మూడోరోజు జోరుగా అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’..
on Nov 3, 2021
కదం కదం కదిపారు. అలుపెరగకుండా పోరాడుతున్నారు. వారి లక్ష్యం ఒకటే. వారి గమ్యం ఒకటే. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించడం. ఆంధ్రుల కలల కేపిటల్‌ను మూడు ముక్కలు చేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం విరమించుకోవడం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాలకుల తీరు మారడం లేదు. జగన్ సర్కారు వెనకడుగు వేయడం లేదు. దీంతో.. జగన్‌రెడ్డి బండరాయి హృదయాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. కలియుగ వెంకన్న స్వామికి మొక్కుకోవడానికి అమరావతి రైతులు దండుగా కదిలారు. తమ గోడు మిగతా జిల్లాల వారికీ తెలిసేలా.. మహా పాదయాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. సడలని సంకల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుమల బాట పట్టారు అమరావతి రైతులు.
రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. యాత్ర గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి ప్రారంభమైంది. 10.8 కిలోమీటర్ల మేర చేసే ఈ పాదయాత్ర గుంటూరు నగరంలో కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. యాత్రలో టీడీపీ నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర మూడోరోజు పుల్లడిగుంటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



