అఖిల్ తో `గాడ్ ఫాదర్` కెప్టెన్!?
on May 24, 2022
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో హీరోగా ఫస్ట్ సక్సెస్ చూశాడు అక్కినేని అఖిల్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో `ఏజెంట్`గా నటిస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. పంద్రాగస్టు స్పెషల్ గా ఆగస్టు 12న ఈ స్పై థ్రిల్లర్ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ మరో అగ్ర దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. తెలుగు చిత్రం `హనుమాన్ జంక్షన్`తో దర్శకుడిగా తొలి అడుగేసిన మోహన్ రాజా.. ఆపై తమిళనాట వరుస విజయాలతో స్టార్ కెప్టెన్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో `గాడ్ ఫాదర్` తీస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ పొలిటికల్ డ్రామా.. ఆగస్టులో తెరపైకి రాబోతోందని సమాచారం. కాగా, ఈ సినిమా తరువాత కూడా టాలీవుడ్ లోనే మోహన్ రాజా నెక్స్ట్ మూవీ ఉండనుందట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో అఖిల్ కథానాయకుడిగా నటిస్తాడని బజ్. అంతేకాదు.. `హనుమాన్ జంక్షన్`, `గాడ్ ఫాదర్` తరహాలో ఇది కూడా ఓ మలయాళ చిత్రానికి రీమేక్ అని టాక్. త్వరలోనే అఖిల్, మోహన్ రాజా కాంబో మూవీపై క్లారిటీ రానున్నది.