English | Telugu
'స్టార్ మా'లో కొత్త సీరియల్ 'వంటలక్క'
Updated : May 29, 2022
పరిటాల నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన `కార్తీక దీపం` సీరియల్ ఏ స్థాయిలో టాప్ రేటింగ్ తో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇందులో వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ సెలబ్రిటీగా మారిపోయి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ సీరియల్ కు ప్రధాన బలంగా నిలిచి సీరియల్ టాప్ లో ట్రెండ్ అయ్యేలా చేసింది. వంటలక్క పాత్ర కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అయితే అదే పాత్ర పేరుతో `స్టార్ మా`లో సరికొత్త సీరియల్ జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతోంది.
ధీరవీయమ్ రాజకుమారన్, శిరీన్ శ్రీ, నీరళ్ గల్ రవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటించారు. అత్యాశకు పోయి ఎలాంటి భయం లేకుండా ఊరునిండా అప్పులు చేసే ఓ యువకుడు ఓ పెద్దింటి అమ్మాయికి వల వేస్తాడు. పాతిక ఎకరాల మాగాణి, పదిహేను ఎకరాల కొబ్బరితోట.. పది ఎకరాల మామిడి తోట. పెద్ద రైస్ మిల్లు.. బంగారం ఫుల్లుగా వున్న ఓ పెద్దింటి అమ్మాయి అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆస్తిని మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు.
కానీ అతని ప్లాన్ తెలియని సదరు అమ్మాయి ఆస్తిలో తనకు చిల్లిగవ్వ కూడా అక్కర్లేదంటూ తండ్రితో శపథం చేసి తనని పెళ్లి చేసుకున్న అత్యాశ పరుడితో వెళ్లిపోతుంది. ఊహించని షాక్ కు కంగుతున్న అత్యాశ పరుడు పనీ పాట లేకుండా కాలక్షేపం చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకుని తన వెంట వచ్చిన యువతినే ఇబ్బందులకు గురిచేస్తూ వుంటాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీని కాపాడు కోవడం కోసం `వంటలక్క`గా మారుతుంది. మూడుముళ్ల బంధంపై నమ్మకం ముడిపడ్డ వ్యక్తిత్వాన్ని దారికి తీసుకొస్తుందా? అన్నది తెలియాలంటే జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతున్న `వంటలక్క` సీరియల్ చూడాల్సిందే. సోమ వారం నుంచి శని వారం ప్రతీరోజు మధ్యాహ్నం 2.30 ని.లకు ఈ సీరియల్ `స్టార్ మా`లో ప్రసారం కానుంది.