్నిచ్చాయి. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కుమారుడిని ఆశీర్వ‌దించ‌డానికి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ రాక‌పోయినా, త‌ల్లి లావ‌ణ్య వ‌చ్చారు. ఇదే విష‌యాన్ని బండ్ల గ‌ణేశ్ త‌న ప్ర‌సంగంలో బ‌ల్ల‌గుద్దిన‌ట్లు చెప్ప‌డంతో ఆకాశ్‌తో పాటు 'చోర్ బ‌జార్' మూవీ కూడా వార్త‌ల్లో నిలిచింది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో విడుద‌లైన ఆ సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌:- హైద‌రాబాద్‌లో చార్మినార్ స‌మీపంలో ఉండే చోర్ బ‌జార్ అనే ప్ర‌దేశం చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. అక్క‌డ బ‌చ్చ‌న్ సాబ్ (ఆకాశ్ పూరి) గ్యాంగ్ చిన్న చిన్న చోరీలు చేస్తూ జీవ‌నం సాగిస్తుంటుంది. ఒక‌సారి స్టేట్ మ్యూజియం నుంచి నిజాం న‌వాబులకు చెందిన రూ. 200 కోట్ల విలువ చేసే డైమండ్ మాయ‌మ‌వుతుంది. దాన్ని మ‌రో నెల రోజుల్లో జ‌రిగే ఎగ్జిబిష‌న్ లోగా క‌నిపెట్టి, య‌థాస్థానంలో పెట్టాల‌ని పోలీసు శాఖ‌ను ఆదేశిస్తాడు హోమ్ మినిస్ట‌ర్ (సునీల్‌). చిన్న‌నాటి స్నేహితులైన బ‌చ్చ‌న్‌, మూగ‌మ్మాయి అయిన సిమ్ర‌న్ (గెహ‌నా సిప్పీ) ప‌ర‌స్ప‌రం ప్రేమించుకుంటారు. బ‌చ్చ‌న్ దొంగ‌త‌నాలు చేస్తున్నాడ‌నే విష‌యం సిమ్ర‌న్‌కు తెలీదు. మ్యూజియంలోంచి మాయ‌మైన డైమండ్ చోర్ బ‌జార్‌లో బ‌చ్చ‌న్ గ్యాంగ్‌లోని ఓ బుడ్డోడికి దొరుకుతుంది. కానీ దాన్ని ఏదో మామూలు రాయిగా అంద‌రూ అనుకుంటారు. చోర్ బ‌జార్‌కు చేరిన ఆ డైమండ్‌ను చేజిక్కించుకోడానికి ఒక‌వైపు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ చార్లీ గ్యాంగ్‌, ఇంకోవైపు పోలీసులు అన్వేషిస్తుంటారు. చివ‌ర‌కు ఆ డైమండ్ ఎవ‌రికి ద‌క్కింది? బ‌చ్చ‌న్‌, సిమ్ర‌న్ ప్రేమ సుఖాంత‌మైందా, లేదా? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తాయి.



ఎనాలసిస్ :

ఒక‌వైపు డైమండ్ చుట్టూ న‌డిచే డ్రామా, ఇంకోవైపు బ‌చ్చ‌న్ ల‌వ్ స్టోరీతో 'చోర్ బ‌జార్‌'ను ప్రెజెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి. స్క్రీన్‌ప్లే కుదురుగా లేక‌పోవ‌డంతో డైమండ్ డ్రామా ర‌సాభాస‌గా మారిపోయి, చికాకు తెప్పించింది. బ‌చ్చ‌న్‌-సిమ్ర‌న్ ల‌వ్ స్టోరీ అయినా హృద‌యానికి హ‌త్తుకునేలా ఉందా.. అంటే అదీ లేదు. చోర్ బ‌జార్‌లోని 60 కుటుంబాలూ చోరీలు చేసుకొని బ‌తికేవే.. జేబులోని ప‌ర్సుల నుంచి కార్ల టైర్ల దాకా చోరీలు చేయ‌డం, దొంగిలించిన వ‌స్తువుల్ని త‌క్కువ రేటుకు అమ్మేయ‌డం.. ఇదీ చోర్ బ‌జార్ వాళ్లు చేసే ప‌ని. కానీ వాళ్ల‌నెవ‌ర్నీ దొంగ‌ల‌ని అన‌కూడ‌దంట‌. వాళ్ల దొంగ‌త‌నాల వ‌ల్ల న‌ష్ట‌పోయేవాళ్ల కంటే లాభ‌ప‌డేవాళ్లేన‌న్న‌ట్లు డైరెక్ట‌ర్ చిత్రించాడు. చోర్ బ‌జార్ వాళ్ల‌ను మాన‌వీయ కోణంలో చూపించాల‌ని ప్ర‌య‌త్నించడంలో త‌ప్పులేదు. అయితే దాన్ని ఇంప్రెసివ్‌గా తియ్యాలి క‌దా! ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు. 

సినిమా స్టార్ట‌యిన ద‌గ్గ‌ర్నుంచీ చివ‌రి దాకా అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న మెరుపులు మెర‌వ‌డం త‌ప్ప‌, కొన్ని డైలాగ్స్ ఆక‌ట్టుకోవ‌డం త‌ప్ప‌, మొత్తం సినిమా అంతా ఏదో గంద‌ర‌గోళంగా, శ‌బ్ద కాలుష్యంతో న‌డిచి ఠారెత్తిస్తుంది. బ‌చ్చ‌న్ సాబ్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఎలా మ‌ల‌చాల‌నే విష‌యంలో ద‌ర్శ‌కుడు తిక‌మ‌క‌ప‌డ్డాడు. చోర్ బ‌జార్ మ‌నుషుల గురించి బ‌చ్చ‌న్ ఇచ్చే స్పీచ్‌తో ప్రి క్లైమాక్స్ కోర్టు సీన్ ఓ ప్ర‌హ‌స‌నాన్ని త‌ల‌పిస్తుంది. అత‌డి క్యారెక్ట‌ర్‌తో మ‌నం స‌హానుభూతి చెంద‌క‌పోవ‌డం ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌. బ‌చ్చ‌న్ త‌ల్లి బేబీ (అర్చ‌న‌) పాత్ర‌ను నిజానికి చాలా బాగా తీర్చిదిద్దే అవ‌కాశం ఉంది. ఎమోష‌న‌ల్‌ ఫీల్ క‌లిగించాల్సిన ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కామెడీగా క‌నిపించింది. సిమ్ర‌న్ పాత్ర‌ను కొంత‌వ‌ర‌కు బాగా చిత్రించాడు ద‌ర్శ‌కుడు. హోమ్ మినిస్ట‌ర్ ఎంత మందితో డిస్క‌స్ చేసినా, మ్యూజియంలో డైమండ్ చోరీకి గుర‌య్యింద‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌క‌పోవ‌డం అస‌హ‌జ విష‌యం. కామెడీ కోసం ఉద్దేశించిన క్యారెక్ట‌ర్లు కూడా ఆ ప‌ని చేయ‌లేక‌పోయాయంటే.. అది ద‌ర్శ‌కుడి త‌ప్పే! 

కొన్ని స‌న్నివేశాల్లో డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. పాట‌లకు సురేశ్ బొబ్బిలి ఇచ్చిన‌ మ్యూజిక్ బాగానే ఉంది, ఒక్క ఐట‌మ్ సాంగ్ విష‌యంలో త‌ప్ప‌. ఆ సాంగ్ చిత్రీక‌ర‌ణ కూడా ఏమాత్రం ఆక‌ర్ష‌ణీయంగా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్ల‌లో బాగా ఉంటే, ఎక్కువ సీన్ల‌లో సౌండ్ పొల్యూష‌న్ అనిపించేట్లు ఉంది. జ‌గ‌దీశ్ చీక‌టి సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ఎడిటింగ్ సోసోగా ఉంటే, ఫైట్స్ ఫ‌ర్వాలేద‌నిపించాయి. గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ వ‌ర్క్ చోర్ బ‌జార్‌లో బాగుంది.

న‌టీన‌టుల ప‌నితీరు:- బ‌చ్చ‌న్ సాబ్ క్యారెక్ట‌ర్‌ను ఆకాశ్ పూరి సునాయాసంగా చేసుకుపోయాడు. ఆ క్యారెక్ట‌ర్‌లోని డెప్త్‌ను అర్థం చేసుకొని న‌టించాడు. మునుప‌టి సినిమాల‌తో పోలిస్తే హావ‌భావాల్లో ప‌రిణ‌తి సాధించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో రాణించాడు. వాయిస్ అత‌డికి పెద్ద ఎస్సెట్‌. మంచి స్టోరీలో, మంచి క్యారెక్ట‌ర్ ల‌భిస్తే.. అత‌ని కెరీర్ ట‌ర్న్ తీసుకుంటుంద‌ని చెప్పొచ్చు. బ‌చ్చ‌న్ త‌ల్లి బేబీ పాత్ర‌లో నిన్న‌టి హీరోయిన్ అర్చ‌న గొప్ప‌గా రాణించారు. ఆమె న‌ట‌న‌కు వంక పెట్టేదేముంది! మూగమ్మాయి సిమ్ర‌న్‌గా గెహ‌నా సిప్పీ ఆక‌ట్టుకుంది. హోమ్ మినిస్ట‌ర్‌గా సునీల్‌, చోర్ బ‌జార్‌ను మూసేయ‌డానికి ప్ర‌య‌త్నించే గ‌బ్బ‌ర్‌గా సుబ్బ‌రాజు, గ్యాంగ్‌స్ట‌ర్ మాంజాగా సంపూర్ణేశ్ బాబు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. న‌ల్ల వేణు, ర‌చ్చ ర‌వి, ఇమ్మాన్యుయేల్, యాద‌మ్మ రాజు లాంటి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు త‌మ ప‌ని తాము చేసుకుపోయారు. అన్న‌ద‌మ్ములైన లాయ‌ర్లుగా ల‌క్ష్మ‌ణ్ మీసాల డ్యూయెల్ రోల్‌లో క‌నిపించాడు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'జార్జ్ రెడ్డి' మూవీని తీసిన జీవ‌న్ రెడ్డికీ, 'చోర్ బ‌జార్' సినిమాని తీసిన జీవ‌న్ రెడ్డికీ చాలా తేడా ఉంది. ఆ సినిమాలో స‌న్నివేశాల క‌ల్ప‌న‌, వాటి చిత్ర‌ణ ఆక‌ట్టుకుంటే, ఈ సినిమాలో అవి ఆక‌ట్టుకునే రీతిలో లేక‌పోగా, సౌండ్ పొల్యూష‌న్‌తో చికాకు క‌లిగించాయి. 'చోర్ బ‌జార్‌'ను చివ‌రి దాకా చూడ‌డం స‌హ‌నానికి ప‌రీక్ష లాంటిది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.