English | Telugu
తమిళ బుల్లితెరపై దూసుకుపోతున్న తెలుగమ్మాయి!
Updated : Jul 21, 2021
తమిళ కొత్త సీరియల్ 'అభి టైలర్'తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యింది తెలుగమ్మాయి రేష్మ పసుపులేటి. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తన ఉద్వేగాన్ని అభిమానులతో పంచుకుంది. 'అభి టైలర్' సీరియల్‌లో ఆమె మదన్ పాండ్యన్ పోషిస్తోన్న హీరో అశోక్‌కు సోదరిగా నటిస్తోంది. జూలై 19న ప్రసారమైన ఎపిసోడ్ నుంచే అనామిక పాత్రతో రేష్మ వీక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సీరియలో నటిస్తోన్న తోటి నటులతో కలిసున్న ఫొటోను షేర్ చేసిన ఆమె, “My squad my favorites #abhitailor so glad to be a part of this awesome project do watch #abhitailor at 10 pm mon to sat (sic)” అని రాసుకొచ్చింది.
రేష్మ తండ్రి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన పసుపులేటి ప్రసాద్. ఆమె కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేసింది. మొదట మా టీవీలో ప్రసారమైన 'లవ్' సీరియల్‌లో డాక్టర్ దివ్య పాత్రతో బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ సీరియల్ చేస్తున్న టైమ్‌లోనే జెమిని టీవీలో 'వంటింట్లో వండర్స్' ప్రోగ్రామ్‌తో యాంకర్‌గా మారింది. టీవీ 5లో ఇంగ్లిష్ న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసింది.
2013లో సన్ టీవీ సీరియల్ 'వాణి రాణి'తో తమిళ బుల్లితెరపై అడుగుపెట్టింది రేష్మ. ఆ సీరియల్‌తో మంచి పేరు రావడంతో, వరుసగా తమిళ సీరియల్స్‌లో అవకాశాలు వచ్చాయి. ఇంతదాకా పదమూడు సీరియళ్లలో కీలక పాత్రలు చేసింది. ఓ వైపు సీరియల్స్ చేస్తూ, ఇంకోవైపు తమిళ సినిమాల్లోనూ నటించింది రేష్మ. 2015లో వచ్చిన 'మసాలా పడమ్' ఆమె తొలి తమిళ చిత్రం. బిగ్ బాస్ తమిళ్ 3లో పాల్గొన్నాక ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె 'వేలమ్మల్' సీరియల్‌లో నాగవల్లిగా, 'బాగ్యలక్ష్మి'లో రాధికగా, 'అన్బే వా'లో వందనగా నటిస్తోంది.