పదహారేళ్ల వయసులో తొలి సినిమాలోనే ఎన్టీఆర్ జోడీగా నటించిన కె.ఆర్. విజయ!
on Jul 28, 2021
తెలుగులో కె.ఆర్. విజయ మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం 'శ్రీకృష్ణ పాండవీయం' (1966). నటసార్వభౌమ ఎన్టీ రామారావు సొంత సంస్థ రామకృష్ణ ఎన్.ఎ.టి. వారు నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాకు ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో, ఆయన సరసన రుక్మిణిగా నాయిక పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తారు కె.ఆర్. విజయ. మొట్టమొదటిసారిగా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టడమే కాకుండా, కత్తిమీద సాము లాంటి పౌరాణిక పాత్రలో నటించడం సాహసమే. అప్పుడామె వయసు కేవలం పదహారేళ్లు.
అయినప్పటికీ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆయన చెప్పినట్లుగా నటించి, ఆ పాత్రకు న్యాయం చేకూర్చారు కె.ఆర్. విజయ. పౌరాణిక పాత్రలు ధరిస్తున్నప్పుడు రామారావు నియమనిష్ఠలతో ఉండేవారు. దర్శకునిగా నటీనటుల గెటప్స్ దగ్గర్నుంచి అన్నీ స్వయంగా తామే చూసుకునేవారు. తమకు ఏ విధమైన ఎఫెక్ట్ కావాలో ముందే ఊహించుకొని, నటీనటులకు తెలియకుండానే వారి నుంచి ఆ ఎఫెక్టును రాబట్టుకునేవారు. ఆ తర్వాత కాలంలో పలు పౌరాణిక పాత్రలు, దేవతల పాత్రలు చేయగలిగారంటే దాని వెనుక ఎన్టీఆర్ ప్రేరణ, 'శ్రీకృష్ణ పాండవీయం'లో పనిచేసిన అనుభవం ఎంతైనా పనికొచ్చిందని కె.ఆర్. విజయ చెప్పేవారు.
ఎన్టీఆర్‌తో ఆమె నటించిన మరో మంచి సినిమా 'ఏకవీర' (1969). ఇందులో కాంతారావు, జమున కూడా ప్రధాన పాత్రలు పోషించారు. టైటిల్ రోల్ మాత్రం కె.ఆర్. విజయదే. అప్పుడు ఆమె వయసు పద్దెనిమిదేళ్లు. ఆ వయసులోనే ఆమె ఒక బరువైన, క్లిష్టమైన పాత్రను పోషించడం విశేషం. డైరెక్టర్ సి.యస్. రావు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్లారు. విడుదలకు ముందు, తర్వాత కూడా ఈ సినిమాని చూసినవాళ్లంతా చాలా బావుందన్నారు. కానీ ఈ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోయింది. అయితే కాలక్రమంలో 'ఏకవీర' ఒక క్లాసిక్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. సంగీతపరంగా, సంభాషణలపరంగా, నటీనటుల అభినయపరంగా ఈ సినిమాకు పెద్ద పేరు వచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
