Home » Movie Reviews » అంటే సుంద‌రానికీFacebook Twitter Google


సినిమా పేరు: అంటే సుంద‌రానికీ!
తారాగ‌ణం: నాని, న‌జ్రియా న‌జీమ్‌, న‌రేశ్‌, రోహిణి, న‌దియా, అళ‌గ‌న్ పెరుమాళ్‌, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, అరుణా భిక్షు, రాహుల్ రామ‌కృష్ణ‌, త‌న్వీ రామ్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, చంద్ర‌బోస్‌, హ‌సిత్ గోలి, సానాప‌తి భ‌రద్వాజ్ పాత్రుడు
మ్యూజిక్: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఎడిటింగ్: ర‌వితేజ గిరిజాల‌
ఆర్ట్: ల‌తా నాయుడు
నిర్మాత‌లు: న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
బ్యాన‌ర్: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
విడుద‌ల తేదీ: 10 జూన్ 2022

'అంటే సుంద‌రానికీ!' ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు నాని ఓ పూర్తి స్థాయి కామెడీ డ్రామా చేశాడ‌నే ఫీలింగ్ క‌లిగింది. 'బ్రోచేవారెవ‌రురా' సినిమాతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వివేక్ ఆత్రేయ‌తో అత‌ను జ‌ట్టుక‌ట్ట‌డం, న‌జ్రియా న‌జీమ్ హీరోయిన్ కావ‌డంతో ఈ సినిమాపై సినిమా ప్రియుల్లో ఆస‌క్తీ, అంచ‌నాలూ ఏర్ప‌డ్డాయి. ప్ర‌మోష‌న్స్‌తో సినిమాకి హైప్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఈరోజు వ‌చ్చిన 'అంటే సుంద‌రానికీ!' ఎలా ఉందో చూస్తే...

క‌థ‌:- చిన్న‌త‌నం నుంచీ సొంతంగా ఒక్క నిర్ణ‌య‌మూ తీసుకోకుండా నాన్న సూర్యం (న‌రేశ్‌) చెప్పిన మాట విన‌డం అల‌వాటుగా మార్చుకున్న సుంద‌ర్ ప్ర‌సాద్ (నాని) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. స్కూల్లో చ‌దువుకొనేట‌ప్పుడు త‌న‌తో పాటు స్టేజ్ డ్రామాలో న‌టించిన క్రిస్టియ‌న్ అమ్మాయి లీలా థామ‌స్‌ (న‌జ్రియా న‌జీమ్‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందిన సుంద‌ర్‌. కానీ ఆమె వంశీ అనే మ‌రో యువ‌కునితో ప్రేమ‌లో ప‌డింద‌ని తెలిసి బాధ‌ప‌డ‌తాడు. కానీ వంశీ నిజ స్వ‌రూపం తెలిశాక సుంద‌ర్‌కు ద‌గ్గ‌రై, అత‌న్ని ప్రేమిస్తుంది లీల‌. కానీ ఆమెకు జోసెఫ్ అనే యువ‌కునితో పెళ్లి జ‌రిపించాల‌ని తండ్రి థామ‌స్ (అళ‌గ‌న్ పెరుమాళ్‌) అనుకుంటాడు. దీంతో తాను త‌మ ఇంట్లో ఓ అబద్ధం ఆడ‌ట‌మే కాకుండా, లీల‌తో కూడా వాళ్లింట్లో మ‌రో అబ‌ద్ధం చెప్పిస్తాడు సుంద‌ర్‌. ఆ అబ‌ద్ధాల కార‌ణంగా వారి జీవితాల్లో ఎలాంటి ప‌రిణామాలు త‌ట‌స్థించాయి? సుంద‌ర్‌, లీల ఎలాంటి స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు?  వాటి నుంచి బ‌య‌ట‌ప‌డి, ఎలా ఒక్క‌ట‌య్యారు? అనేది మిగ‌తా క‌థ‌.ఎనాలసిస్ :

రెండు మ‌తాల‌కు చెందిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కులు ప్రేమ‌లో ప‌డితే, ఆ మ‌తాలకు సంబంధించిన విశ్వాసాల కార‌ణంగా వారు ఎలాంటి ఆటంకాలు ఎదుర‌య్యాయ‌నే అంశంతో మ‌నం ఇదివ‌ర‌కు కొన్ని సినిమాలు చూశాం. వాటిలో 'మ‌రో చ‌రిత్ర' లాంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. కానీ మ‌త విశ్వాసాల జోలికి పోకుండా రెండు భిన్న మ‌తాల‌కు చెందిన ఓ యువ‌కుడు, ఓ యువ‌తి ప్రేమ‌క‌థ రెండు అబద్ధాల కార‌ణంగా ఎలాంటి ఇక్క‌ట్లు పాల‌య్యింద‌నే విష‌యాన్ని వినోద‌భ‌రితంగా చెప్ప‌డాన్ని మ‌నం 'అంటే సుంద‌రానికీ' మూవీలో చూస్తాం. అయితే ప్ర‌థ‌మార్ధంలో సుంద‌ర్‌, లీల స్కూలు డేస్ సీన్స్ మ‌రీ ఎక్కువ‌వ‌డం, సుంద‌ర్ కంటే ముందే వంశీ అనే అత‌నితో లీల‌ ప్రేమ‌లో ప‌డింద‌ని చూపే సీన్స్ బోర్ కొట్టించాయి. సుంద‌ర్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను బిల్డ‌ప్ చేయ‌డంలో బాల్యం నాటి ఘ‌ట‌న‌లు అత‌నిపై ప్ర‌భావం చూపాయ‌ని తెలియ‌జేయ‌డానికి చైల్డ్‌హుడ్ సీన్స్ ఎక్కువ‌గా పెట్టేయ‌డంలో స్టోరీలో టెంపో ప‌లుచ‌నైపోయింది. సుంద‌ర్‌, లీల క‌లిసే ప్లాన్ చేసుకొని అమెరికాకు ప్ర‌యాణ‌మ‌య్యార‌ని ఇంట‌ర్వెల్‌లో ఓపెన్ అవ‌డం బాగానే ఉంది కానీ.. అంత‌కు ముందు స్టోరీలో ల్యాగ్ ఎక్కువైంద‌నే ఫీలింగ్ క‌ల‌గ‌డం సినిమాకు హాని చేకూర్చే ప్ర‌మాదం ఉంద‌ని ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ గుర్తించ‌లేక‌పోయాడు.

అమెరికా నుంచి వ‌చ్చాక లీలను భాగ‌స్వామిగా చేసి సుంద‌ర్ చెప్పిన రెండు అబద్ధాలు సెకండాఫ్‌లో మంచి డ్రామాను పండించాయి. ఆ ఇద్ద‌రి ఫ్ర‌స్ట్రేష‌న్ మ‌న ఫ్ర‌స్ట్రేష‌న్ అవుతుంది. కానీ ఒక పెద్ద అబ‌ద్ధాన్ని క‌ప్పిపుచ్చుకోడానికి సుంద‌ర్ ప‌దే ప‌దే అబ‌ద్ధాలు చెప్తూ రావ‌డంతో మ‌న‌కు అత‌డిపై సానుభూతితో పాటు కోపం కూడా వ‌చ్చేస్తుంటుంది. ఇంక ఈ అబ‌ద్ధాల‌కు స్వ‌స్తి చెప్పొచ్చు క‌దా అనిపిస్తుంది. అదే స‌మ‌యంలో లీల అస‌హాయ‌త‌, సుంద‌ర్‌ని న‌మ్మి త‌ను కూడా అబ‌ద్ధాలు చెప్తూ, అలా చెప్తున్నందుకు ఆమె ప‌డే యాత‌న మ‌న‌ల్ని క‌దిలిస్తుంది. సుంద‌ర్‌కూ, అత‌ని తండ్రికీ మ‌ధ్య వ‌చ్చే సీన్లు ఆక‌ట్టుకుంటాయి. అనేక బ్రాహ్మ‌ణ ఇళ్ల‌ల్లోని వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆ తండ్రి కూడా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు త‌న త‌ల్లి అంటే సుంద‌ర్ వాళ్ల బామ్మ మీద ఆధార‌ప‌డ‌టం ఆ ఇళ్ల‌ల్లో సాధార‌ణంగా క‌నిపించే మ‌రో అంశం. క్లైమాక్స్‌లో లీల‌కు సంబంధించి మ‌రో ట్విస్ట్ పెట్టి క‌థ ముగింపును మ‌రింత ఆస‌క్తిక‌రం చేయ‌డానికి య‌త్నించాడు వివేక్ ఆత్రేయ‌. ఆ ట్విస్ట్‌కు ప్రేక్ష‌కులు ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతార‌నేది సందేహం. అయితే ప్రేక్ష‌కుల ఊహ‌కు త‌గ్గ‌ట్లే ముగింపు ఉండ‌టం రిలీఫ్‌నిస్తుంది. 

డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు రైట‌ర్‌గానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు వివేక్‌. చాలా చోట్ల అత‌ని డైలాగ్స్ న‌వ్వించాయి. రైట‌ర్‌కు త‌న క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అన్నీ బాగున్నాయ‌నిపిస్తుంది. డైరెక్ట‌రే ఆచితూచి వ్య‌వ‌హ‌రించి, ప్రేక్ష‌కుల హృద‌యాల్ని రంజింప‌జేసే రీతిలో చిత్రాన్ని మ‌ల‌చాలి. ఆ ప‌రంగా చూస్తే అత‌ను రైట‌ర్‌గా స‌క్సెస్ అయ్యి, డైరెక్ట‌ర్‌గా ఒకింత‌ ఫెయిల‌య్యాడ‌ని చెప్పాలి. వివేక్ సాగ‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్ స‌న్నివేశాల్ని మూడ్‌ని అనుస‌రించి న‌డిచింది, కొండొక‌చో సీన్లలోని ఎమోష‌న్ ఎలివేట్ కావ‌డంలో దోహ‌ద‌ప‌డింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ మ‌రో ప్ల‌స్ పాయింట్‌. క‌థ‌కు త‌గ్గ‌ట్లు, స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లు కెమెరా ప‌నిచేసింది. ఎటొచ్చీ ర‌వితేజ గిర‌జాల ఎడిటింగ్‌లో షార్ప్‌నెస్ లోపించింది. డైరెక్ట‌ర్‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని అత‌ను కొన్ని అన‌వ‌స‌ర సీన్ల‌కు క‌త్తెర వేసిన‌ట్ల‌యితే, సినిమా ఇప్పుడున్న దానికంటే మ‌రింత ఆస‌క్తిక‌రంగా, వ‌చ్చి ఉండేది.

న‌టీన‌టుల ప‌నితీరు:- ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు రెండు కంటే ఎక్కువ‌గానే ఉన్నాయి. అంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సుంద‌ర్ ప్ర‌సాద్‌గా నాని, లీలా థామ‌స్‌గా న‌జ్రియా న‌జీమ్.. ఇద్ద‌రూ నాయ‌కా నాయిక పాత్ర‌ల్లో గొప్ప‌గా రాణించారు. ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని నానిని ఈ సినిమాలో చూస్తాం. త‌ను ప్రేమించిన అమ్మాయి కోసం అబ‌ద్ధం చెప్పి, త‌ద్వారా ఉత్ప‌న్న‌మ‌య్యే ప‌రిణామాల‌కు ఫ్ర‌స్ట్రేట్ అయ్యే సుంద‌ర్‌గా నాని చెల‌రేగిపోయి న‌టించాడు. న‌జ్రియా అంద‌గ‌త్తె కాదు, కానీ న‌టిగా ఆమెది ఉన్న‌త స్థాయి. లీల పాత్ర‌లో ఆమె జీవించేసింది. సుంద‌ర్ తండ్రి సూర్యంగా న‌రేశ్‌కు న‌టించ‌డానికి మ‌రో మంచి పాత్ర ల‌భించింది. దున్నేశాడు. సుంద‌ర్ త‌ల్లిగా రోహిణి, లీల త‌ల్లితండ్రులుగా న‌దియా, అళ‌గ‌న్ పెరుమాళ్ స‌రిగ్గా స‌రిపోయారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ మామూలు పాత్ర‌లో క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. సుంద‌ర్ స‌హ ఉద్యోగినిగా, అత‌ని క‌థ‌కు తోడ్ప‌డే క్యారెక్ట‌ర్‌ను చేసింది. సుంద‌ర్ బాస్‌గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుంద‌ర్ చిన్న‌నాటి స్నేహితునిగా రాహుల్ రామ‌కృష్ణ‌, లీల అక్క‌గా త‌న్వీ రామ్‌, సిద్ధాంతిగా శ్రీ‌కాంత్ అయ్యంగార్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. కీల‌క‌మైన సుంద‌ర్ బామ్మ పాత్ర‌లో అరుణా భిక్షు ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. చిన్న‌ప్ప‌టి సుంద‌ర్‌, లీలగా చేసిన బాల‌న‌టులు కూడా బాగా రాణించారు. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

ఏ సినిమా అయినా 'అబ్బా.. ఇంత సేపుందేమిటి?' అనిపించిందంటే బోర్ కొట్టించ‌డం వ‌ల్లనే. అంటే సుంద‌రానికీ! అలా ఫ‌స్టాఫ్‌లో బాగా బోర్ కొట్టించేసింది. నిడివి ఎక్కువైన ఈ సినిమాకు ప‌లు సీన్లు క‌త్తిరించినా క‌థాగ‌మ‌నానికి అడ్డం రావు అనేది నిజం. ఆ నిజాన్ని డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ గ్ర‌హించ‌లేదు. ఎడిటింగ్ షార్ప్‌గా, స్క్రీన్‌ప్లే క్రిస్ప్‌గా ఉన్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా ఈ మూవీ మ‌రింత ఆస‌క్తిక‌రంగా త‌యార‌య్యేది.

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.