'హనుమాన్' గ్రాఫిక్స్ ఘనత హైదరాబాద్ కంపెనీదే!
on Dec 1, 2022
ఇటీవల విడుదలైన 'హనుమాన్' మూవీ టీజర్ అందరిని ఆశ్చర్యపరిచింది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమాలే వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుంటే.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'హనుమాన్' మూవీ టీజర్ లోని గ్రాఫిక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ లో ఈ స్థాయి అవుట్ పుట్ ఎలా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ గ్రాఫిక్స్ ఘనత హైదరాబాద్ కంపెనీది కావడం విశేషం.
తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శత్వంలో రూపు దిద్దుకుంటున్న సూపర్ హీరో ఫిల్మ్ 'హనుమాన్'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రశంసలు అందుకుంటుంది. అందుకు కారణం మూవీ కంటెంట్ తో పాటు వీఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో అద్భుతః అనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన 'హేలో హ్యూస్ స్టూడియోస్'(Halo Hues Studios) అనే సంస్థ కావడం అందరి ఆశ్చర్యపరుస్తోంది. వీఎఫ్ఎక్స్ ప్రాధాన్యత కలిగిన చిత్రాలను రూపొందించే దర్శకనిర్మాతలందరూ ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారని తెలుస్తోంది.
అంజనాద్రి అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ తో కలిసి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య తారాగణంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు... తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, హిందీ డిజిటల్ హక్కులను ఇప్పటికే జీ నెట్ వర్క్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం.