‘బాలనాగమ్మ’గా శ్రీదేవి నటించిందని మనలో ఎంత మందికి తెలుసు?
on Oct 17, 2021
సినిమాగా వచ్చిన నాటకాల్లో ‘బాలనాగమ్మ’ కూడా ఒకటి. ఎన్నో నాటక సమాజాలు, పరిషత్తులు ఈ నాటకాన్ని దేశం నలుమూలలా ప్రదర్శించి పాపులర్ చేశాయి. ఇంత ప్రజాదరణ పొందిన ఈ నాటకం ఐదు సార్లు సినిమాగా రూపుదిద్దుకుంది. కాంచనమాల, మిస్ చెలం, అంజలీదేవి, జమున, శ్రీదేవి ఆయా చిత్రాల్లో టైటిల్ రోల్ పోషించారు.
ఇంతమందిలో ‘బాలనాగమ్మ’ అంటే గుర్తుకు వచ్చేది కాంచనమాలే. బాలనాగమ్మగా జమున నటించిన సినిమా అసలు విడుదలకు నోచుకోలేదు. ఇక శ్రీదేవి కూడా బాలనాగమ్మగా నటించిందనే విషయం తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది. మొదట ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా మొదలైనా, తర్వాత తెలీని కారణాల వల్ల తెలుగు వెర్షన్‌ను ఆపేసి తమిళ వెర్షన్ మాత్రమే నిర్మించారు.
కార్యవర్ధి రాజుగా శరత్‌బాబు, మాయల ఫకీరుగా సుదర్శన్, సంగుగా మంజుభార్గవి ఆ సినిమాలో నటించారు. కె. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. కె.బి. క్రియేషన్స్ బేనర్‌పై ఎ. ఖాదర్ ఈ ‘బాలనాగమ్మ’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. రాజశ్రీ మాటలు, పాటలు రాశారు.
మొదట ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరకు 1982 ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదలైంది. అప్పటికే తెలుగులో శ్రీదేవి అగ్ర తారగా వెలుగొందుతున్నప్పటికీ ఈ సినిమా అట్టర్ ఫ్లాపైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
