English | Telugu

చిన్న షార్ట్‌ ఫాల్స్‌ తప్పితే....స్ట్రాంగ్‌ అండ్‌ స్ట్రయికింగ్‌

ఈ మధ్య రోజుల్లో ఈటీవి విన్‌ సంస్ధ బాగో ఓగో చిన్న చిన్న కథలతో తక్కువ బడ్జెట్టులతో కొత్త పాత నటీనటులతో బాగానే సందడి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. కొన్ని బాగానే ఉంటున్నాయి. కొన్ని అదోలా ఉంటున్నాయి. దానాదీనా వాళ్ళ ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గదే. ఈ నేపథ్యంలో న్యూ వేవ్‌ టాలెంట్‌కి కథాసుధ స్వాగతం పలుకుతోంది. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌ ఎలా అయితే ప్రతిభావంతులైన గాయనీగాయకులకు వాళ్ళ మెరిట్‌ వెలుగులోకి తెచ్చుకునే అవకాశాన్ని పొందారో, కథాసుధ అటువంటి మహదావకాశాన్ని యువ సాంకేతికనిపుణులకు, నటీనటులకు కల్పిస్తోంది. ఈ బాధ్యతను ఆర్‌ ఆర్‌ టాకీస్‌ నిజాయితీగా భుజాలెత్తుకుంది.


ఈటీవి విన్‌ సంస్థ ఇటీవలే చేసిన విజయ్‌ కేరాఫ్‌ రామారావు కూడా అందులో భాగంగానే వచ్చింది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రాశి ఇటీవల ఎక్కడా కనిపించడం లేదు. విజయ్‌ కేరాఫ్‌ రామారావు ఎపిసోడ్‌తో మళ్ళీ సడన్‌గా దర్శనమిచ్చారు. ఆమె మదర్‌ క్యారెక్టర్‌ చేయడంతో ఈ టోటల్‌ ఎపిసోడ్‌కి అమాంతంగా వ్యూయింగ్‌ వేల్యూ వచ్చిపడింది. ఆమెను అభిమానించే ప్రేక్షకులు ఇంకా చాలామంది ఉన్న కారణంగా రాశి ప్రజెన్స్‌ ప్లస్‌ అయింది. తర్వాత శంకర్‌ మహంతి అంటే మొన్నటి వరకూ ఎవ్వరికీ తెలియదు. మయసభ వెబ్‌ సీరీస్‌ మహంతికి ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. ఆ గుర్తింపు విజయ్‌ కేరాఫ్ రామారావుకి ఓ డిఫరెంట్‌ లుక్‌ని తెచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదు. సరే....దీనిని డైరెక్ట్‌ చేసిన పివిఎన్‌ కార్తికేయ తాతమనుమడు మధ్య పేచీని ఇతివృత్తంగా తీసుకుని సెంటిమెంటల్‌ కంటెంట్‌ని అందించడానికి పెట్టిన ఎఫర్ట్‌ చర్చనీయాంశం అవుతంది. ఎందుకంటే ఇటువంటి జనరేషన్‌ గ్యాప్‌ ఉన్న కథలు పెద్ద స్క్రీన్‌ మీదగానీ, బుల్లితెర మీద గానీ కూడా ఎక్కడా దర్శనమివ్వడం లేదు. దాంతో అందరికీ ఏదో విధంగా తమతమ ఇళ్ళల్లో మరుగునపడిన బంధాల వెనుక బాధ తప్పనిసరిగా గుర్తుకి తెచ్చే ఓ మంచి ప్రయత్నం విజయ్‌ కేరాఫ్‌ రామారావు. కథాసుధ సీరీస్‌ను సీరియస్‌గా ఫాలో అవుతున్న ఎంతోమందికి విజయ్‌ కేరాఫ్‌ రామారావు ఓ కొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌.


అయితే, ఇంకొంచెం ఉండాల్సిన లెంత్‌ అరకొరగా ముగిసిపోయిందని అనిపించింది. ఏ సీనులోనూ అనవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌కి తావివ్వకుండా, పూర్తిగా సీరియస్‌గానే నడిచిన ఈ ఎపిసోడ్‌ రక్తి కట్టింది అని చెప్పాలనిపించినా, కొన్నిటిని ప్రస్తావించాలిక్కడ. మొట్టమొదట, ఇటువంటి ఇతివృత్తానికి తప్పనిసరిగా ఇంకొంచెం కాలవ్యవధి ఉంటే మరింత బాగా కనెక్ట్‌ అవడానికి అవకాశం ఉండేది. దర్శకుడు కార్తికేయ తనకి దొరికిన సమయంలో తను చెప్పాలనుకున్న ఎమోషన్‌ని ఓపెన్‌ అప్‌ చేయడానికి సమయాభావం అడ్డొచ్చింది. ఉన్నంతలో వ్యూయర్లను ఆకట్టుకోవడానికి కార్తికేయ చేసిన ప్రయత్నం ఇరుకుగా తయారైంది. దీనిమీదట ఎడిటింగ్‌ పార్ట్‌ గురించి చెప్పాలంటే అది కూడా లోపాలకి అతీతంగా అనిపించలేదు. ఇది బాగులేదని చెప్పలేం. కానీ మరింత బాగుండే అవకాశమున్నా ఎడిటర్‌ దానిని సద్వినియోగం చేసుకోలేదోమోననిపిస్తుంది. ఎలాంటి నెరేషన్‌ని అయినా ఎడిటింగ్‌తో పండించొచ్చు. ఎడిటింగ్‌ లోపాలను అధిగమించి క్వాలిటీ రైటింగ్‌, డైరక్షన్‌, నటనాభినయాలు ఇవి బాగా సపోర్ట్‌ చేశాయి. ముఖ్యంగా మ్యూజిక్‌. ఇటువంటి కథాంశాలను ఎలివేట్‌ చేసే నేపథ్య సంగీతం లేదా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు విజయ్‌ కేరాఫ్‌ రామారావుకి అదనపు ఆకర్షణని కట్టబెట్టాడు ఈశ్వర్‌ చంద్‌. కెమెరా వర్క్‌ మాత్రం ఓ బిగ్‌ ఫిల్మ్‌ ఇంపాక్టని క్రియేట్‌ చేసింది. లైటింగ్‌, షాట్‌ టేకింగ్‌, ఫ్రేమింగ్‌ కలసి వ్యూయింగ్‌ బ్యూటీ మిస్‌ కాకుండా చూశాడు డీఓపి చరణ్‌.


ఈ పాయంట్లను పక్కను బెడితే ఒక్క క్షణం కార్తికేయ టచ్‌ చేసిన యాంగిల్‌ అందరి హృదయాలను స్పృశిస్తుంది. గ్రాండ్‌ పేరెంట్స్‌ లేని ఇళ్ళే ఉండవు. వాళ్ళ అవసానదశ ప్రజెంట్‌ యూత్‌కి ఓ సబ్జెక్టు కాదు. తల్లి చేత చివరిలో దర్శకుడు చెప్పించిన డైలాగ్‌ పిల్లలకి మిస్‌ అయిపోతున్న అటాచ్‌మెంట్స్‌ గురించి ఒక్క మాటలో చెప్పించినట్టయింది. అదే ఈ మూవీకి కీ ఎలిమెంట్‌. చాలా స్టిఫ్‌గా నడిచిన స్క్రీన్‌ప్లేలో అవసరమైన ప్రతీ సీనుని జాగ్రత్తగా రాసుకున్న శ్రద్ధ చివరివరకూ సీనుకీ సీనుకీ మధ్యన కావాల్సిన బ్యాలెన్స్‌ ని నిలబెట్టడంతో విజయ్‌ కేరాఫ్‌ రామారావు- టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌ పక్కన బెడితే మంచి ప్రయత్నమే. ఇందులో మనవడి పాత్రను టేకప్‌ చేసిన దర్శకుడు కార్తికేయ తన క్యారెక్టర్‌ని చాలా కంట్రోల్‌తో రాసుకున్నాడు. తనకీ తాతకి మధ్యన జరిగిన డ్రామాకి కావాల్సిన సీన్లను, లైక్‌ తాత ప్లేట్‌ నేలమీదకేసి కొట్టిన సీను, తాత అనసవరంగా జోక్యం చేసుకుని కోప్పడిన సీను....ప్రతీ బిట్‌లో కథని చెప్పడానికి చేసిన యత్నం డైరెక్టర్‌ కమిట్‌మెంట్‌ని కనబరిచాయి. ఎక్కువ డైలాగ్‌ స్కోరుకి అవకాశం లేని చోట మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో నటుడిగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు కార్తికేయ. డైరెక్షన్‌ కెరీర్‌తో పాటుగా యాక్టింగ్‌ కెరీర్‌ మీద కూడా కార్తికేయ దృష్టి పెడితే చాలా మంది డైరెక్టర్లకు మంచి ఆప్షన్‌ అవుతాడు. నువ్వూ వాడూ ఒక్కలాటి వాళ్ళే అని తల్లి రాశికి రచయితగా తాను రాసుకున్న డైలాగ్‌కి తగిన టఫ్‌నెస్‌ బాగా మెంటైన్‌ చేశాడు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండి, సినిమాని ముందుకి నడిపించాడు.
చిన్నిచిన్ని షార్ట్‌ ఫాల్స్‌ తప్పితే......విజయ్‌ కేరాఫ్‌ రామారావు స్ట్రయికింగ్‌ కంటెంటే.