Home » Movie Reviews » బంగార్రాజు



Facebook Twitter Google


సినిమా పేరు: బంగార్రాజు
తారాగ‌ణం: నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టి, ర‌మ్య‌కృష్ణ‌, రావు ర‌మేశ్‌, సంప‌త్ రాజ్‌, వెన్నెల కిశోర్‌, బ్ర‌హ్మాజీ, ప్ర‌వీణ్‌, సూర్య‌, ఝాన్సీ, ఫ‌రియా అబ్దుల్లా (స్పెష‌ల్ అప్పీరెన్స్‌), ద‌క్ష నాగ‌ర్క‌ర్ (గెస్ట్ అప్పీరెన్స్‌)
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఆర్ట్: బ్ర‌హ్మ క‌డ‌లి
నిర్మాత: అక్కినేని నాగార్జున‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: క‌ల్యాణ్‌కృష్ణ కుర‌సాల‌
బ్యాన‌ర్స్: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌
విడుద‌ల తేదీ: 14 జ‌న‌వ‌రి 2022

ఆరేళ్ల క్రితం సంక్రాంతికి విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన 'సోగ్గాడే చిన్నినాయ‌నా' (2016)కు సీక్వెల్‌గా 'బంగార్రాజు' వ‌స్తుంద‌ని చాలా కాలం క్రిత‌మే నాగార్జున అనౌన్స్ చేశారు. ఇన్నాళ్ల‌కు అది కార్య‌రూపం దాల్చి మ‌న ముందుకు వ‌చ్చింది. ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ క‌ల్యాణ్‌కృష్ణ కుర‌సాల మెగాఫోన్ ప‌ట్టిన ఈ సీక్వెల్‌కు సంబంధించి జ‌రిగిన ముఖ్య‌మైన మార్పు నాగ‌చైత‌న్య ఎంట్రీ. సినిమాలో అత‌ని పేరు కూడా బంగార్రాజు అని ముందుగానే తెలియ‌డంతో పెద్ద బంగార్రాజుకు మ‌న‌వ‌డిగా ఈ చిన బంగార్రాజు క‌నిపిస్తాడ‌నే విష‌యం అర్థ‌మైంది. చైతూ స‌ర‌స‌న‌ సెన్సేష‌న‌ల్ హీరోయిన్ కృతి శెట్టి న‌టించిన 'బంగార్రాజు' ఎలా ఉందంటే...

క‌థ‌:- బంగార్రాజు కోడ‌లు సీత ఒక బాబుని క‌ని చ‌నిపోతుంది. ఆ బాబుని అమ్మ స‌త్య (ర‌మ్యకృష్ణ‌)కు అప్ప‌గించి, అమెరికా వెళ్లిపోతాడు రాము. ఆ బాబుకి కూడా త‌న భ‌ర్త బంగార్రాజు పేరు పెట్టుకొని పెంచుతుంది స‌త్య‌. వాడు అచ్చం తాత గుణాల‌ను పుణికి పుచ్చుకున్న‌ట్లు అమ్మాయిల‌తో చిన్న‌త‌నం నుంచే స‌ర‌సాలాడ్డం మొద‌లుపెడ‌తాడు. వాడు టీనేజ్‌లో ఉండ‌గానే గుండె ఆగి చ‌నిపోయిన స‌త్య‌, అప్ప‌టికే స్వ‌ర్గంలో ఉన్న బంగార్రాజు (నాగార్జున‌)ను చేరుకుంటుంది. అక్క‌డ్నుంచే చిన బంగార్రాజు (నాగ‌చైత‌న్య‌)ను ఆ ఇద్ద‌రూ గ‌మ‌నిస్తుంటారు. బంగార్రాజు అల్లుడు ర‌మేశ్ (రావు ర‌మేశ్‌) కూతురు నాగ‌ల‌క్ష్మి (కృతి శెట్టి)ని ఇచ్చి పెళ్లి చెయ్యాల‌ని చిన్న‌ప్పుడే అనుకుంటారు. కానీ ఆ ఇద్ద‌రికీ క్ష‌ణం ప‌డ‌దు. నాగ‌ల‌క్ష్మి ఆ ఊరి స‌ర్పంచ్ అవుతుంది. ఆ ఇద్ద‌ర్నీ క‌ల‌పడం కోసం య‌మ‌ధ‌ర్మ‌రాజు, ఇంద్రుడి ప‌ర్మిష‌న్‌తో భూమ్మీద‌కు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా వ‌స్తారు బంగార్రాజు, స‌త్య‌. వ‌చ్చాక.. చిన బంగార్రాజు ప్రాణాల‌కు అపాయం ఉంద‌నే విష‌యం తెలుస్తుంది. ఎవ‌రి నుంచి చిన బంగార్రాజుకు ప్రాణాపాయం ఉంది? ఆ గండం నుంచి అత‌ను త‌ప్పించుకున్నాడా? అత‌నూ, నాగ‌ల‌క్ష్మి ఒక్క‌ట‌య్యారా? అనేది మిగ‌తా క‌థ‌.



ఎనాలసిస్ :

ఒరిజిన‌ల్ ఫిల్మ్ 'సోగ్గాడే చిన్నినాయనా' త‌ర‌హాలోనే సీక్వెల్‌ను కూడా న‌డ‌ప‌డానికి ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్‌కృష్ణ‌. అందులో ప్రేమించి పెళ్లిచేసుకున్న‌ బంగార్రాజు కొడుకు కోడ‌లు రాము, సీత మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తే వాటిని స‌రిదిద్ది, వారిని ఒక్క‌టి చేయ‌డానికి బంగార్రాజు న‌ర‌కం నుంచి వ‌స్తే, ఈ సీక్వెల్‌లో ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌ని చిన బంగార్రాజు, నాగ‌ల‌క్ష్మిల‌ను ఒక్క‌టి చేయ‌డానికి స్వ‌ర్గం నుంచి వ‌స్తాడు బంగార్రాజు. ఈసారి అత‌నికి తోడుగా స‌త్య కూడా వ‌చ్చిన‌ట్లు క‌థ‌ను అల్లాడు క‌ల్యాణ్‌కృష్ణ‌. క్లైమాక్స్ సీన్లను 'సోగ్గాడే చిన్నినాయ‌నా' త‌ర‌హాలోనే డిజైన్ చేశాడు.

Also read: క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య!

క‌థ‌లో ఎక్కువ భాగం చిన బంగార్రాజు, నాగ‌ల‌క్ష్మి మ‌ధ్య జ‌రుగుతుంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్య క‌ల‌హాలు కొన‌సాగుతూ, చివ‌ర‌కు ఒక‌రంటే ఒక‌రు ఇష్ట‌ప‌డే స్థితికి రావ‌డాన్ని ఇంప్రెసివ్‌గా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు. ఆ ఇద్ద‌రూ ఎలా ఒక్క‌ట‌వుతార‌నే ఆస‌క్తిని బిల్డప్ చేయ‌డంలో అత‌ను స‌ఫ‌ల‌మ‌య్యాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య కావాలనుకుంటే రొమాంటిక్ సీన్ల‌ను క‌ల్పించ‌వ‌చ్చు కానీ ద‌ర్శ‌కుడు రెండు పాత్ర‌ల ఔచిత్యానికి భంగం క‌ల‌గ‌కుండా స‌న్నివేశాల‌ను తీశాడు. చైతూ, కృతి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా ఉంది. అయితే రొమాన్స్‌ను యువ‌జంట‌కు కాకుండా బంగార్రాజు, స‌త్య జంట‌కు వ‌దిలిపెట్టాడు స్క్రీన్‌ప్లే రైట‌ర్ స‌త్యానంద్‌. కానీ వెట‌ర‌న్ పెయిర్ రొమాన్స్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుందా అనేది సందేహం. వాళ్ల‌పై తీసిన ఓ సాంగ్ ఆహ్ల‌దాన్ని క‌లిగించ‌డానికి బ‌దులు ఇబ్బంది క‌లిగించ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. 

Also read: ​నాగ్, ర‌మ్య జోడికి మ‌రో సంక్రాంతి హిట్ ద‌క్కేనా!

చిన బంగార్రాజుకు ఎవ‌రి నుంచి అపాయం పొంచివుందో మొద‌టిసారి తెలిసిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోతాం. ఆ త‌ర్వాత సెకండాఫ్‌లో అత‌డిని చంపి, త‌న ప‌గ తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన ఇంకో పాత్ర‌ను చూసి, 'సోగ్గాడే చిన్నినాయ‌నా'ను గుర్తు చేసుకుంటాం. చిన‌బంగార్రాజును చంప‌డానికి ఇంకో ప్ర‌ధాన పాత్ర కూడా త‌న‌వంతు వాటా పంచుకుంద‌నే విష‌యం క్లైమాక్స్‌కు ముందు వెల్ల‌డ‌యిన‌ప్పుడు ఆ ట్విస్ట్ అన‌వ‌స‌రం అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ అయ్యాక ఆ పాత్ర‌ను విల‌న్‌గా చూపించ‌క‌పోయినా సినిమాకు క‌లిగే న‌ష్టం ఏమీ లేద‌నిపిస్తుంది. విజువ‌ల్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువ‌లు మెప్పిస్తాయి. అనూప్ రూబెన్స్ పాట‌ల‌కు ఇచ్చిన మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటాయి.

ప్ల‌స్ పాయింట్స్‌

నాగార్జున‌, నాగ‌చైత‌న్య న‌ట‌న‌
కృతి శెట్టి గ్లామ‌ర్‌
అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌
యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌

బంగార్రాజు-స‌త్య మ‌ధ్య రొమాంటిక్ సీన్లు
కామెడీ ఆశించిన రీతిలో లేక‌పోవ‌డం
ముందుగానే గ్ర‌హించేవిధంగా క‌థ‌నం ఉండ‌టం

న‌టీన‌టుల ప‌నితీరు;- ఒరిజిన‌ల్ త‌ర‌హాలోనే ఈ మూవీలోనూ బంగార్రాజు, రాము పాత్ర‌ల్లో తండ్రీకొడుకులుగా డ్యూయ‌ల్ రోల్ చేశారు నాగార్జున‌. రాము క్యారెక్ట‌ర్‌కు క‌థ‌లో స్కోప్ బాగా త‌క్కువ‌. బంగార్రాజుగా ఎప్ప‌ట్లా చ‌లాకీ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారాయ‌న‌. మ‌న‌వ‌డికి ప్రాణాపాయం ఉంద‌ని తెలిసిన ఘ‌ట్టాల్లో ఆందోళ‌న‌ను బాగా క‌న‌ప‌ర్చారు. చిన బంగార్రాజుగా నాగ‌చైత‌న్య కొత్త‌గా ఉన్నాడు. 'సోగ్గాడే చిన్న‌నాయ‌నా'లో విలేజ్ కాస‌నోవాగా నాగార్జున ఎలా రాణించారో, ఈ సీక్వెల్‌లో అదే త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో చైతూ రాణించాడు. హుషారైన పాత్ర‌లో చెల‌రేగిపోయి చేశాడు. అత‌ని బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. 

స‌త్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు వంక పెట్టేదేముంది! ఎప్ప‌ట్లా అల‌రించారు. స‌ర్పంచ్ నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి ముచ్చ‌ట‌గా ఉంది. ఒక ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోయిన్ చేయాల్సిన క్యారెక్ట‌ర్‌లో ఆమె ఈజీగా ఇమిడిపోయింది. కృతిలో చాలా చ‌క్క‌టి న‌టి ఉంద‌ని నాగ‌ల‌క్ష్మి పాత్ర మ‌న‌కు తెలియ‌జేసింది. ఆమె తండ్రి ర‌మేశ్ పాత్ర‌లో రావు ర‌మేశ్‌, చిన బంగార్రాజు బాబాయిల పాత్ర‌ల్లో బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్‌, చిన బంగార్రాజు ఫ్రెండ్‌గా ప్ర‌వీణ్‌, ఆదిగా సూర్య‌, య‌మునిగా నాగ‌బాబు, ఇంద్రునిగా ర‌విప్ర‌కాశ్‌, సంప‌త్‌గా సంప‌త్‌రాజ్ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ఒక పాట‌లో ఫ‌రియా అబ్దుల్లా, ఇంకో పాట‌లో ద‌క్ష నాగ‌ర్క‌ర్ అల‌రించారు. టైటిల్స్‌లో చ‌ల‌ప‌తిరావు పేరు వేశారు. ఆయ‌న ఎక్క‌డ దాక్కుని ఉన్నాడో కానీ తెర‌పై క‌నిపించ‌లేదు.



తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఇద్ద‌రు బంగార్రాజుల న‌ట‌న, కృతి శెట్టి గ్లామ‌ర్‌ ఆక‌ట్టుకుంటాయి. వారు పంచే వినోదం ఒకింత అల‌రిస్తుంది. ఎక్కువ ఆశించ‌కుండా వెళ్తే రెండున్న‌ర గంట‌ల‌సేపు కాల‌క్షేపాన్నిచ్చే సినిమా 'బంగార్రాజు'.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.