English | Telugu
బాలయ్య 'అన్ స్టాపబుల్' ఎనర్జీ.. నువ్వు 'రౌడీ' అయితే నేను 'రౌడీ ఇన్ స్పెక్టర్'!
Updated : Jan 11, 2022
'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో నటసింహం బాలకృష్ణ ఎనర్జీ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసింది. ఆయన కామెడీ టైమింగ్ కి, అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందుకే ఆహాలో ప్రసారమవుతున్న 'అన్ స్టాపబుల్' షోకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటిదాకా విడుదలైన అన్ని ఎపిసోడ్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా తొమ్మిదో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. 'లైగర్' మూవీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి పాల్గొన్న ఈ ఎపిసోడ్ ప్రోమో ఆకట్టుకుంటోంది.
సంక్రాంతి సందర్భంగా టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ లో బాలయ్య పంచెకట్టులో కనిపిస్తున్నారు. ప్రోమోలో 'మాటల గన్.. మన జగన్ కి స్వాగతం' అని పూరిని బాలయ్య ఆహ్వానించగా.. పూరి రావడం ఆలస్యం కావడంతో.. బాలయ్య ఆయన్ని ఇమిటేట్ చేసి నవ్వించారు. ఏంటి జగ్గూ లేట్ అయిందేంటి? అని అడిగిన బాలయ్య.. వెంటనే వెళ్లి గెస్ట్ సోఫాలో కూర్చొని 'ఏం చేయమంటారు సార్.. ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్' అంటూ పూరిని ఇమిటేట్ చేశారు. అదే సమయంలో ఎంటర్ అయిన పూరి బాలయ్యని హగ్ చేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నారు. తాను ఎప్పటికీ మర్చిపోలేని పూరి దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' మూవీలో తేడా సింగ్ అని బాలయ్య తెలిపారు. 'మామా ఏక్ పెగ్ లా' అంటూ తనదైన శైలిలో జోకులేసి నవ్వించారు బాలయ్య. అంతేకాదు నీకు స్పానిష్ ల్యాంగ్వేజ్ ఇష్టం కదా అంటూ బాలయ్య నోటికొచ్చిన పదాలు మాట్లాడగా.. ఇది స్పానిష్ కాదంటూ పూరి చెప్పడం నవ్వులు పూయించింది.
ఇక ప్రోమోలో బాలయ్య పంచె పైకి కట్టి విజయ్ తో బాక్సింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అర్జున్ రెడ్డికి సమరసింహా రెడ్డి స్వాగతం అన్న బాలయ్య.. నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ అని అన్నారు. ఛార్మిపై కూడా తనదైన శైలిలో పంచ్ లు పేల్చారు బాలయ్య. 'అల్లరి పిడుగు' సినిమా టైంలో అల్లరిగా ఉండేదానివి, ఇప్పుడు పిడుగులా తయారయ్యావ్ అని ఛార్మిని బాలయ్య అన్నారు. అలాగే ముగ్గురు గెస్ట్ లకు కొబ్బరి బోండాలు స్వయంగా కొట్టి ఇచ్చిన బాలయ్య.. ఈ సైడ్ బిజినెస్ ఏదో బాగుందే అని నవ్వించారు. ఇక కొబ్బరి బోండం తీసుకున్న ఛార్మి బ్యాంకాక్ లో అయితే ఇందులో వోడ్కా కలిపిస్తారని అనగా.. అన్ని చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం అని బాలయ్య తన టైమింగ్ తో అదరగొట్టారు.
జనవరి 14 నుంచి ఆహాలో ప్రసారం కానున్న ఎపిసోడ్ కి గత ఎపిసోడ్స్ కి మించిన రెస్పాన్స్ రావడం ఖాయమనిపిస్తోంది.