English | Telugu

సింగర్ సునీతతో అనుబంధం గురించి దర్శకుడి కామెంట్స్!

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చాలా మంది హీరో, హీరోయిన్లను, సింగర్లను పరిచయం చేశారు. దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు చేశారు. ఇప్పుడు బుల్లితెరపై తొలిసారిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. జీ ఛానెల్ లో ప్రసారమవుతోన్న 'డ్రామా జూనియర్స్' షోలో ఎస్వీ కృష్ణారెడ్డి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు సింగర్ సునీత, రేణు దేశాయ్ కూడా జడ్జిలుగా ఉన్నారు.

వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సింగర్ సునీతతో ఉన్న పరిచయం, ఆమెతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. 'డ్రామా జూనియర్స్'లో పిల్లలు వేసిన ఓ స్కిట్ లో సునీత, రేణు దేశాయ్, కృష్ణారెడ్డిలను వాడేశారు. దీంతో ఆ స్కిట్ ముగిసిన తరువాత ముగ్గురు జడ్జిలు స్టేజ్ మీదకు వెళ్లి డాన్స్ చేశారు.

ఆ తరువాత సునీతతో మాట్లాడుతూ కృష్ణారెడ్డి గురించి చెప్పుకొచ్చారు. ఆయన్ను మొదటిసారి చూసినప్పుడే తండ్రిలా అనిపించారని సునీత అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఎగిరే పావురమా' సినిమాలో 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' అనే పాటను పాడారు సునీత. అప్పటినుండి వీరిద్దరి ప్రయాణం మొదలైంది. "ఈ పాట ఆడిషన్స్ జరిగే సమయంలో మొదటిసారి సునీత ఇంటికి అలా వస్తుంటే నా కూతురే నడిచి వస్తున్నట్లు అనిపించింది." అంటూ సునీతపై తనకున్న ప్రేమను బయటపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి.